సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము- 216 వ రోజు
విదురుడు " రాజా! నీ బంధువు, హితుడు, సేవకుడు, శాంతమూర్తి అయిన ధర్మరాజు నీకు కీడు తలపెడతాడా? అతని రాజ్యాన్ని అతనికి ఒప్పగించి ఇప్పటికైనా నీవు నీ కుమారులు చేసిన తప్పు సరిదిద్దు. ధర్మరాజు నిన్ను పెదనాన్న వైనా తండ్రిలా చూస్తున్నాడు కనుక సహిస్తున్నాడు. నీవు, నీ కొడుకు దుర్యోధనుడు రాజ్యభారాన్ని  శకుని, కర్ణ, దుశ్శాసనుల మీద మోపారు. అది చివరిదాకా కొనసాగదు. ఎందుకంటే తొందరపాటుతనం, తమ శక్తి తమకు తెలియకపోవడం, ఓర్పుల మంచికి కాదు అది నీకూ తెలుసు " అన్నాడు.
అప్పుడు ధృతరాష్ట్రుడు " విదురా! నీవు ధర్మా ధర్మాలు, నీతి అవినీతి తెలిసినవాడివి. నాకు నిద్రలేకుండా చేస్తున్న ఈ దుఃఖం ఉపశమించేలాగా నీ అమృత వచనాలను నా మీద కురిపించు " అన్నాడు.
విదురనీతి
విదురుడు " రాజా! మనిషి తనను లోకులు నిందించే పని చేయక జనులకు అంగీకారమైన రీతిలో ప్రవర్తించాలి. పరుల సంపదకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి. కోపం, పొగడ్తలకు పొంగి పోవడం, గర్వం, అసంతృప్తి, దురభిమానం, ఏ పనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం. తనను పాలించే రాజును, లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు. అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారితో తలపడతారు. ధనము, విద్య, వంశము మంచి వారికి గౌరవాన్ని, అణకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తాయి. బాణం శత్రువును నిర్జించ వచ్చూ లేక తప్పి పోవచ్చు. కాని నేర్పు గలవారి నీతి శత్రువును, రాజ్యాన్ని నాశనం చేస్తుంది.
ప్రభుత్వాన్ని చేపట్టి మంత్రము, ఉత్సాహం అనే రెంటినీ జతచేసి మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాలను సామదానభేద దండోపాయాలతో వశపరచుకొని త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణముము, అనే ఐదు ఇంద్రియాలను జయించి సంధి విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము అనే ఆరిటిని తెలుసుకొని, వేట, జూదం, పానము, స్త్రీ, వాక్కులో పరుషత్వం, దండ పారుష్యం, అర్థ దూషణం అనే ఏడు వ్యసనాలను విడిచి ప్రవర్తించేవాడే వివేకవంతుడు.
మధురమైన పదార్థాలను తాను ఒక్కడే తినడమూ, అందరూ నిద్రిస్తున్నప్పుడు తాను ఒక్కడే మేలుకోవడం, ఒక్కడే ఆలోచించడం, ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు. సత్ప్రవర్తన అనేది సముద్రమైతే దానిని దాటడానికి ఓడవలే సత్యం ఒప్పుగా ఉంటుంది. 
క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని క్షమాగుణమే మిక్కిలిగా మెరిసే ఆభరణం. మంచి సౌందర్యం కావాలనుకొనేవాళ్ళు దానిని ధరిస్తారు. 
పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం ఈ రెండిటి వలన మనిషి ఉత్తముడు అవుతాడు. సమర్థుడై ఉండి కూడా శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా తనకున్నంతలో దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించు కుంటాడు. న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వక పోవడమూ అనర్హులకు ఇవ్వడము వలన కీడు కలుగుతుంది. పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. కనుక వారు వాటి జోలికి పోకూడదు. తనకు ఉచితమైన దుస్తులు ధరించడమూ, ఆత్మ స్తుతి చేయక పోవడమూ, దానం చేసి ఎందుకు చేసానా అని చింతించక పోవడం, ఎంత బాధలో ఉన్నా కీడు పలకకపోవడం, కష్ట కాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడక ఉండుట మంచి నడవడి అనిపించుకుంటుంది.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు