సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము- 222 వ రోజు
ధృతరాష్టుడు
ఇది విని ధృతరాష్టుడు " సంజయా! నీవు చెప్పినది నిజము. వారంతా ఒక ఎత్తు భీముడు ఒక ఎత్తు. అతడిని తల్చుకుంటే భయంగా ఉంది. మనలో అతడిని ఎదుర్కోడానికి ఎవరున్నారు.. దూకుడు స్వభావం కలవాడు. దుర్యోధనాధులను హింసించేవాడు. వీడే అసలు భేదానికి కారకుడు. నాలుగు మూరలు పొడవు, ఎనిమిది అంచులతో ఉన్న ఉక్కు గదను చేబట్టి వందల మందిని చంపుతూ భయంకరమైన యుద్ధం చేసే వీడిని నా కుమారులు ఎలా తట్టుకోగలరు. చిన్నప్పటి నుండి అతడు నామాట వినడు ఇప్ప్దుదు నా పుత్రులు ఇంకా కష్ట పెట్టారు. సుయోధనుడు కయ్యానికి కాలు దువ్వు తున్నాడు. వాడిని మన సైన్యంలో ఎవరు ఆపగలరు. వాడికి ఏ ఆయుధమూ పని లేదు. జరాసంధుని ఒక్క పోటుతో చంపాడు. చేతితోనే ఎందరినైనా చంపగలడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వాడికి అర్జునుడు సాయం ఉన్నాడు. ఇక ఏమి చెప్పను. అర్జునితో సమానంగా యుద్ధం చేసే వాడిని మనం చూసామా? అతనికి సారథి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ముగ్గురూ కలిస్తే కౌరవ సేనను దహిస్తారు.వారి గురించి భీష్మ, ద్రోణులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అయినా వారు మన కొరకు యుద్ధం చేస్తారు. వారికి కురు పాండవులు సమానమే కదా? నా మాట నా కుమారులు వినరు. మొదటి నుండి విదురుడు చెప్పినదే జరుగుతున్నది. సంజయా ! నేనేమి చేయను, నా కేది దారి నా కేది శరణ్యము . ధర్మరాజు వినయవంతుడు. అతనికి వుదురుడు, దృపదుడు, సోదరులు, శ్రీకృష్ణాదులు తోడు ఉండగా ధర్మరాజుతో పోరుకు తలపడటం మిడతలు పోయి మంటలో పడటం లాంటిది. వంశ నాశనం తప్పదు శాంతి మార్గమే మేలు నా కుమారులకు చెప్పడానికి ప్రయత్నిస్తాను " అన్నాడు. సంజయుడు " దేవా! మీరు చెప్పినది సబబు. మొదటినుంచి నీవు పాండవులకు కీడు కలిగిస్తూనే వున్నావు. వారి శక్తి తెలిసి కూడా నీ కొడుకులకు వశమవుతూ వుంటావు.నీకీ ధైర్యం ఎక్కడినుండి వస్తుందో నాకు తెలియడం లేదు. ఇప్పుడు కూడా ఈ బుద్ధి నిలుస్తుందని నే ననుకోను. ఈ కురు జాంగల దేశాలు వారి తండ్రి సంపాదించినవి, తర్వాత వీరు భూమినంతటిని తమ భుజబలంతో జయించారని తెలుసుకో. దానిని నీకు సమర్పించగా నీవు దానిని నాది అని భావిస్తున్నావు. నీవు ధర్మజుని విడిచినా కాని అతడు నిన్ను వదలక ఘోష యాత్రలో నీ కుమారులను రక్షించాడు. అతడు మిమ్ము ఎన్నటికీ అతిక్రమించడు. అతడిని పిలిపించి సంధి కావించండి " అన్నాడు.
సుయోధనుడు
దుర్యోధనుడు " తండ్రీ! మీ మాటలు విచిత్రముగా ఉన్నవి ఎక్కడో అడవులలో ఇడుములు పడుతున్న వారిని తెచ్చి కొంత మంది పిరికి వాళ్ళను జత చేసినంత మాత్రాన పాండవులు గెలుస్తారా? నీకు ఇంత భీతి వలదు మన బలాన్ని తక్కువగా ఛూడకు. మేము గెలుస్తాము. పరశురాముని గెలిచిన భీష్ముడు మన పక్షాన ఉన్నాడు. ద్రోణుడు, కృపాచారులు సామాన్యులా? ఈశ్వర వర ప్రసాదితుడి అశ్వథామ సామాన్యుడా? బాహ్లికుడు, సింధురాజు, సోమదత్తుడు, గాంధారరాజు సామాన్యులా? వీరిని గెలుచుట పాండవులకు శక్యమా ? మీరు సందేహించ కండి. మేము వారి అడుగులకు మడుగులు వత్తము. యుద్ధము చేస్తాము పారి పోము; ఇదే మా నిశ్చిత అభిప్రాయము. మా చేత బాధలు పడ్డవాళ్ళు దండెత్తి వస్తే పారిపోవడం చిన్నతనం కాదా? వారిని చూసి భయపడి మాకు తలవంపులు తేకండి. భీముడే కాదు నాతో తలపడి గదా యుద్ధం చేయగల వాడు ముల్లోకాలలో లేడు. భీముని నేను చంపగలను అతడు మరణిస్తే పాండవ పక్షాన యుద్ధం చేయగల వారు లేరు. అందుకే ధర్మరాజు ఐదు ఊళ్ళు ఇమ్మని అడిగాడు. కర్ణుని వద్ద సహజ కవచ కుండలాలు ఉండేవి. వాటిని ఇంద్రుడికి దానం చేసి పొందిన అమోఘమైన శక్తి ఆయుధం అర్జునిని చంపుతుంది. భీష్మాదుల శరాగ్ని వారి సేనను నాశనం చేస్తుంది. ఇక నీ మిగిలిన కుమారులు అత్యంత శక్తి మంతులు కారా? మన సైన్యం పదకండు అక్షౌహినులు వారి సైన్యం ఏడు అక్షౌహినులు. ఇది తెలియక ఎందుకు దు॰ఖిస్తున్నావు? " అని సంజయుని చూసి " సంజయా! ఇంతకూ అల్లరి మూకను తయారు చేసుకున్న ధర్మరాజు ఏమంటున్నాడో చెప్పు" అన్నాడు. సంజయుడు చెప్పసాగాడు " సుయోధనా! పాండవులు యుద్ధంఅంటే భయపడలేదు ఏదో పెళ్ళికి పోతున్నట్లు భావిస్తున్నారు.అర్జునిని పాశుపతం, భీముని గదాయుధం నమ్మి యుద్ధానికి దిగుతున్నారు " అని చెప్పి 
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు