పిల్లలు ఈ ఆటలు ఆడుకుందాం! : - ​ డా. వాసరవేణి పర్శరాములు, బాల సాహితీవేత్త, సింగారం, సిరిసిల్ల


 పరుగు తీద్దాం.. ప్రాణశక్తిని నింపుకుందాం: మన మట్టి ఆటల అద్భుత ప్రపంచం!
​నేటి బాల్యం నాలుగు గోడల మధ్య, స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లకు బంధీ అయిపోతోంది. కృత్రిమమైన వీడియో గేమ్‌ల మోజులో పడి, చెమట చిందించే ఆనందాన్ని, జట్టుగా ఆడే ఐక్యతను పిల్లలు మర్చిపోతున్నారు. ఇది కేవలం ఆటలనుంచి దూరం కావడంకాదు, ప్రకృతికి, సామాజిక వికాసానికి దూరం కావడం.తరతరంలోను కొన్ని ఆటలు కనుమరుగు కావడం బాధాకరం.  
​"మానవునిలో ప్రకృతి సిద్ధమైన సహజాతాల అపరిపక్వ రూపమే క్రీడ" అన్నారు మాక్డోగల్. మన పూర్వీకులు అందించిన ప్రతి ఆటవెనుక ఒక క్రమశిక్షణ, ఒక వ్యూహం, అపారమైన ఆరోగ్యం దాగిఉన్నాయి. ఆ మట్టివాసన, ఆకేరింతలు, ఆఉత్సాహం మళ్లీమన వీధుల్లో ప్రతిధ్వనించాలి!
​వారసత్వంగా వచ్చినమన అద్భుతమైన ఆటల లోతుల్లోకి ఒకసారివెళ్దాం రండి:
​1. చిర్రగోనె (కర్రబిల్ల): గాలిలో తేలే గురి!
​ఇదికేవలం ఆటకాదు, ఏకాగ్రతకు నిదర్శనం. జానెడు చిర్ర, మూరెడు గోనెతో మొదలయ్యే ఈఆటలో.. చిర్రను గాలిలోకిలేపి బలంగా కొడుతుంటే వచ్చేశబ్దం, ఆ వేగం అద్భుతం. ఒకటి కాలు, రెండు పెద్ది, మూడు ముచ్చు.. అంటూ లెక్కలు కడుతుంటే లెక్కలమీద పట్టు పెరుగుతుంది. ప్రత్యర్థివిసిరే చిర్రను చాకచక్యంగా తప్పించుకోవడం ఒక యుద్ధ తంత్రాన్నే తలపిస్తుంది.
​2. బొంగరాలాట: వేగానికి చిరునామా!
​ములికిపై బొంగరం గిరగిర తిరుగుతుంటే చూసేకళ్ళలో ఒకమెరుపు మెరుస్తుంది. ‘జాల’ను చుట్టి, నేలకు విసిరి, ‘జూ’ అంటూ చేతిలోకి తీసుకోవడంలో ఉండే నైపుణ్యం వేరే ఏవీడియో గేమ్‌లోనూ దొరకదు. పరస్పరం బొంగరాలను ఢీకొట్టించుకోవడం (గుచ్చడం) పిల్లల్లో పోటీతత్వాన్ని పెంచుతుంది.
​3. కోతికొమ్మచ్చి (చెట్టిరుక): కొమ్మల్లో విన్యాసం!
​చెట్టుఎక్కడం అంటే అదిఒక సాహసం. దొంగనుంచి తప్పించుకోవడానికి కోతుల్లా కొమ్మలమీద అటుఇటు దూకడం, గాలిలో వేలాడటం శరీరానికి విపరీతమైన ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. కింద గీసిన గుండంలోకి దూకడం, మళ్లీపైకి ఎక్కడం.. శ్వాస మీద నియంత్రణను, గుండె ధైర్యాన్ని పెంచుతుంది.
