విలువిద్య: - - యామిజాల జగదీశ్
 ఓ మనిషికి పెద్ద దిగులు. ఈ ప్రపంచంలో మనమనుకున్నట్లు ఏదీ జరగడం లేదని అతని దిగులు. ఇందువల్లే అతనికి మానసిక ప్రశాంతత లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన. అసలీ జీవితమే తనకు అక్కర్లేదని అనుకోవడం మొదలుపెట్టాడు.
ఈ స్థితిలో ఓరోజు అతనికి విలువిద్య నేర్చుకోవాలని అనిపించింది. ఓ గురువుని వెతుక్కుంటూ పోయాడు. ఆ గురువుగారు అతనికి తెలిసిన విద్యలన్నీ నేర్పించారు. ఇక నువ్వు వీటన్నింటినీ మరచిపోకుండా ఉండటానికి రోజూ ప్రాక్టీస్ చేస్తుండాలన్నారు గురువుగారు.
గురువుగారి దగ్గర వీడ్కోలు తీసుకుని సొంత ఊరుకి చేరుకున్నాడతను. 
ఓ చెట్టు కాండంపైన ఓ పెద్ద వృత్తం గీసి దాని మధ్యలో ఓ చుక్క పెట్టాడు. దూరంగా నిల్చుని ఆ చుక్కను లక్ష్యంగా చేసుకుని బాణం సంధించాడు. అది కాస్తా పక్కకు పోయింది. అలాగే అతను అనేకసార్లు బాణం వదిలాడు. కానీ ఒక్కసారీ అతను వదిలిన బాణం ఆ చుక్కను తాకలేదు.

అతను కలవరపడ్డాడు. నా జాతకం ఇంతే కాబోలు అని నీరసించిపోయాడు. తాను ఏది అనుకున్నా అది జరగడం లేదని బాధ పడ్డాడు. ఏం చెయ్యాలో తెలీక ఓ రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. కాస్సేపటికి అక్కడికి ఓ పెద్దాయన వచ్చాడు.
ఏం తమ్ముడూ ఇక్కడ కూర్చున్నావు ...ఏంటీ ఉషారుగా లేవనిపిస్తోంది....అని అడిగాడా పెద్దాయన.
అప్పుడతను మానసిక ప్రశాంతత లేదన్నాడు.
ఎందువల్లా అని పెద్దాయన ప్రశ్నించాడు.
నేననుకున్నదేదీ జరగడం లేదు. ఏ లక్ష్యమూ నెరవేరడం లేదు అని నొచ్చుకున్నాడు.
సరేగానీ, నాతో రా అని అతనిని  పొరుగూరుకి తీసుకుపోయాడు.
అక్కడ అనేక చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లపైన వృత్తాలు గీసి ఉన్నాయి. వాటి మధ్య నల్ల చుక్క ఉంది. ఆ చుక్కను లక్ష్యంగా చేసుకుని వదిలిన బాణమేదీ గురి  తప్పలేదనిపించేలా గుచ్చుకుని ఉండటం కనిపించింది. 
ఎవరబ్బా అతను? ప్రతీ బాణమూ గురి తప్పక చుక్కనే తాకింది  అని ఆశ్చర్యపోయాడు.  ఆ వ్యక్తిని చూడాలని ఉందన్నాడు పెద్దాయనతో.
అందుకేగా నిన్ను ఇక్కడికి తీసుకువచ్చానన్నాడు పెద్దాయన.
కానీ ఓ విషయం అన్నాడు పెద్దాయన. ఏమిటది అని అడిగాడు అతను.
అతను ఓ పిచ్చోడు. అతను తాననుకున్నట్టే ఈ ప్రపంచంలో అంతా జరుగుతోందని అనుకుంటూ ఉంటాడు అన్నాడు పెద్దాయన.
అయితే అతనిని చూడాలని ఉందన్నాడు. జీవిత రహస్యమేమిటో అతని నించి తెలుసుకోవాలనుందన్నాడు.
మిత్రులారా, ఆ మనిషిని మనమూ కలవచ్చు. అంతకన్నా ముందు ఓ మాట. 
మనకు అతనికీ ఏమిటి తేడానో తెలుసా....మనల్ని అనుసరించే ఈ ప్రపంచం జరగాలనుకుంటాం మనం....కానీ ఆ అతను ఈ ప్రపంచాన్ని అనుసరించి మనం నడిస్తే ఏమిటని అనుకుంటున్నాడు. అంతే తేడా అల్లా.

సరే ... అతనిని చూద్దాం...
అదిగో మన మనిషీ ఆ పెద్దాయనా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళారు. 


అతనిని ఏదో అడిగారు. విలువిద్యలో నువ్వు చాలా గట్టివాడివేగా అన్నాడు నిరాశానిస్పృహల మనిషి.
అదేం లేదు....నాకూ విలువిద్యకూ ఎలాంటి సంబంధమూ లేదన్నాడతను.
మరి అడిగాడు నిరాశావాది.
అతను నవ్వుతూ చెప్పాడు...
అదేమీ పెద్ద విషయం కాదు. మొదట చెట్టు మీద బాణం వదులుతాను. ఆ తర్వాత దగ్గరకు వెళ్ళి దాని చుట్టూ ఓ వృత్తం గీస్తాను. అంతే అన్నాడు.
  

కామెంట్‌లు