సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 భీష్మ పర్వము ప్రథమాశ్వాసము-230 వ రోజు
పాండవుల యుద్ధసన్నాహం
పాండవులు యుద్ధ సన్నద్ధులై రణ భూమిలో ప్రవేశించారు. యుధిష్టరుడు అగ్రభాగాన వెలిగి పోతున్నాడు. ధర్మరాజుకు ఒక వైపు భీముడు గధను ధరించి నిలువగా మరొక వైపు అర్జునుడు గాండీవధారి అయి నిలిచాడు. శ్రీకృష్ణ సారధ్యంలో , కపిధ్వజం రెపరెపలాడు చుండగా అర్జునుడు ధనుష్టంకారం చేసాడు. నకుల సహదేవులు అర్జునిని అనుసరించారు. ద్రౌపదీ సుతులు తమ సైన్యాలతో మొహరించారు. ప్రతి వింధ్యుడు, శ్రుతసోముడు, శతానీకుడు, శ్రుతసేనుడు, సౌభద్రుడు తమ సైన్యాలతో రణభూమిలో ప్రవేశించారు. గజసైన్య సహితంగా ద్రుపదుడు, అతనికుమారులు, అన్నదమ్ములతో వచ్చాడు. మత్స్య దేశాధిపతి విరాటుడు, యాదవ సైన్యాలతో సాత్యకి, వీర ప్రలాపములు చేస్తూ చేకితానుడు, వీరుడు, శిఖండి యుద్ధ భూమిలో విహరిస్తున్నారు. మగధాధీశుడు సహదేవుడు సముద్రం వంటి తన సైన్యంతో యుద్ధ భూమిలో ప్రవేశించాడు. దృష్టకేతు అధిక పరాక్రమంతో సోదర సహితంగా యుద్ధ భూమిలో ప్రవేశించాడు. భీముని పుత్రుడైన ఘతోత్కచుడు రాక్షస సైన్యంతో యుద్ధ భూమిలో ప్రవేశించాడు. కేకయ రాజులు అయిదుగురు, పాండ్య రాజు, శైభ్యుడు , ఇతర దేశముల నుండి వివిధ రాజులు తమ సైన్యాలతో పాండవ పక్షాన యుద్ధం చేయవచ్చారు. దృష్టధ్యుమ్నుని అధ్యక్షతలో పాండవ సైన్యం యుద్ధ భూమిలో ప్రవేశించింది. తన సైన్యంతో తూర్పు ముఖంగా నిలబడి యుధిష్టరుడు " వీరాధి వీరులారా ! ఈ యుద్ధం మనకు జయాన్నిచ్చిన భూమిని అంతా కైవశం చేయవచ్చు లేని ఎడల వీరస్వర్గం ఇవ్వనూ వచ్చు మనం ఎందుకైనా సిద్దంగా ఉండాలి " అన్నాడు. ఆ మాటలకు దేశాధిపతులు ఉత్సాహ పూరితులై జయజయ ధ్వానాలు చేసారు.
సంజయుడు యుద్ధాన్ని ఎదుర్కొను పాండవుల ధైర్యాన్ని వర్ణించుట
దృతరాష్ట్రుడు సంజయునితో " సంజయా ! అత్యధికమైన మన సైన్యంతో పోరుసల్పడానికి అల్పసైన్యం కలిగిన పాండవులు ఎలా సాహసించారు ? " అని ప్రశ్నించాడు. సమాధానంగా సంజయుడు " రాజా ! అర్జున యుధిష్టరుల సంభాషణ వింటే ఇది మీకు అవగతమౌతుంది . ధర్మరాజు అర్జునితో " అర్జునా ! కౌరవ సైన్యం బలంగా ఉంది మనసైన్యం స్వల్పం " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా ! పూర్వం నారదుడు భీష్మ, ద్రోణాదులు వింటూ ఉండగా ఇలా చెప్పాడు. అధర్మ వర్తనులైన సేనలు అధికమైనా ధర్మవర్తనులైన స్వల్ప సైన్యాలు వారిని గెలువగలవు అన్నాడు. అది కాక అసాధారణ భీముని గధాఘాతానికి తట్టుకుని నిలువ ఎవరికి శక్యం కాదు. దృష్టద్యుమ్న, శిఖండి మొదలైన పాంచాల భూపతుల గెవడం ఎవరి తరం. మత్స్య భూపతి విరాటుని బలం నీకు తెలియనిది కాదు. సాత్యకి, చేకితాసుల పరాక్రమం మనకు తోడుగా ఉంది. అవక్ర పరాక్రమ వంతుడైన అభిమన్యుడు , మాయా విధ్యా కోవిదుడైన ఘటోత్కచుడు మనకు చేదోడుగా ఉన్నారు. శ్రీకృష్ణుని తోడు మన కున్నది. నీ ధర్మనిరతి మనకు రక్షగా ఉంది. నా గాండీవం శక్తి నీకు తెలియనిది కాదు. నీ శక్తి నీకు తెలియదు. నీవు కోపించిన దేవతలు కూడా నీ ముందు నిలువ లేరు. కనుక కలత చెంద వద్దు " అన్నాడు. అర్జునిని మాటలకు ఆనందించిన ధర్మరాజు కౌరవులకు దీటుగా ఒక వ్యూహం పన్నమని దృష్టద్యుమ్నునకు చెప్పమని చెప్పాడు. అర్జునుడు అలాగే చేసాడు. దృష్టద్యుమ్నుని వ్యూహరచన ప్రకారం అభిమన్య, ఉప పాండవ, నకుల సహదేవుల సహితంగా భీముడు సైన్యాలకు అగ్రభాగంలో నిలబడ్డాడు. చేకితానుడు, సాత్యకి, పాంచాల దేశాధిపతులు, మత్సదేశాధీసుడు తమ తమ సన్య సమేతంగా ఉత్తర దక్షిణ భాగంలో నిలిచారు. నడుమ గజారూఢుడై ధర్మరాజు నిలిచాడు. అందరికన్నా ముందు అర్జునిని రక్షణలో శిఖండి భీష్ముని ఎదుట నిలిచాడు. వెనుక భాగంలో మగదాధీశుడు, దుష్టకేతువు నిలిచారు. రథములు, అశ్వములు, కాల్బలములతో శమంతక పంచకం నిండి పోయింది. ఈ భూమి పైన బాలవృద్ధులు తప్ప మిగిలిన మగవారంతా యుద్ధ భూమిలో ఉన్నారు. ధృతరాష్ట్రుడు " సంజయా ! ఇరువైపులా ఉన్న సైన్యంలో ఎవరు బలవంతులు " అన్నాడు. సంజయుడు " రాజా! ఇరువైపులా ఉన్న సైన్యాలు ఎవరికి వారే తమ బలం ఎక్కువని చెప్పుకుంటున్నారు. నాకు మాత్రం శ్రీకృష్ణుని అండ ఉన్న పాండవ సైన్యం బలమైనదని తోచుచున్నది " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు