కాల తరంగాలు: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
కాలం కలిసివస్తే—
కలల తీరాలకు కెరటాల్లా చేరతావు 
క్షణాలను కమ్మగా గడుపుతావు॥

కాలం గడిస్తే—
గుండెల్లో తలపులు తట్టుకొస్తాయి
గడియారపు గంటలు మ్రోగిస్తాయి॥

కాలం ప్రవహిస్తే—
జీవితం నదిలా సాగుతుంది
ప్రకృతి పరవశాలు పంచుతుంది॥

కాలం నడిస్తే—
చిన్న చిన్న అడుగుల్లోనే
చిరునవ్వుల చిగుర్లు పూస్తాయి॥

కాలం నిలిచిపోతే—
పసిపాప నవ్వులో, ప్రేమల ముద్దులో
ఒక్కో క్షణం ఒక్కో యుగమై నిలుస్తుంది॥

కాలం పరుగెత్తితే—
అంబరాన్ని తాకే ఆశలతో
యవ్వనం గాలిలా దూసుకుపోతుంది॥

కాలం కరుణిస్తే—
కన్నీటి దారుల్లో కరిగిన మనసుకు
కాస్త వెలుగై ఆశ దిగి వస్తుంది॥

కాలం కరిగిపోతే—
చీకటి కమ్ముకున్న వేళల్లో కూడా
వెలుగు ఉదయం పుట్టుకొస్తుంది॥

కాలం మహిమలు చూపితే —
అసాధ్యాన్ని సాధ్యమై మలచే శక్తిగా

జీవితానికి జయగీతంగా పాడిస్తుంది॥

కాలమే గురువు—
కాలమే కవిత—
కాలమే జీవన సత్యం!


కామెంట్‌లు