కళలంటే ప్రాణం:- డా ॥ కందేపి రాణీప్రసాద్

 మా చిన్నప్పుడు మా ప్రాంతంలో ప్రతి ఇల్లు కుట్లు, అల్లికలతో అలలారుతూ ఉండేది. ముఖ్యంగా మా ఇంట్లో అమ్మ, పెద్మమ్మలు, అత్తయ్యలు అందరు రకరకాల కుట్లలో నిష్ణాతులు. ఎంతలా అంటే చూసిన ప్రతి కుట్టును కుట్టేసేవారు. మా ఇల్లు, బంధువుల ఇళ్ళు మాత్రమే కాక కుట్లతో ఇరుగు పొరుగు ఇళ్ళు సైతం పట్టు దారాలు, విచ్చెల దారాలు, చక్రం, సూదులు, వైర్లతో నిండి ఉండేవి.
మధ్యాహ్నం అయిందంటే దాదాపుగా ప్రతి మహిళ చేతిలో సూది దారం గానీ, వైర్ల బుట్టలు గానీ ప్రత్యక్షమయ్యేవి. ఇళ్ళ అరుగుల మీద కూర్చుని వైర్ల బుట్టలు అల్లుకుంటూ ఒక్కచోట చేరి మాట్లాడుతూ ఉండేవారు. పనితో పాటు కబుర్లు కూడా అయిపోతు ఉండేవి. మా స్కూలు టీచర్లు సైతం వైరు బుట్టలు స్కూలుకు తెచ్చి ఖాళీ పీరియడ్లలో అల్లుకుంటూ కూర్చునేవారు. హోంవర్కు చేయకపోయినా, చదవకపోయినా రోజు గడిచిపోయేది గానీ కుట్లు కుట్టందే రోజు గడిచేది కాదు. ఇరుగు పొరుగు అంతా కళల రాజ్యం విలసిల్లుతూ ఉండేది. సహజంగానే అటువంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళకు అదే లక్షణాలు వస్తాయి. నాకు అలాగే కళల పట్ల ఇష్టం ఏర్పడింది.
మా అమ్మ అత్యంత సులభమైన ‘మ్యాటీ’ కుట్టుతో 'అక్షరాభ్యాసం’ కాదు కాదు 'కళాభ్యాసం' చేయించింది. దీనికి విచ్చెల దారాలే వేయించింది. ఇందులో రెండు వరసలు, మూడు వరుసల కుట్లు ఉండేవి. రెండూ నేర్చుకుని కుట్టిన తర్వాత ఒక కొత్త డిజైన్ సృష్టించాలనుకున్నాం. రెండు రకాల కుట్లతో ఒక శివలింగాన్ని కుట్టాను. ఎక్కడా తేడాలు లేకుండా బాగా వచ్చేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇదంతా నా తొమ్మిది, పదేళ్ళ వయసులో జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కుట్లు, అల్లికలు నాతో పాటు ప్రయాణిస్తూనే ఉన్నాయి. గొలుసు కుట్టు, కాడ కుట్టు, ముద్ద కుట్టు, వల కుట్టు, గోపురం కుట్టు, జిగ్ జాగ్ కుట్టు, బటన్ హోల్ కుట్టు, ఫిల్లింగ్ కుట్టు, ఫెదర్ కుట్టు, బ్లెండ్ కుట్టు వంటివెన్నో మా అమ్మ నేర్పించింది. వాటిలో ప్రయోగాలు ఇద్దరం కలిసి చేశాము.
ఇవి కాకుండా గౌన్లకు ముందు భాగాన బబుల్ గా వచ్చేందుకు కుట్టే స్మాకింగ్ ను నేర్చుకుని ఎన్నో రకాలుగా కుట్టాను. అదేవిధంగా టాటింగ్, ఊలు పువ్వులు వంటివి అల్లి వాటిని పరికిణీల పైన జాకెట్ల పైన కుట్టుకునే వాళ్ళం. చిల్లులతో ఉండే ప్లాస్టిక్ అట్టల్లాంటివి బజార్లో దొరికేవి. వాటిని తెచ్చుకుని చిల్లులలో దారాలు దూర్చి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలు అల్లుకునేవాళ్ళం. చాలా మంది ఇళ్ళలో ఈ చిత్రాలు ఉంటాయి. ఈ అట్టతో బ్యాగులు కుట్టేవారు.
