పరాశక్తికి వందనం: -- యామిజాల జగదీశ్

 నా బ్యాగ్‌ జిప్‌ను బాగు చేయించుకోవడానికి కొల్లం వెళ్లే దారిలో ఓ పెద్దమనిషిని కలిశాను.
"పది నిమిషాలు పడుతుంది... దయచేసి వేచి ఉండండి," అని ఆయన తమిళ ఛాయలున్న మలయాళంలో చాలా మర్యాదగా చెప్పారు.
బ్యాగ్ బాగు చేసేంత వరకు వేచి చూస్తూ, నేను ఆయనతో మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టాను.
ఆయన పేరు – పరాశక్తి
గ్రామం – అడిమాలి, ఇడుక్కి.
ఉద్యోగం - గతంలో కేఎస్‌ఈబీలో ఉద్యోగి. పదవీ విరమణ చేశారు. 
చదువు - బీఎస్సీ, డిప్లొమా. 
వయస్సు - 70.
కేఎస్‌ఈబీ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత పరాశక్తి తన బంధువులుండే కొల్లంకు వచ్చారు. తన పెన్షన్ డబ్బుతో, ఆయన ఇడుక్కిలో 3 ఎకరాల యాలకుల తోటను, ఒక ఇంటిని కొనుగోలు చేశారు.
కొల్లంకు వచ్చిన తర్వాత, ఆయన ఖాళీగా కూర్చోలేదు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నంత కాలం నిర్మాణ రంగంలో పనిచేశారు. అలాగే తనకు దొరికిన ఏ పనైనా చేశారు. 
వయసు కారణంగా శరీరం అలసిపోయినప్పుడు, ఆయన రోడ్డు పక్కన బూట్లు, బ్యాగులు బాగు సారి చేసే ఒక వ్యక్తి వద్ద చేరారు. ఆయన వద్ద చెప్పులు, బ్యాగులను కుట్టడం  నేర్చుకున్నారు. ఈ పని నేర్పిన వ్యక్తి ఇప్పుడు లేరు. కానీ ఆ వ్యక్తి చెప్పులు కుట్టిన అదే చోట పరాశక్తి ఇప్పుడా పని చేస్తూనే ఉన్నారు.
ఆయనకు కేఎస్ఈబీ (KSEB) పింఛను వస్తుంది. అయినా, ఆయన ఎండనక, వాననక ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చెప్పులు కుడుతూ పనిచేస్తుంటారు.
కొల్లంలో సంపాదించిన డబ్బుతో, ఆయన తన సొంత కష్టంతో 5 సెంట్ల భూమి కొని ఇల్లు కట్టుకున్నారు.
ఆయన భార్య 5 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆయన కూతురు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి పుదుచ్చేరిలో ఉద్యోగం చేస్తోంది.
ఇప్పుడు, ఆయన కొల్లంలోని ఇంటిని అద్దెకు ఇచ్చేశారు. ఇడుక్కిలోని తన తోటను లీజుకు ఇచ్చేశారు
ఆయన కొల్లంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసిస్తున్నారు. వంట కూడా తనే చేసుకుంటారు. ఆయన కూతురు అప్పుడప్పుడు వస్తుంటుంది.
ఒక కంపెనీ (మహీంద్రా) ఆయన తోటను కొనడానికి ముందుకు వచ్చింది. ఆయన, "నేను అనుకున్న ధర వస్తేనే అమ్ముతాను" అని నిశ్చయించుకున్నారు.
పింఛను ఉన్నప్పటికీ, ఆయన పని చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు : విశ్రాంతి శరీరానికే తప్ప మనసుకు కాదు.
ఆ మూడు ఎకరాల తోట యజమాని ఒక చిన్న కోటీశ్వరుడు. అయినా ఆయన వీధి పక్కన కూర్చుని పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు : గౌరవం బట్టలలో కాదు, కష్టపడి పనిచేయడంలో ఉంటుందని.
ఆయన కూతురు ఒక నర్సు. అయినా ఆయన తన కూతురికి భారం కాకూడదనుకున్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు: పిల్లలు మన ఆస్తి కాదు అని.
ఆయన భార్య 5 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ, ఆయన పని వదులుకోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు: తాను ఒంటరిగా ఉన్నా, ధైర్యంగా నిలబడాలని.
అన్నింటికీ మించి, ఆయన ఇప్పటికీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తారు. ఎందుకంటే ఆయనకు తెలుసు: తాను చెమట పట్టడం ఆపే రోజు, జీవితం క్షీణించడం మొదలవుతుందని.
మనలో చాలామంది 25 ఏళ్ల వయసులో "జీవితం విసుగ్గా ఉంది" అని అంటుంటాం.
30 ఏళ్ల వయసులో, "అవకాశమే లేదు" అని అంటుంటాం.
40 ఏళ్ల వయసులో, "ఇక సమయం లేదు" అని అంటుంటాం.
50 ఏళ్ల వయసులో, "ఇక మేం ఇది చేయలేం" అని అంటుంటాం.
వృద్ధాప్యం ఒక వ్యాధి కాదు... నిష్క్రియాత్మకతే వ్యాధి. అయితే ఇప్పటికీ శ్రమిస్తున్న పరాశక్తి గారికి పెద్ద సెల్యూట్.‌
ఇలాంటి వ్యక్తులే మన దేశానికి వెన్నెముక. వీరిలాంటి వ్యక్తుల వల్లే ఈ ప్రపంచం ఇప్పటికీ అందంగా ఉంది. వయసును జయించే యోధుడి కథలు పాఠ్యపుస్తకాల్లో ఉండాలి కదూ.
తమిళంలో ఈ కథనాన్ని రాసింది డాక్టర్ ఆశా ఉల్లాస్. బాగుంది నుంచుని నేను అనువదించాను. 

కామెంట్‌లు