రోడ్డుపైకి సింహాలు: - - యామిజాల జగదీశ్
 
మన దేశంలో నడిరోడ్డుపై గేదెలు, గొర్రెల గుంపు వస్తే బస్సులు, ఇతర వాహనాలు స్పీడు తగ్గించి నడవడం మామూలే. కొన్నిసార్లయితే వాహనాలు ఆగిపోవడం మామూలే.  దక్షిణాఫ్రికాలో అలా కాదు. అక్కడ తీరు వేరు. అక్కడ ఏవొచ్చి వాహనాలను ఆపుతాయో ఒక్కసారి తెలుసుకుందాం.
సౌతాఫ్రికాలో క్రుగెర్ నేషనల్ పార్క్ మధ్య నుంచి ఓ హైవే ఉంది. అది మామూలు రోడ్డు కాదు. మన దగ్గర రోడ్లపైకి గేదెలు, గొర్రెలు వచ్చినట్టు ఆ రోడ్డుపైకి సింహాలు వస్తుంటాయి. ఆ అడవికే కాదు, ఆ రోడ్డుకు కూడా అవే రాజులు. అవి రోడ్డుపైకి వచ్చాయంటే రాస్తారోకో అయినట్టే. అక్కడి నుంచి అవి కదిలినప్పుడే ఆ రోడ్డు ఫ్రీ అవుతుంది. వాటికి మంచి బుద్ధి పుట్టి మళ్లీ రోడ్డుపై నుంచి అడవిలోకి వెళ్లినప్పుడే వాహనాల రాకపోకలు మళ్లీ మొదలవుతాయి. అప్పటిదాకా వాహనాలు ఆగిపోవాల్సిందే. 
ఇదే క్రుగెర్ నేషనల్ పార్కుకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని సింహాలు రోడ్డెక్కుతుంటాయి. నిజానికి వాటిని చూస్తేనే వణుకు పుడుతుంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవలసిందే. కొన్ని బళ్ళయితే వాటిని మెల్లగా ఫాలో అవుతుంటాయి. వాటిని ఓవర్ టేక్ చేయడం, వాటి ముందు ర్యాష్ డ్రైవ్ చేయడానికీ ఎవరూ సాహసించరు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అంతేసంగతులు. అంటే వాటికి ఫలహారమే అన్న మాట. ఆ సింహాల ఠీవీ, వాటి రాజసం చూసి తీరాల్సిందే. కొందరైతే తమ వాహనాల్లోంచే వాటికి  వీడియో తీయడం మామూలు. ఆ తర్వాత ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. సింహాలు చేసిన ట్రాఫిక్ జామ్ ని ఇక్కడి ఫోటోలలో చూడవచ్చు.
క్రుగర్ నేషనల్ పార్క్ విషయానికొస్తే, దీనిని 1898లో దక్షిణాఫ్రికాలో స్థాపించారు. 19,485 చదరపు కిలోమీటర్ల (7,523 చదరపు మైళ్ల) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. "బిగ్ ఫైవ్" (సింహం, చిరుత, ఖడ్గమృగం, ఏనుగు, గేదె), 147 క్షీరదాలు, 500కు పైగా పక్షి జాతులతో కూడిన అపారమైన జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన ఒక అగ్రశ్రేణి సఫారీ గమ్యస్థానమే ఈ క్రుగెర్ నేషనల్ పార్క్.
ఈ నేషనల్ పార్క్ గురించి కొన్ని వాస్తవాలు...
ఈ పార్క్ సుమారుగా వేల్స్ లేదా ఇజ్రాయెల్ పరిమాణంలో ఉంటుంది, ఇది ఉత్తరం నుండి దక్షిణానికి 360 కిలోమీటర్ల మేర విస్తరించి, సగటున 65 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉంది.
వన్యప్రాణులను రక్షించడానికి 1898లో సాబి గేమ్ రిజర్వ్‌గా స్థాపించిన దీనికి, 1926లో క్రుగర్ నేషనల్ పార్క్ అని పేరు మార్చారు.
దక్షిణ ఆఫ్రికాలోనే అత్యధిక వన్యప్రాణుల సాంద్రత ఇక్కడ ఉంది. ఇందులో సుమారు 90,000 ఇంపాలాలు, 27,000 ఆఫ్రికన్ గేదెలు ఉన్నాయి. ఇది 336 రకాల చెట్లకు, 114 రకాల సరీసృపాలకు కూడా నిలయం.
క్రుగర్‌కు తొమ్మిది ప్రవేశ ద్వారాలు, విస్తారమైన రహదారుల నెట్‌వర్క్ ఉన్నాయి. వాటిలో స్కుకుజా అతిపెద్ద విశ్రాంతి శిబిరం.
ప్రకృతికి అతీతంగా, ఈ పార్కులో రాతియుగం, ఇనుపయుగం చరిత్రకు ప్రాతినిధ్యం వహించే మసోరిని, తులమెలాతో సహా 420కి పైగా వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి.
ఈ పార్కుకు ఉత్తరాన లింపోపో నది, దక్షిణాన క్రొకడైల్ నది సరిహద్దులుగా ఉండగా, తూర్పు సరిహద్దులో లెబొంబో పర్వతాలు ఉన్నాయి.
ఇది జీవవైవిధ్యానికి బలమైన నిలయమైనప్పటికీ, ముఖ్యంగా తెల్ల, నల్ల ఖడ్గమృగాల విషయంలో గణనీయమైన వేట సవాళ్లను ఎదుర్కొంటోంది.




కామెంట్‌లు