మా అమ్మ గట్టి దారాలతో దుప్పట్లు అల్లింది. నేటికి ఇవి మా ఇంట్లో ఉన్నాయి కాకపోతే వాటి రూపం మార్చాను. దుప్పటి తయారీలో గుండ్రటి గట్టి దారాల పువ్వులను ఒక దానితో ఒకటి అతుకుతూ సన్న అల్లికను ఉపయోగిస్తారు. 1950-55 కాలలలో అల్లిన ఈ దుప్పట్ల దారాలు పూర్తిగా నుజ్జు నుజ్జయిపోయిన, పువ్వులు మాత్రం చెక్కు చెదరలేదు. ఆ పువ్వుల్ని చక్కగా విడదీసి ఒక డోర్ కర్టెన్ మీద డిజైన్ లా కుట్టి భద్రపరిచాను. నా కాలేజీ రోజుల్లో ఈ పువ్వుల్ని పరికిణీ మీద కట్టుకుని కొత్త, ఫ్యాషన్ గా మార్చాను. మా వుమెన్స్ కాలేజీలో ఈ కొత్తరకపు పరికిణీ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇప్పుడు మరో విషయం కూడా గుర్తొచ్చింది. పెసర పప్పు రంగులో ఉన్న జార్జెట్ బట్టను తెచ్చి పరికిణీ కుట్టుకుంటూ, దాని మీద నలుపు రంగుతో మామూలు మిషను కుట్టును పది లైన్లుగా వేశాను. దీన్ని కాలేజీకి వేసుకెళ్ళాక క్రియేటివ్ కుట్లకు కేరాఫ్ అడ్రస్ అని, డిజైన్ బ్రహ్మ అని నాకు పేరే పెట్టేశారు.
పదో తరగతి సెలవుల్లో మేము బంధువులింటికి హైదరాబాదు వెళ్లినప్పుడు పక్కిళ్ళలో ఉన్న మార్వాడీల వద్ద నుండి ఊలుతో స్వెట్టర్లు, షాల్లు అల్లడం నేర్చుకుని చీరాల వెళ్ళాను. నేను, అమ్మా, పెద్దమ్మా నిట్టింగ్ నేర్చుకున్నాం.
నిట్టింగ్ నిడిల్స్, ఊలు బండిల్స్ హైదరాబాద్ లో కొనుక్కుని మా ఊరు వెళ్లి స్వెట్టర్లు అల్లుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. మా వూర్లో ఎవరికీ రాదు కాబట్టి ఆశ్చర్యంగా చూస్తుంటే నేనేదో IAS పాసయినట్లు సంతోషపడేదాన్ని. అప్పుడే నిర్ణయించుకున్నా "నేను డిగ్రీ చదివేలోపు ఎన్ని రకాల కుట్లున్నాయో అన్ని రకాలు నేర్చేసుకోవాలని”.
కుట్లలో రారాజు 'కచ్ వర్క్ నేర్చుకోవడం ఒక పెద్ద ప్రహసనం. కష్టంగా ఉంటుంది, త్వరగా రాదు' అనే పేరు సంపాదించుకున్న ఈ వర్క్ను నేర్చుకుని ఎవరెస్ట్ను అధిరోహించినట్లుగా సంబరపడ్డాను. నేర్చకున్న కచ్ వర్కును డిజైన్ గా జాకెట్ మీద కొత్తగా రూపొందించి శాస్త్రవేత్తల్లా ఫోజు కొడుతుంటే బంధు వర్గంలోనూ, ఇంటి చుట్టు పక్కల వారిలోనూ నేనేదో మేధావినన్న పేరు వచ్చేసి "ఎంబ్రాయిడరీ రాణి” అని బిరుదు కూడా ఇచ్చేశారు.