​4. లింగోస్ (ఏడు పెంకులాట): గురిచూసి కొట్టు!
​ఏడు పెంకులను పేర్చి, బంతితో వాటిని పడగొట్టి, ప్రత్యర్థి జట్టు బంతితో కొట్టేలోపే మళ్ళీ ఆపెంకులను అమర్చాలి. ఇందులో పరుగు ఉంది, గురిఉంది, టీమ్ వర్క్ ఉంది. బంతితగలకుండా తప్పించుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవడం నిజమైన గెలుపు!
​5. ఊపిరిగిల్ల & తుడుం దెబ్బ: వ్యూహాల ప్రతివ్యూహాలు!
​ఊపిరి బిగబట్టి ఆడే ఆటలు ఊపిరితిత్తుల శక్తిని పెంచితే, ‘తుడుందెబ్బ’ వంటి దాగుడుమూతలు మన చుట్టూఉన్న పరిసరాలను గమనించే శక్తీ (Observation skills) ని ఇస్తాయి.
​6. వంగుడు దుంకుడు & తాడుగుంజులాట: శారీరక దారుఢ్యం!
​ఒకరిపై నుంచి ఒకరు దూకడం (Leapfrog) వల్ల కాళ్ళలో సత్తువ పెరుగుతుంది. ఇక ‘తాడుగుంజులాట’ (Tug of War) అయితే బలానికి, పట్టుదలకు పరీక్ష. అందరూ కలిసి ‘హైస్సా’ అంటూ లాగుతుంటే కలిగేఐక్యతా భావం వెలకట్టలేనిది.
​మనఆటల జాబితా - అనంతమైన నిధి!
​మనదగ్గర ఎన్నిఆటలు ఉన్నాయో తెలుసా?
​సాహస క్రీడలు: కబడ్డీ, ఖోఖో, కుస్తీ, ఫల్టీలాట.
​మేధో క్రీడలు: అష్టచెమ్మ, వామనగుంటలు, చెస్, గవ్వలాట.
​సరదా ఆటలు: చెమ్మచెక్క, గిరుకాట, ఉయ్యాల ఊపుడు, వీరివీరిగుమ్మడి.
​ఏకాగ్రత ఆటలు: గోలీలాట, గచ్చకాయలు, తొక్కుడుబిల్ల.
ఇంకా ఆరోగ్యం, ఆనందం ఇచ్చే ఎన్నోఆటలు :
డోలి ఆట,నువుముక్కులెంత పెట్టుకుంంటవ్ ,ఆలంకీలంక, అష్టచెమ్మ , కోడిపుంజులాట,  పుంజీతం, జారుడుబండ, పాండబ్బలు, ముక్కుగిల్లిపో, దస్తాట, పచ్చీస్, చుక్ చుక్ రైలు, గొర్రెనుతింట, గురుగులాట , కప్పగంతులు, చక్కిలిగింత, కుర్చీపరుగు, చార్ పత్తర్, పులిమేక దొంగపోలీస్,తాటికమ్మాట, పులిమేక, కుంటుడాట, చేతులతో నడుచుడు, చెడుగుడు, గుజ్జెనగూళ్ళు, నేలబండ,,ఆకుతేలుడు మొదలగునవి.
​మట్టిలోఆడితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నలుగురితో కలిసిఆడితే నాయకత్వ లక్షణాలు అలవడుతాయి. ఓటమిని తట్టుకునే ధైర్యం, గెలుపును ఆస్వాదించే సంస్కారం ఆటలద్వారానే లభిస్తాయి.
​బాల్యమా.. మేలుకో!
సెల్ ఫోన్లను పక్కన పడేయ్. వీధిలోకి రా.. మైదానంలోకి దూకు. మట్టినితాకు, స్వేచ్ఛగా ఊపిరిపీల్చు. ఆటాడదాం.. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకుందాం! మన సంస్కృతిని కాపాడుకుందాం!

కామెంట్‌లు