మహా సముద్రాల అలలు: - డా. కందేపి రాణీప్రసాద్

 మానసిక ఉల్లాసం కోసం, విశ్రాంతి కోసం, ఆనందం కోసం కొత్త ప్రదేశాలను చూడటానికి వెళ్ళడమే 'యాత్ర' అనబడుతుంది. ఆనందం, వినోదం, విజ్ఞానం కోసం చేసే యాత్రలను విహార యాత్రలు అంటారు. స్కూలులో ఉన్నపుడు విహారయాత్రల గురించి లేఖలు రాయించే వారు. స్కూలు విద్యార్థులను దగ్గరలో ఉన్న యాత్ర స్థలాలకు తీసుకెళ్ళి చూపించే వారు. నేడు యంత్ర రంగం బాగా అభివృద్ధి చెందింది. పలువురు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు యాత్రలు చేయటం అలవాటుగా చేసుకున్నారు. మధ్యతరగతి వారు సైతం తమ పిల్లలు చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో పరాయి రాష్ట్రాలు, ఏ దేశాలు వెళుతున్నందున తల్లిదండ్రులు కూడా వాటిని చూసే అవకాశం. లభిస్తున్నది. ఏది ఏమైనా ప్రజలు కొత్త ప్రదేశాలు చూడటం పట్ల మోజు చూపిస్తున్నారు.
ఒకప్పుడు యాత్రలు సంపన్న వర్గానికి చెందినవిగా భావించేవారు. ఈనాడు అవి మధ్య తరగతే కాకుండా దిగువ మధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో విహారం కోసం తమ బడ్జెటును కేటాయించుకుంటున్నారు. ఈ యాత్రాల్లో రకరకాల యాత్రలున్నాయి. వయసు మళ్ళిన వారు ఎక్కువగా ఆధ్యాత్మక కేంద్రాలను చూస్తుంటారు. యువత వినోద 
ప్రధానమైన యాత్రలు చేస్తారు. సాహస క్రియలు ఉన్న యంత్రాలకే యువత ప్రాధాన్యమిస్తారు. కుటుంబాలతో వెళ్ళేవారు సరదాగా మన: శాంతిగా గడపడానికి సమయాన్ని కేటాయిస్తారు. చారిత్రక యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు, వినోద యాత్రలు, సాహస యాత్రలు, విజ్ఞాన యాత్రలు అంటూ విభజించచవచ్చు.
మేము ప్రధానంగా చేసే యాత్రలన్నీ విజ్ఞాన యాత్రలే. వైద్య నిపుణుల సమావేశాల సందర్భంగా ఆయా రాష్ట్రాలు, దేశాలు తిరుగుతున్నాము. ఆయా కాన్ఫరెన్సులలో చర్చించిన వైజ్ఞానిక అరోగ్య సమస్యలపై కూడా వ్యాసాలు రాస్తున్నాను. అంతర్జాతీయ పిల్లల వైద్యుల సమావేశాలను అనుసరించి నేను చూసిన విదేశాలు, వేరే రాష్ట్రాల గురించి నేను రాసిన వ్యాసాలతో రెండు పుస్తకాలు ప్రచరించాను. ఇది మూడవ పుస్తకం. నా యాత్రా పుస్తకాల పేర్లు" విహారం, కనుచూపు మేర". మొదటి పుస్తకంలో 2000 సం. నుండి 2008 సం. వరకు చూసిన కొన్ని యాత్రల గురించి రాశారు. రెండవ పుస్తకంలో 2009వ సం. నుండి. 2018వ సం.వరకు చూసిన యాత్ర వివరాలు రాశాను. ఇరవై రాష్ట్రాలు, ముప్పై ఐదుకు పైగా దేశాలు చూసినప్పటికీ ఇంకా పుస్తకాలుగా ప్రచురించలేదు. దాదాపు వంద వ్యాసాలు పత్రికలలో ప్రచురింపబడి, పుస్తక ప్రచురణ కోసం ఎదురు చూస్తున్నాయి.
నాకు ఆర్ట్ , క్రాఫ్ట్ మీద ఇష్టం ఎక్కువ కాబట్టి, నేను ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా అక్కడి సంప్రదాయ కళల గురించి, క్రాఫ్ట్‌ల గురించితెలుసుకుంటాను. వాటి గురించి వివరంగా వ్యాసాలు రాస్తాను. ఉదాహరణకు మైసూరును చూసినపుడు రవి వర్మ ఆర్ట్ గ్యాలరీలోని పెయింటింగ్‌ల గురించి వివరంగా రాశాను. అనేక రాష్ట్రాల సంప్రదాయ కళల గురించి ఒక ప్రత్యేకమైన పుస్తకాన్నే వెలువరించాను. 'వర్ణలిపి' పుస్తకంలో 22 రాష్ట్రాల ఆర్ట్ గురించి కరోనా సమయంలో దినపత్రికల్లో రాసిన వ్యాసాలను పెట్టాను.
అంతేకాక అక్కడ స్థానికంగా తయరు చేసే కళా రూపాలను కొనుక్కుంటాను. దక్షిణాఫ్రికా వెళ్ళినపుడు నిప్పుకోడి గుడ్ల మీద చేసిన పెయిటింగులు చూసి ముచ్చటపడి కొనుక్కున్చాను. అలాగే మహాబలిపురంలో గవ్వలతో చేసిన వాల్ 
హ్యాంగింగ్‌ను కష్టపడి విమానంలో తీసుకువచ్చాను. ఒరిస్సా రాష్ట్రంలోని పిపిలీ గ్రామంలో దొరికే ఆప్లిక్ వర్క్‌లో చేసిన వాల్ హ్యాంగింగ్‌ను తెచ్చుకున్నాను. మా ఇంటి హాలులో ఇప్పటికీ వేలాడుతోంది.
మా సమావేశాలు దాదాపుగా మెడికల్ కాలేజీలు, ప్రముఖ ఆసుపత్రులలో జరగటం వలన నేను వాటి వివరాలు యాత్రా చరిత్రల్లో పొందుపరుస్తున్నాను. ఆరోగ్యానికి, విద్యకు సంబంధించిన చాలా విషయాలను నేనిందులో ప్రస్తావించడం వలన చదివే వారికి విజ్ఞాన విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. ఆసుపత్రులు, చికిత్సల గురించి అవగాహన కల్పించాను.
ప్రస్తుతం ప్రచురిస్తున్న ఈ యాత్ర పుస్తకం పేరు "దారి పొడువునా సముద్రమే". ఇందులో శ్రీలంక గురించి రాసిన వ్యాసానికి పెట్టిన పేరే! ఇది. ఇందులోని మిగతా యాత్ర చరిత్రలు కూడా సముద్ర జలాలకు సంబంధించినవే. ముంబయిలోని ఆరేబియా సముద్రం, అండమాన్‌లోని అండమాన్ సముద్రం, థాయిలాండ్‌లోని దక్షిణ చైనా సముద్రం, దుబాయిలోని పర్షియన్ గల్ఫ్, ఒమన్ దేశంలోని ఒమన్ గల్ఫ్, శ్రీలంకలోని హిందూ మహాసముద్రం వంటి వాటి గురించి వివరాలు రాశాను. సముద్రాల గురించి ఆయా బీచ్‌ల గురించి ప్రధానంగా వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
భూమి ఉపరితలంలో ముప్పావు భాగం అంటే.. 71% నీరు ఆక్రమించి ఉన్నది. ఇందులో 96.5% మహాసముద్రులలో నిక్షిప్తమై ఉన్నది. పన్నెండు శాతం మంచినీరు ఉంటుంది. అది మంచు రూపంలో గడ్డ కట్టుకుని ఉంటుంది. పసిఫిక్, హిందూ, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్ మహాసముద్రాలుగా భూగ్రహం పైన ఉన్న జలం విభజించబడింది. అంటార్కిటికా మహాసముద్రంలో మనుష్యులే కాదు, జీవ జాలం కూడా నివసించదు. అమెరికా, రష్యా దేశాలు ఆర్కిటిక్ తీరాన్ని తాకుతూ ఉంటాయి. 
నేను ఈ రెండు మహా సముద్రాలను చూడలేదు. కాబట్టి మిగిలిన మూడు మహా సముద్రాల గురించి వ్యాసాలు రాశాను.
