సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము: 221 వ రోజు
భీష్ముడు
అప్పుడు భీష్ముడు " శ్రీకృష్ణుడు అర్జునుడు నర నారాయణులు. ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని నిర్మూలించ డానికి ప్రతి యుగంలోను అవతరిస్తారు. ఇప్పటికే కాలకేయులను, నివాతకవచులను సంహరించారు. వారిరువురు రెండుగా కనిపించే ఒకే శక్తి .వారిరువురిని గెలవడం హరునికైనా సాధ్యం కాదు. శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టినప్పుడు నీకు తెలుస్తుంది. అయినా సుయోధనా నీవు గర్విష్టివి. నా మాటలు లెక్క చేయవు. పరశురాముని చేత శపింప బడిన కర్ణుడు, శకుని, దుశ్శాసనుల మాటలు నీకు వీనుల విందులు. దీని ఫలితంగా యుద్ధ భూమిలో మా అందరి మరణ వార్తలు వింటావు " అనగానే కర్ణుడు లేచి " మీరు ఇలా మాటాడ తగునా! నాలో ఏ తప్పులు చూసి నన్ను నిదిస్తున్నావు? దుర్యోధనుడికి నేను ఏ కొద్దిపాటి ద్రోహము చేయలేదు. . నేనేమి చేసాను ? సుయోధనుని కొలువులో ఉంటూ అతను పెట్టిన అన్నం తింటున్నాను కనుక అతనికి హితముగా మాట్లాడుతాను. నేను ధృతరాష్ట్ర సతీ, పుత్ర, పౌత్రులకు హితము చేస్తాను లేకున్న సుయోధనుడు నన్ను ఇంత వాడిని చేస్తాడా? యుద్ధంలో పాండవులందరినీ నేనే చంపగలను " అన్నాడు. భీష్ముడు " ధృతరాష్టా! ఈ కర్ణుడు పాండవులకు ఇసుమంత అయినా పోలడు. పాండవులను గెలుస్తానని ప్రగల్భాలు చేసే వీడిని నమ్మి సుయోధనుడు పాండవులతో శత్రుత్వం వహించి యుద్ధానికి దిగుతున్నాడు. పాండవులు ఎన్నో విజయాలు సాధించారు. వీడు ఇప్పటికి ఒక్క విజయం పొందాడా? ఉత్తర గోగ్రహణంలో వీడి తమ్ముని చంపి గోవులను అర్జునుడు తరలించుకు పోతుంటే అక్కడే ఉండి వీడు ఏమి చేసాడు? ఘోష యాత్రలో నీకుమారుని గంధర్వ్యులు బంధించి తీసుకుని పోతుంటే వేడిమి చేశాడు. ఆ గంధర్వులను ఓడించి పాండవులు ఓడించ లేదా! వీడివన్ని అసత్య ప్రగల్భాలు. అంత ద్రోణుడు లేచి " మహారాజా! భీష్ముడు మీకందరికి ఆప్తుడు ఇరువురికి కావలసిన వాడు. కనుక మీ హితవు కోరి సంధి చేయమంటున్నాడు. ఖాండవ వన దహనం మొదలు అర్జునుని విజయాలు ఆలోచించండి. ఎంతో మంది ధనుస్సు పట్టిన వీరులు ఉన్నా విజయుడు అన్న పేరు ఒక్క అర్జునినికి మాత్రమే దక్కింది . అర్జునుడు అన్నంత పని చేస్తాడు " అన్నాడు. భీష్మ ద్రోణుల మాటలు విననట్లే ఉన్న ధృతరాష్టుడు వారికి సమాధానం చెప్పక " సంజయా ! ధర్మరాజుకు మన సైన్యం గురించి తెలుసా? మనసైన్యం గురించి అతడు ఏమని అనుకుంటున్నాడు? అతని వైపు ఎవరు ఉన్నారు? " అని అడిగాడు. ఆ మాటలు విన్న సంజయుడు దీర్ఘంగా నిట్టూర్చి ముర్చపోయాడు. కొంతసేపటికి స్ప్రుహలోకొచ్చి " ధృతరాష్ట్రుడు ఇంత వెర్రి వాడా ! పాండవుల బలాబలాలు అడుగు తున్నారు. ఇతనికి ఏమి చెప్పి ఏమి ప్రయోజం " అనుకుని " దేవా! మరలా చెప్తున్నాను మీరు సగ భాగం ఇస్తే యుద్ధ మాట తలపెట్టడు. అతడు సంధికి సిద్ధం అంటున్నాడు. యుద్ధం వస్తే అతడు ఎవరిని లక్ష్య పెట్టడు. నీకు తెలియనిది ఏమున్నది. బకుడిని, హిడింబుని, కీచకుని, కిమ్మీరుని వధించిన భీముడు వారి పక్షమే కదా! ఫాలాక్షుని ఓడించిన అర్జునుడు వారి పక్షమే ద్రుపది కుమారులు దృష్టద్యుమ్నుడు, భీష్ముని చంపాలని శపథం పట్టిన అంబ ద్రుపడుకి మొదట కూతురై పుట్టి దైవవశాత్తూ పురుషుడైన శిఖండి, అభిమన్యుడు, మాద్రి కుమారులు వారికి కాక ఎవరికి చేస్తారు. శ్రీకృష్ణుడు, సాత్యకి వారికి బాసటగా ఉన్నారు. ద్రుపదుడు, కేకయరాజులు, జరాసంధుని కుమారుడైన సహదేవుడు, జయత్సేనుడు, శిశుపాలుని కుమారులు వృషభుడు, దృష్టకేతు, మాయావిద్య విశారధుడు భీముని కుమారుడు ఘటోత్కచుడు వారి పక్షాన తలపడటానికి సిద్ధం. ఇంకా తూర్పు ఉత్తర దేశరాజులు ధర్మరాజుకు సాయంగా ఉన్నారు. శ్రీకృష్ణుని సాయం కన్నా మించినది లేదు కదా! ధర్మరాజుకు మనతో పోరు సల్పడానికి ఇంకేమి కావాలి? " అన్నాడు సంజయుడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు