సంస్కార్ విద్యా పీఠంలో ఘనంగా 'ఫుడ్ మేళా'.. : వెంకట్ , మొలక ప్రతినిధి
 వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ సంస్కార్ విద్యా పీఠం పాఠశాలలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులచే నిర్వహించిన 'ఫుడ్ మేళా' సంప్రదాయ వంటకాలతో అలరించింది. ఆధునిక ఆహారపు అలవాట్ల మధ్య మరిచిపోతున్న పాతకాలపు రుచులను, ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థులు సుమారు70 కిపైగా స్టాళ్లను ఏర్పాటు చేసి, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
​సంప్రదాయ రుచులు: మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి ఆరోగ్యకరమైన రాగి ముద్ద, భక్షాలు, సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, కొర్ర పాయసం వంటి మిల్లెట్స్ (చిరుధాన్యాల) వంటకాలను విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు.

​కేవలం తెలంగాణ వంటకాలే కాకుండా, వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాలను కూడా ప్రదర్శనలో ఉంచారు.  

​ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేష్ గణేష్ తో పాటు కవయిత్రి మొల్ల కళా వేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్ మాట్లాడుతూ.. "ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ఆనందం. విద్యార్థులు నేటి కాలంలో హోటళ్లలో దొరికే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రసాయనాలతో కూడిన ఆహారం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి ఫుడ్ మేళాల ద్వారా చిన్నతనం నుంచే పోషక ఆహారంపై అవగాహన పెంచుకోవాలి," అని సూచించారు.

​ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేష్, గణేష్, పాఠశాల ప్రిన్సిపల్ విజయనిర్మల, కరస్పాండెంట్ స్వాతి, డైరెక్టర్ సవిత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌లు