జాతీయ విజేత తిరుమలరావుకు అక్షర కవిమిత్ర బిరుదు ప్రదానం

 పాఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, జాతీయ స్థాయి కవితల పోటీల్లో విజేతగా నిలిచి అక్షర కవిమిత్ర బిరుదు ప్రదాన పురస్కారం స్వీకరించారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు, కళారత్న డా.కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ గౌరవాధ్యక్షురాలు నూలి అనుపమ ప్రియదర్శిని, జాతీయ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి డా.సాదే బాలచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్ధసారధి నేతృత్వంలో, సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా, అభ్యుదయ సోషల్ అండ్ కల్చరల్ ఆస్కాలు సంయుక్తంగా ఈ కవితల పోటీలను నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవి పెనుగొండ శాంతి ధామ్ కల్యాణ మండపంలో సాహితీ వైభవోత్సవాల పేరిట నిర్వహించిన జాతీయ శతాధిక కవిసమ్మేళనం వేదికపై తిరుమలరావు ఈ బహుమతి సత్కారం పొందారు.
తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వైభవం, తెలుగు సాహిత్యం, తెలుగు కళలను ప్రపంచమంతా చాటి చెప్పేలా పనిచేస్తున్న శ్రీశ్రీ కళావేదిక 166వ జాతీయ శతాధిక కవిసమ్మేళనం పెనుగొండలో నిర్వహించగా ఆ వేదికపై తిరుమలరావు అక్షర కవిమిత్ర బిరుదు ప్రదాన పురస్కారంతో సన్మానిస్తూ నగదు బహుమతి కవితా విజేత సత్కారం అందుకున్నారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో  నగదు బహుమతి కవితా పోటీలకు సామాజిక అంశంపై కవితలను ఆహ్వానించగా తిరుమలరావు పంపిన ఉసురార్తనాదం ఉగ్రవాదం కవితకు విజేత స్థానం లభించింది. తిరుమలరావు తన కవితలో పహల్గాం, పఠాన్ కోట్, పుల్వామా చావుకేకలను ప్రస్తావిస్తూనే మసూద్ ముఠాల, జిహదీ మూకల, లాడెన్ల లష్కరేల ఉగ్రవాద భీకర దాడులును దుయ్యబట్టారు. పార్లమెంటునే వదలని నైజం ఇదేమి ఇజమని నీకు నీవు ప్రశ్నించుకోలేదా అని అంటూ, మదమెక్కిన మత్తుతో నువు చేసే కాల్పులకు సిగ్గుపడుతోంది నీ గన్ అంటూ తిరుమలరావు తన రచనలో చాటి చెప్పారు. తాలిబన్ల తుష్కర దుష్ట ఉగ్ర రొంపిలో చిక్కుకుంటోంది పాపం కాశ్మీరీ యువత అంటూ తన ఉసురార్తనాదం ఉగ్రవాదం కవితలో విశ్లేషించారు. తిరుమలరావుకు ఈ అక్షర కవిమిత్ర నగదు బహుమతి విజేత సత్కారాలకు ఎంపికగుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, ప్రముఖ రచయితలు వాడాడ శ్రీనివాసరావు, ఇద్ది పాపయ్య తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు