శ్రీ సీతారాముల
కళ్యాణం చూతము రారండి...!
శ్రీ రామాయణ గాథను
పారాయణం చేద్దాం రారండి...!
మహర్షి వాల్మీకిచే విరచితమైన
శ్రీ మద్రామాయణంలో
వీరభక్తితో విరాజిల్లిన వానర శ్రేష్ఠుడు
శ్రీ అంజనీ పుత్రుని
అమరగాథను విందాం రారండి..!
సకలగుణ సంపన్నుడు
సీతారాములకు నమ్మిన బంటు
లంకా వారధి...నిర్మాణ సారథి…!
వాయువేగంతో లంఘించే వజ్రశిఖరం...
వాయు సుతుడు...గుణవంతుడు...
బలవంతుడు మన హనుమంతుడు...!
వాక్చాతుర్యంతో పలికే పలుకుల్ని
మధుర రస ధారలుగా మంత్రించే..ఓ
మాటల మాంత్రికుడు మన హనుమాన్..!
రఘువంశ తిలకునికి...
దశరధ నందనుడికి దాసుడు...
ఓ దివ్యశక్తి దీపధారి...వీర హనుమాన్...!
దివ్యమైన రామనామం నవనాడుల్లో
నింపుకున్న నిత్యసత్య స్వరూపుడు...!
అరణ్యాంధకారంలో ఆశారేఖగా మెరిసి…
కన్నీటి కడలిలో కాంతి తారకగా నిలిచి…
అశోకవనంలో సూక్ష్మరూపంలో...తల్లి
సీతమ్మను తిలకించి పులకించి...తండ్రి
రామయ్య అనురాగ సందేశాన్ని అమ్మకు
అందించిన అంజనీ పుత్రుడు హనుమాన్..!
అశోక్ వనంలో సీతమ్మ తల్లి
అనుభవించే మానసిక క్షోభను..
కనులారా గాంచి చిత్తం చలించి
రక్తం ఉడికి గుండె రగిలి పగిలి
ఆపై ఉరుమై...ఉరిమి
మెరుపై...మెరిసి ఉగ్రరూపం దాల్చి...
అగ్నిజ్వాలల్లో లంకను కాల్చి బూడిదచేసి..!
"రావణుడికి యముడు"
"రాముడు కాదు రామబంటు" "హనుమంతుడేనని"
లంకాధిపతిని హడలెత్తించిన...
సీతమ్మ ముఖాన చిరుమందహాసాన్ని
గాంచిన అంజనీపుత్రుడు ఆంజనేయుడు..!
రణ క్షేత్రానికి రమ్మని...
రామునితో యుద్దానికి సిద్దం
కమ్మని...రావణాసురునికి రాముని
రణభేరి నినాదాన్ని వినిపించి
విజయద్వారాలకు పునాదులు వేసిన
రణరంగ ధీరుడు...పరాక్రమశాలి
రామదూత మన వీర హనూమాన్...!
లక్ష్మణుడు యుద్దంలో మూర్చిల్లిన వేళ…
వేలవేల యోజనాలు క్షణాల్లో లంఘించి
వెతికి వెతికి సంజీవని పర్వతాన్ని
మోసుకొచ్చిన ప్రాణదాత మన హనుమాన్..!
సాగరుని సాక్షిగా
రామసేతు నిర్మాణంతో నిత్యం
శ్రమించిన వానరసేనకు మార్గదర్శకుడు
మహోన్నతుడు మన వీర హనూమాన్..!
భక్తికి మారు పేరైన …
బలానికి ప్రతిరూపమైన...
సాహసానికి ప్రత్యక్ష సాక్షియైన...
దాస్యానికి దివ్య కిరీటమైన...
ఓ అంజనీ పుత్రా..!
ఓ అభయాంజనేయా..! మీకు
ప్రణామాలు..! సాష్టాంగ ప్రణామాలు..!
అజరామరం మీ అఖండ కీర్తి..
మీ స్మరణే ఒక ప్రేరణ...ఒక స్పూర్తి...
గుడిలోను మీ గుండెలోను కనిపించే
మన ఆరాధ్య దైవం శ్రీ రామచంద్రమూర్తి
మీ సేవే నిత్య కళ్యాణం పచ్చ తోరణం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి