పలకరా! (గజల్ - ఖండగతి): - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మాటలా మూటవై ముద్దుగా పలకరా│
ఊహలా ఊటవై ఊపుగా పలకరా॥

చూపులా చినుకులా చిలిపిగా పలకరా│
నవ్వులా పువ్వులా చక్కగా పలకరా॥

గాలిలో గంధమై గానమై పలకరా │
గుండెలో రాగమై తియ్యగా పలకరా॥

మధుమాస మల్లెలా మృదువుగా పలకరా │
మధురిమల ముచ్చట్ల జలధిగా పలకరా॥

పున్నమీ జాబిలీ వేళలో పలకరా │
విరహమూ రేపగా ప్రేమగా పలకరా॥

స్వప్నాల సంద్రమై చల్లగా పలకరా │
స్పర్శలా సుధలతో చురుకుగా పలకరా॥

రాజేంద్ర హృదయపు గీతమై పలకరా │
రాగమై కవితలా రాజుగా పలకరా॥


కామెంట్‌లు