డా. బిఆర్ అంబేద్కర్ కి "భారతరత్న" ..? : - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి
34 ఏళ్ల తరువాత…
భారత మాత ముద్దుబిడ్డ డా.బిఆర్
అంబేద్కర్ కు ఆలస్యంగా దక్కింది 
అత్యున్నత"భారతరత్న” పురస్కారం..!

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 
1956 లో మౌనముద్ర 
1990 లో పురస్కార పుష్పహారం...!

విదేశ విశ్వవిద్యాలయ సముద్రాల్లో 
మునిగి "జ్ఞానముత్యాలను" ఏరుకొని
తన కలంలోని సిరాచుక్కల్లో 
తన రక్తపు చుక్కలు కలిపి లిఖించిన 
అక్షరాలు...శిలపై చెక్కిన శాసనాలు…!

దీపస్తంభాల్లాంటి దేశ విదేశాల 
రాజ్యాంగాల వెలుగులో ప్రయాణించి 
రాత్రింబవళ్ళు నిద్రాహారాలను త్యజించి 
ఆలోచనల అగ్నిజ్వాలలను రగిలించి..!

చైనా గోడలా నిర్మించిన 
దృఢమైన రక్షణ కవచమే...
మన భారత రాజ్యాంగం …!
అది కేవలం పుస్తకం కాదు
పౌరహక్కుల పరమాయుధం…
ప్రజాస్వామ్యానికి ఊపిరి…
బహుజనులకు బలహీనులకు
అందిన అదృశ్య అక్షయపాత్ర..!

అట్టడుగు వారి కన్నీటి చుక్కల్ని
చట్టాల జలనిధిలో మెరిసే 
ఆణిముత్యాలుగా మలిచిన 
ఆ మహామేధావికి... 
ఆ బహుముఖ ప్రజ్ఞాశాలికి...
ఈ దేశం ఆలస్యంగా అందించిన 
అత్యున్నత పురస్కారం"భారత రత్న"..! 

అయితే…బ్రతికుండగానే 
ఈ పురస్కారం దక్కి ఉంటే
అది తాను "చిందించిన" స్వేద
బిందువులకు "అందించిన" గౌరవంగా 
వారి ముఖాన ఓ చిరునవ్వు వెలిగేదేమో..!

ఎందుకీ ఆలస్యం…?
ఎవరిది ఈ నిర్లక్ష్యం…?
అని మేధావులు మౌనంగా
మనసుల్లో ప్రశ్నిస్తున్నారు…!

అంబేద్కర్ ఆలోచనలు
అగ్నికణాల్లా వ్యాపించకూడదని
"పీడిత తాడిత బహుజనుల చేతుల్లో
“ఓటు” ఒక వజ్రాయుధంగా
"మారకూడదని…
"కొంతమంది కుహనా మేధావులు 
పన్నిన కుట్రలకు కుతంత్రాలకిది ప్రతిఫలం

బుద్ధునిలా, జీసస్‌లా కోట్లాదిమంది 
 బడుగు బలహీన వర్గాలను కదిలించే
అంబేద్కర్ అతీంద్రియ అఖండ శక్తిని
చిమ్మ చీకటిపొరల్లో దాచే ప్రయత్నం...! 

కాని సత్యం సూర్యుడిలా ఉదయించింది
అంబేద్కర్ మహిమ...అంబరాన్ని తాకింది

ఈ “భారతరత్న” ఒక గౌరవం కాదు
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఓ బహిరంగ సాక్ష్యం
అది కేవలం పురస్కారం కాదు
ఒక మహా విప్లవ వీరుని త్యాగానికి 
సంస్కారానికి దేశం చేసిన నమస్కారం…!

అందుకే చేయాలి ఆ మహాత్యాగికి 
వందనం...పాదాభివందనం... 
మోగించాలి…జయంతినాడు జయభేరి 
జయహో జయహో అంబేద్కర్ అంటూ
స్మరించాలి...అంబేద్కర్ అందరివాడంటూ
నినదించాలి...అందరి గొంతుకలు 
ఒక్కటై... జై భీమ్…జై భీమ్…అంటూ...


కామెంట్‌లు