కలాల గళాలు: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
కలాలు కదులుతున్నాయి —
కాలపు గుండెలో కొట్టుకునే స్పందనల్లా 
నిశ్శబ్దానికి నడక నేర్పే
నిజాల అడుగుల్లా ముందుకూ మున్ముందుకూ।

కలాలు కారుస్తున్నాయి —
మనసులో మిగిలిన మధుర వేదనలను
మాటల్లో మలచి జార్చే
మంచి ముత్యాల్లా మిలమిలా తళతళా।

కలాలు చెక్కుతున్నాయి —
అనుభవాల రాతిబండలపై
అక్షరాల శిల్పాల్ని మలిచి
జీవితాల్ని జ్ఞాపకంగా తియ్యగా తిన్నగా।

కలాలు గీస్తున్నాయి —
కలల కాన్వాసులపై
ఆలోచనల రంగులతో
అందమైన లోకాలను భావాల్లా బొమ్మల్లా।

కలాలు కోరుతున్నాయి —
సత్యం కోసం, సమానత్వం కోసం
మౌన గుండెల స్వరాన్ని వినిపించేందుకు
న్యాయాన్ని నిలబెట్టేందుకు నీతినీ నిజాయితీనీ।

కలాలు కక్కుతున్నాయి —
అన్యాయం మీద ఆగ్రహాన్ని
అసత్యంపై ఆవేశాన్ని
అక్షరాగ్నిలా రవ్వలు చెరుగుతూ చిమ్ముతూ।

కలాలు…
మేధావుల చేతిలో మహత్తర సాధనాలు —
మనసు మాట్లాడే మాధ్యమాలు 
మానవత్వం మేల్కొలిపే మహామంత్రాలు।

కలాలు కమ్మని కవితలు కూర్చితే —
కేవలం పదాలనే కాదు
ప్రపంచాన్ని మార్చగలవు 
హృదయాలను ఉప్పొంగించగలవు॥


కామెంట్‌లు