ఆ రోజుల్లో వైరు బుట్టలు అల్లడం ప్రధాన కళగా ఉండేవి. ఇందులో కూడా రెండు వైర్లతో, మూడు వైర్లతో అల్లకాలుండేవి. నేను స్కూలు నుంచి వచ్చేసరికి మా అమ్మ అల్లుతూ ఉండేది. రాగానే నేను అల్లడం మొదలు పెట్టేదాన్ని. స్కూలు లేకపోతే పూర్తి సమయం అల్లకాలతోనే సరిపోయేది. క్రోషియో వైర్లతో చేపల బుట్టలు అల్లడం, ట్యూబు వైర్లతో కర్టేన్లు, ఫ్లవర్ వేజ్లు, పువ్వులు అల్లడం చేస్తూ ఒక్క నిమిషం ఖాళీ లేకుండా గడిపేవాళ్ళం.
మా ఇంటి సందు చివర్లో ఒక రిపేర్ షాపు ఉండేది. మా వీధిలో పిల్లలందరూ ఆ షాపులో పారేసే రాగి చుట్టల్ని అడిగి తెచ్చుకునేవారు. నేనూ వారితో పాటు వెళ్ళి తెచ్చుకునే దాన్ని. కానీ పిల్లలంతా వాటిని పాత సామాన్ల వాళ్ళకిచ్చి జీళ్ళు తెచ్చుకుని తినేవాళ్ళు. మా అమ్మ వాటితో గొలుసులు, నెక్లెసులు అల్లడం నేర్పింది. వాటితో ఉంగరాలు, బ్రాస్లేట్లు, గొలుసులు అద్భుతంగా అల్లి అందరు నోటిటి మీద వేలు వేసుకునేలా చేశాం.
సెలవుల్లో పగిలిన మట్టి గాజుల్ని బుడ్డి దీపం వెలిగించి కాలుస్తూ పొడవైన చైన్లుగా మార్చేవారు. అలా అల్లి వాకిలికి రెండు వైపులా వేసుకునేవాళ్ళం. దాన్ని ఇంకొద్దిగా మార్చి ఒక కాగితం మీద అతికించి నెమళ్ళు, కోళ్ళుగా మార్చే వాళ్ళం. ఇలా మార్చడానికి ఇంట్లో వాళ్ళందరి మధ్య ఎన్నో డిస్కషన్లు, డిజైన్లు, ప్రణాళికలు నడిచేవి. కొత్త డిజైన్లను రూపొందించేటప్పుడు మా నాన్న, అన్నయ్యలు, తమ్ముళ్ళ ఆలోచనలు ఖచ్చితంగా ఇందులో వచ్చి చేరేవి.
ప్రైమరీ స్కూలులో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన పెద్ద చెరువుండేది. చెరువులోని మట్టి తెచ్చి వినాయకులను చేసిచ్చేది మా అమ్మ. అమ్మే కాకుండా అనేక రకాల బొమ్మలు చేస్తుండేది మా నాయనమ్మ. మా తమ్ముడికి ఎద్దులంటే ఇష్టమని ఎద్దుల బొమ్మలు చేసిచ్చేవాళ్ళం. బంక మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు, తాటాకు బొమ్మలు, కొబ్బరాకుల బొమ్మలు ఒకటేమిటి బొమ్మల లోకంలోనే పెరిగి పెద్దయ్యాము.
మాది సముద్ర తీర ప్రాంతం కాబట్టి ప్రతి ఇంట్లో కొబ్బరి చెట్లుండేవి. కొబ్బరాకుల బూరలు, వాచీలు, ఉంగరాలు, పెళ్ళి బొమ్మలు అన్నీ చేసుకుని ఆడుకునే వాళ్ళం. కొబ్బరి పిందెలతో పూలు, కొబ్బరి పుష్ప విన్యాసపు మట్టతో పడవలు చేసేవాళ్ళం. తాటి కాయలతో రుషి బొమ్మను కూడా చేసి ఆడుకునేవాళ్ళం. వెదురుపుల్లలు, పూచిక పుల్లలు ఉపయోగించి ఇళ్ళు కూడా కట్టాము.
ఇక పెయింటింగుల విషయానికొస్తే ఎన్ని రకాలు వేశామో. కాగితం, కర్ర, వస్త్రం, ప్లాస్టిక్, గోడ, రేకు అన్ని కాన్వానుగా మారినవే. బాపు బొమ్మల్ని, వడ్డాది పాపయ్య బొమ్మల్ని వేసుకొని "అచ్చం బాపులాగే వేశారని” ఎవరైనా మెచ్చుకుంటే గాల్లో తేలిపోతూ ఉండేవాళ్ళం. చీరలు, జాకెట్లు, పరికిణీల మీద ఎన్ని డిజైన్లు పెయింట్ చేశామో లెక్కలేదు.
ఇవన్నీ చదువుకునేటప్పుడు, పెళ్లికి ముందు నేర్చకుని రూపొందించిన కళావిద్యలు. వాటి పేర్లు తెలియకపోవచ్చు గానీ దాదాపు అన్ని రకాల వస్తువులతోను బొమ్మలు చేసిన వాళ్ళమే. కళల్లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్లుగా తెలిసినవన్నీ నేర్చేసుకున్నాను. ఆ కాలంలో కుట్లు, అల్లికలు చేతనైన ఆడపిల్లల్ని తెలివిగల వాళ్ళుగా గుర్తించేవారు. ఆ కిరీటాలను మోసిన వాళ్ళమే మేము.
పెళ్ళయ్యాక నా కళలు తమ దారి మార్చుకుని సృజనాత్మక, కళాత్మక, పర్యావరణాత్మకంగా రూపొందాయి. ఆసుపత్రి వ్యర్థాలన్నీ బొమ్మలై ఆసుపత్రి అంతటా కొలువుదీరాయి. వందల ఎగ్జిబిషన్లకు దారి తీశాయి. జిల్లాలు, రాష్ట్రాలు దేశాలు దాటి అందర్ని అలరించాయి. ఆసుపత్రిల్లో పారేసే సూది, దూది, సీసా, ప్లాస్టిక్ రోల్ ఏదైనా సరే తమ ఆకారాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుకుని అందంగా ఆకారం దాల్చాయి. కొన్ని కళాఖండాలుగా, టీచింగ్ ఎయిడ్స్ గా, వినోదాత్మక షో పీస్లుగా నాలుగు వేల బొమ్మలుగా అవతరించి ప్రపంచ రికార్డును సాధించి పెట్టాయి.
మేము మా కాన్ఫరెన్సుల నిమిత్తం దాదాపు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాము. నాకు కళలంటే ఉన్న ఇష్టంతో ఆయా రాష్ట్రాల సంప్రదాయ హస్తకళల షో రూములు సందర్శిస్తుంటాను. అంతే కాదు అక్కడ ప్రఖ్యాతి చెందిన కళా రూపాలను కొని తెచ్చుకుంటాను. ఇంటికి తెచ్చుకున్నాక వాటిని తయారు చేయటానికి ప్రయత్నిస్తాను. ఇలా ఇంటి నిండా చాలా రాష్ట్రాల కళా రూపాలు చేరాయి. నిజంగా చెప్పాలంటే మా ఇల్లు బొమ్మల షాపులా ఉంటుంది. ఇలా రాష్ట్రాల ప్రఖ్యాత కళా రూపాలే కాకుండా వివిధ దేశాల కళా రూపాలను కూడా తెచ్చుకున్నాను. నాకున్న అభిరుచిని గమనించి వేరే రాష్ట్రాలు, దేశాలు వెళ్ళిన స్నేహితులు కూడా నాకోసం అక్కడి నుండి హాండ్ క్రాఫ్ట్స్ తీసుకొచ్చి ఇస్తుంటారు.
