గోరా దంపతుల విగ్రహాల ఆవిష్కరణ.: - చౌధరి రాధాకృష్ణ, -గాంధేయవాది, -జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, -శ్రీకాకుళం.
 శ్రీకాకుళం శాంతినగర్ లో గల గాంధీ స్మారక నిధి, స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గాంధేయవాదులు, నాస్తిక సమాజ స్థాపకులు , హేతువాదులు గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరా దంపతుల విగ్రహాలు ఆవిష్కరణకు సిద్ధమైనాయి. ఏప్రిల్ 11 శనివారం ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో  గోరా కుమారుడు, ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ గోపరాజు సమరం, కుటుంబ సభ్యులు, గాంధీ స్మారక నిధి రాష్ట్ర అధ్యక్షులు రష్మీతో పాటు శ్రీకాకుళం స్మారక నిధి సభ్యులు తదితర ప్రముఖులతో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఈ సందర్భంగా గోరా, సరస్వతీ దంపతులు భారతావనికి చేసిన విశేష సేవలను మననం చేసుకుందాం.
గోరా అని మనం క్లుప్తంగా పిలుచుకునే గోపిరాజు రామచంద్రరావు, సరస్వతీ గోరా దంపతులు ప్రజల్లో మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్రీయదృక్పథం కలిగించడం, దళితులకు దేవాలయాల ప్రవేశం కల్పించడం, సాంఘిక సమానత్వం, నిరాడంబరత, హేతువాదం, సాక్షరత, పార్టీరహిత ప్రజాస్వామ్యం, కులాతీత, మతాతీత సమాజ నిర్మాణానికి, తద్వారా మానవాళి మానవతతో మనుగడ సాధించాలని కోరుకున్నారు. ఈ లక్ష్య సాధనలో మనదేశంలోనే కాక విదేశాలలో కూడా ప్రచారం చేసారు. సర్వజనే సుఖినోభవంతు, వసుదైక కుటుంబ భావనలతో గోరా, సరస్వతీ దంపతులు విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు. 
ఒడిషా లోని ఛత్రపురంలో గోపరాజు వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి పుణ్యదంపతులకు 1902 నవంబర్ 15 న జన్మించిన గోపరాజు రామచంద్రరావు పర్లాఖిమిడి లో ప్రాథమిక విద్య, దేశంలో వివిధ ప్రదేశాల్లో ఉన్నత విద్య నభ్యసించి విభిన్న రంగాల్లో ఉద్యోగాలు చేసారు. 1928 నుండి కాకినాడ కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకులుగా సేవలందించారు.
గోరా, సరస్వతీ దంపతులు కృష్ణా జిల్లా ముదునూరులో 1940 ఆగష్టు 10న ఎనభైమంది యువకులతో నాస్తికసమాజాన్ని స్థాపించి స్వాతంత్ర్యం  సిధ్ధించువేళ దీనిని 1947 ఏప్రిల్ లో విజయవాడలోని పడమటకు మార్చారు. ప్రపంచ నాస్తికమహాసభలను రెండుసార్లు విజయవాడలో నిర్వహించిన గోరా సరస్వతీ దంపతులు 3వ ప్రపంచ నాస్తిక మహాసభలను ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో నిర్వహించి ఈ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసారు.
విజయనగరంలో 1912లో జన్మించిన సరస్వతి పదేండ్ల ప్రాయంలోనే, 1922లో గోరాతో వివాహం జరిగింది. సైద్ధాంతికంగా ఇరువురూ ఒకే బాటలో పయనించారు. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలోనే గోరా స్వాతంత్ర్యసమరంలో పాల్గొంటే, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సరస్వతీ గోరా జైలుజీవితం గడిపారు.
గాంధీజీ పిలుపుతో సేవాగ్రామ్ ఆశ్రమం చేరిన గోరా సరస్వతీ దంపతులు ఆశ్రమంలో గాంధీజీతో కలిసి పనిచేసారు. నాస్తిక, ఆస్తిక అంశాలు మినహా గోరా సరస్వతీ దంపతులు, గాంధీజీ ఆలోచనలు, తత్వాలు ఒకటే కావడంతో గాంధీజీ మరణానంతరం కూడా ఆయన సిద్ధాంతాలను ఆచరించి ప్రచారం చేసిన గోరా సరస్వతీ దంపతులు గాంధేయవాదులు, గాంధీజీ నిజమైన వారసులు. వీరి విగ్రహాలను శ్రీకాకుళం గాంధీ స్మారకనిధిలో నెలకొల్పి, ఆవిష్కరణ చేస్తున్న శుభవేళ ఆ పుణ్య దంపతులకు జోహార్లు.


కామెంట్‌లు