సముద్రాలపై ఈ ప్రేమ ఎందుకొచ్చిందంటే నేను సముద్ర తీర ప్రాంతమైన చీరాలలో పుట్టటమే కారణం. బాల్యమంతా సముద్రపు ఒడిలోనే గడిచింది. బంగాళాఖాతం తీర ప్రాంతమైన చీరాలలోని వాడరేవు, రామాపురం బీచ్‌లలో సముద్ర స్నానాలు చేయటం, సముద్ర అలలతో ఆటలు ఆడటం జరిగింది. నేను నా మాతృభూమి గురించి కవితలు రాసినప్పుడు కూడా "సముద్రపు అల నా కాళ్ళు కడుక్కోవటానికి నిర్మించింది " అని రాశాను. ఇసుకలోని గవ్వలు ఏరుకొచ్చి అతికించి జంతు రూపాలను తయారు చేయటం చిన్ననాటి ఆటలు.  సముద్రపు ఒడ్డున పిచ్చుక గూళ్ళు కట్టుకుని, ఆడటం ఒక అందమైన జ్ఞాపకం. ఒడ్డున పెట్టిన పాడైపోయిన పడవల్లో కూర్చుని ఫోటోలు దిగడం, చినిగిపోయిన వలల్ని కుట్టుకుంటున్న జాలరులను పరిశీలించడం తమాషాగా ఉండేది.
సముద్రం యొక్క అందమైన అలలకు నేనాక చిన్న మినీ కవితను కూడా రాశాను.
 "సముద్రంలో  ఎంత సర్ఫ్ ఒలికిందో
   ఎన్నటికీ  తరగని నురగలు "
ఈ మినీ కవిత చాలా ప్రాచుర్యం పొందింది. సముద్రం యొక్క అందమైన రూపాన్నే కాదు. ప్రళయా రూపాన్ని కూడా చూశాము. మా బంగాళఖాతంలో వచ్చిన గాలి వానలకు మా రైసు మిల్లులు పడిపోయి బియ్యం తడిచిపోయి ఒడ్లు మొలకెత్తడం కూడా చూశాను.
వేల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న దివి సీమ తుఫాను అతి భయంకరమైన తుఫాను. ఆ సమయంలో మా చీరాల ప్రాంతమంతా కొట్టుకుపోయిందని పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి, రాజధానిలో ఉన్న బంధువులంతా భయభ్రాంతులయ్యారు. ఈ దివి సీమ తుఫాను గురించి నా జ్ఞాపకాలల్లో రాశాను. ఇది పూలజాడ పుస్తకం ప్రచురితమైంది. దివి

సీమ తుఫాను గురించి అది తక్కువ మంది రికార్డు చేశారనీ అందులో నేనున్నానని విమర్శకులు ప్రశంసించారు. ఆ తుఫాను తర్వాత మా ఊరిలో 'సైక్లోను షెల్టర్' అని ఒక బిల్డింగును కట్టారు. తుఫానుల సమయంలో కరెంటు లేక దీపాలు పెట్టుకోవలసి వచ్చినపుడు కిరోసిన్ దొరకక ఇబ్బంది పడిన రోజులు, బట్టలు ఉతుక్కోవడానికి లేక పసిపిల్లల కోసం ఇంట్లోని పాత వస్త్రాలతో పాటు కొత్త వస్త్రాలు కూడా వాడిన వైనం.- ఎన్నో జ్ఞాపకాలు.
హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహా సముద్రాల విన్యాసాలను వివరించి రాసిన ఈ పుస్తకం అందరినీ అలరిస్తుందని భావిస్తున్నాను. మహా సముద్రాలతో పాటుగా, మామూలు సముద్రాలతో అనుబంధాల గురించి సైతం రాశాను. ఇంతవరకు సముద్రాల యాత్ర చరిత్రల పుస్తకాలు వచ్చాయో లేదో తెలియదు. నేను ఈ పుస్తకాన్ని సముద్ర జలాలతో ప్రచురిస్తున్నాను. మరిన్ని యాత్ర చరిత్రలలో మరొకసారి మీ ముందుకు వస్తాను.
ఇట్లు
డా.కందేపి రాణీప్రసాద్
 మేనేజింగ్ డైరెక్టర్ 
సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్
సిరిసిల్ల.
కామెంట్‌లు