కేవలం బొమ్మలు కొనుక్కుని తెచ్చి అలాంటివే తయారు చేయడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రసిద్ధి పొందిన క్రాఫ్ట్ ఎంపోరియాలను దర్శిస్తుంటాను. అదొక ఆనందం నాకు. చాలా సంతృప్తిగా ఉంటుంది.
వీలైతే అక్కడి వివరాలు రాసుకుని వచ్చి వ్యాసాలు కూడా రాసిన సందర్భాలున్నాయి. మైసూరు లోని రవివర్మ ఆర్ట్ గ్యాలరీని చూడటమే కాకుండా పూర్తి వివరాలతో నోట్సు రాసుకుని ఆ తర్వాత వ్యాసం రాశాను. దక్షిణాఫ్రికాలోని ఆస్ట్రిచ్ పక్షులను చూసి వచ్చి వ్యాసం రాశాను. ఆస్ట్రిచ్ గుడ్లపై వేసిన పెయింటింగును దక్షిణాఫ్రికా నుంచి కొనుకొచ్చాను. ఇక్కడ అస్ట్రీచ్ గుడ్డు దొరకదు కాబట్టి కోడిగుడ్డు మీద పెయింటింగ్ వేశాను. ఆస్ట్రిచ్ ఈకలు తెచ్చుకుని వాటి మీద పెయింటింగ్ చేశాను.
మహాబలిపురం, గోవాల నుంచి ఎన్నో గవ్వలు తెచ్చి వాటికి పెయింట్లు వేశాను. రాజస్థాన్ నుంచి మార్బుల్ పొడులను తెచ్చి బొమ్మలను చేసుకున్నాను. స్విట్జర్లాండు నుంచి పైన్ చెట్ల శంఖులు తెచ్చి వాటికి రంగులు వేసి అలంకరించాను. చైనా గోడ దగ్గర నుంచి చిన్న రాళ్ళు తెచ్చి బొమ్మలు వేశాను.
రవీంద్రుని శాంతినికేతన్ లో ఉన్న వస్త్ర కళాఖండాలన్నీ చూశాను. నాకప్పటి దాకా రవీంద్రనాథ్ ఠాగూరంటే రచయిత, చిత్రలేఖకులు గానే తెలుసు. అక్కడికి వెళ్ళి వారి మ్యూజియం చూశాకే హస్త కళాకారులు అని తెలిసింది. నేను కూడా ఒక మ్యూజియం పెట్టాలని అప్పుడే అనుకున్నాను. 2001వ సంవత్సవంలో నేను మా హాస్పిటల్లోని ఖాళీ స్థలాన్నంతా మ్యూజియంగా మార్చాము. చండీఘర్ లోని రాక్ గార్డెన్ చూశారా! నా ‘హాస్పిటల్ ఆర్టో' కూడా ఇలాగే పేరు పొందాలని ఆశపడ్డాను. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మ్యూజియాలను దర్శించి ఫోటోలు కూడా తీసుకున్నాను. ఆ కాలం నాటి చిత్రకళలు ఎలా ఉండేవో నా దృష్టితో తెలుసుకున్నాను. వారణాసిలో పండిత మదన మోహన మాలవ్య మ్యూజియంలోని చిత్రరేఖలన్నీ పక్కకు తిరిగిన మొహాలతో వేయబడ్డాయి. దాదాపుగా ఎదురుగా ఉన్న చిత్రం కనిపించలేదు. ఇవన్నీ కేవలం సామాన్య వ్యక్తిగా గమనించినవే.
