అనాస: - - యామిజాల జగదీశ్




 తియ్య తియ్య‌గా, పుల్ల పుల్ల‌గా ఉండే పైనాపిల్ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. కొంద‌రు వీటిని నేరుగా పండ్ల రూపంలో తీసుకుంటే కొందరు జ్యూస్ లా చేసుకుని తాగుతారు. అయితే ఎలా తీసుకున్నా పైనాపిల్ పండ్ల‌ను తింటే మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. 
అనాస లేదా పైనాపిల్ ఇదొక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్లలా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువలా ఉంటుంది. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉంటుంది. దీని జన్మస్థలం దక్షిణ అమెరికా. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలలో సాగవుతోంది. దీని ఉత్పత్తిలో హవాయి అనే ప్రాంతం అగ్రస్థానంలో ఉన్నాది. 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తిలో అరవై శాతం హవాయిదే. అమెరికన్ ఆదివాసులకు ఈ పండంటే చాలా ఇష్టం. వారు దీన్ని దేవతాఫలంగా భావిస్తారు. 
ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న అనాస పండు 1548లో మన దేశంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయ్యింది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్‌ను పండిస్తారు. అనాసపండు శాస్త్రీయ నామం ఎకోమోసస్‌. ఇది బ్రొమేలియా జాతికి చెందింది.
ఇది ఒక మీటరు నుండి ఒకటిన్నర మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది కొంచెం పరిపక్వతకు వచ్చిన తరువాత పువ్వు వస్తుంది ఈ పువ్వు సుమారుగా 15 సెం.మీ ఉంటుంది. ఈ పువ్వు 12 నుండి 20 నెలల తరువాత పూర్తి పరిపక్వానికి వచ్చి, దీనిపై కనీసం వంద కనుపులు వరకూ ఏర్పడతాయి. 
అనాసని 1398లో మొట్టమొదటగా కనుగొన్నారు. 
1664లో యూరోపియన్లు దీనిని పైన్‌ కోన్‌గా పిలిచారు. 
బ్రెజిల్ లో  టూపీ అని పిలుస్తారు. అంటే అద్భుతమైన పండు అని దీని అర్థం. 
అనాసను ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. స్పానిష్‌లో పైన్‌ కోన్‌, అమెరికాలో అనాస్‌, మన దేశంలో అయితే ఒరియాలో సాపూరీ పనాసా, తమిళంలో అనాచీ అని పిలుస్తారు. బ్రెజిల్‌లో అబాకాక్సీ అని, ఇంగ్లీషులో  పైన్‌యాపిల్‌ అని, తెలుగులో అనాస అని అంటారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండల గిరిజనులు ఈ పంటను విస్తారంగా పండించి రాష్ట్రం నలుమూలలకు పంపిణీ చేస్తున్నారు. 
వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికం. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడుతుంది. 
దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి. అనాస పండు రసం ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో ఉపయోగిస్తారు. 
ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలు తీసుకుంటే మనకు రోజు మొత్తంలో అవసరమైన విటమిన్‌ సి లభిస్తుంది. దీంతో రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుంది. కణజాలం వృద్ధి చెందటానికీ, కణాల మరమ్మత్తులోనూ విటమిన్ సి కీల‌క‌పాత్ర పోషిస్తుంది.  పైనాపిల్ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తాయి. 
అలాగే క్యాన్సర్‌, గుండెజబ్బు వంటి జబ్బులు దరి చేరకుండా చూస్తాయి.  పైనాపిల్ పండ్ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అలాగే వ్యాయామం చేసే వారు నిత్యం పైనాపిల్ పండ్ల‌ను తింటే శ‌క్తి బాగా అంది దేహ‌ధారుడ్యం ల‌భిస్తుంది. పైనాపిల్‌తో కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలూ దూరమవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్‌ అనే ఎంజైమ్‌ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి, ఎక్కువ ఆహారం తినకుండా చూస్తుంది. అలాగే మలబద్ధకం దరి చేరకుండా కాపాడుతుంది. పైనాపిల్‌లో మాంగనీస్ కూడా పుష్క‌లంగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలతో మన శరీరానికి రోజుకు అవసరమైనంత మాంగనీస్ లభిస్తుంది. ఇది విటమిన్‌ సితో కలిసి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది. పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న అనాస పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. పచ్చకామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన అనాసపండు రసం ఇస్తే చాలా మంచిది. అనాస పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు వుంచి తింటే అజీర్తి పోతుంది. పేగులో చలనం కలిగి విరోచనం సాఫీగా అవుతుంది. అయితే గర్భవతులు అనాస పండు తినడం శ్రేయస్కరం కాదు, గర్భవిచ్ఛిత్తి అయ్యే ప్రమాదముంది. పచ్చికాయల రసంలో ఉప్పు వేసుకొని తాగితే ఋతుస్రావమౌతుంది. గర్భవిచ్ఛిత్తి కలుగుతుంది. కనుక గర్భవతులు తినకపోవడం మంచిది.
ప్రపంచంలోనే అత్యంత బరువైన పైనాపిల్ 8.28 కిలోగ్రాములు. 
ఆస్ట్రేలియాలోని బేక్‌వెల్‌లో క్రిస్టీన్ మెక్‌కల్లమ్ (నవంబర్ 30, 2011) దీనిని పండించి రికార్డు సృష్టించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత పైనాపిల్ ఆకార నిర్మాణం దక్షిణాఫ్రికాలో ఉంది. ఇది 16.5 మీటర్ల ఫైబర్‌గ్లాస్ భవనం.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న వూంబైలోని 'ది బిగ్ పైనాపిల్' అనేది 1970లలో నిర్మించిన ఒక ప్రసిద్ధ 16 మీటర్ల పర్యాటక కేంద్రం.




కామెంట్‌లు