కరోనా సమయంలో ఖాళీగా ఉండే మహిళలకు, పిల్లలకు ఏదైనా కొత్తగా రాయాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో ఉండే వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలతో తయారుచేసిన బొమ్మలు గురించి వివరిస్తూ మరియు పాత కాలంలో మేము చేసిన కళారూపాల గురించి కూడా వ్యాసాలు రాశాను. ఈ రోజు ఈ పుస్తకంలోని వ్యాసాలే నవ తెలంగాణ దినపత్రికలో మానవి పేజీలో వరుసగా ప్రచురింపబడ్డాయి. మూడు, నాలుగు వ్యాసాలు సంచిక ఆన్లైన్ పత్రికలో ప్రచురింపబడ్డాయి. అన్య రాష్ట్రాల కళల్ని కూడా నేను నేర్చుకున్నాను. ఈ నాటి తరం నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో వ్యాసాలు రాశాను. కంప్యూటర్ల తో కుస్తీ పట్టే ఈ తరానికి, నవ తరానికి మన భారతీయ కళల్ని పరిచయం చేయాలనే ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నాను. నా వయసు వాళ్లంతా “వాళ్ళ చిన్నతనం గుర్తుకు తెచ్చుకుంటారు”. నవ తరానికి మన భారతీయ కళలు తెలుస్తాయి ఈ కళా వ్యాసాలకు ఫోటోలు ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు అల్లిన అన్ని బొమ్మలకు ఫోటోలు లేవు. కొన్నింటికి మాత్రమే ఉన్నాయి. అందువలన కొన్ని వ్యాసాలకు ఫోటోలు పెట్టి, మరికొన్ని వ్యాసాలకు ఫోటోలు లేకపోతే బాగుండదని ఫోటోలు పెట్టటం లేదు. తదుపరి ఎడిషన్లో వీలైతే ఫోటోలు పెడదామని
అనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళింటి నుంచి బొమ్మల ఫోటోలు తీసుకురావాలి. కొన్ని పాడైపోయాయి, మరికొన్ని బాగున్నాయి. వాటిని ఫోటోలుగా మార్చాలి. ఫోటోలు తీయడం, భద్రపరచడం కూడా సామాన్యమైన విషయమేమి కాదు. దాదాపు వంద కన్నా ఎక్కువ ఆల్బమ్స్లో క్యాటగిరీలుగా విడదీసి భద్రపరిచాను. ఈ బొమ్మలన్నింటినీ ఒక పెద్ద పరిశోధనా గ్రంథంగా వెయ్యాలని ఆశ పడుతున్నాను. ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు.
ఇంకా చాలా కళల గురించి పరిచయం చేయాలి. నేను చూసిన హస్తకళా మ్యూజియాల గురించి చెప్పాలి. ఎన్నో రాష్ట్రాల విశేషాలు మిగిలిపోయాయి. అయినా అన్నీ ఒక్కసారే చెప్పాలంటే కుదిరేలా లేదు. మరోసారి మిగతా వివరాలన్నీ రాస్తాను. దాదాపు నలభై ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో కుట్లు, అల్లికలు నాతో స్నేహం చేశాయి. నేనంటే ప్రాణం పెట్టాయి. నన్ను వదిలి ఉండలేక పోయాయి. పుట్టింటి నుంచి అత్తింటికి నాతో పాటే కళలూ ప్రయాణించాయి.
ఈ తరం ఆడపిల్లలకు నా కళల ప్రస్థానం తెలియజేయాలని ఈ పుస్తకం వేస్తున్నాను. చదువులు, ఆఫీసులు ర్యాంకులు, టార్గెట్లు పెట్టే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కళల సహచర్యం అవసరం. కళలతో చెలిమి చేసి చూడండి! ఎంత మానసిక ప్రశాంతత లభిస్తుందో మీరే గమనించండి. ముగ్గులు,కుట్లు, అల్లికలు, వంట, ఇల్లు సర్దుకోవడం వంటి పనులు ఆడపిల్లల డిక్షనరీ నుంచి మాయమైపోతున్నాయి. దాంతో పాటు కళారూపాలు కనుమరుగైపోతున్నాయి. వేగవంతంగా ఉన్న నేటి జీవితాల నుంచి మాయమైపోతున్న ఈ కళలను మీ ముందుకు తెస్తున్నాను. మన సంప్రదాయ కళల్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. కళల్ని బ్రతికించండి. 
కామెంట్‌లు