బలమైన రాజ్యం
బలహీన రాజ్యాన్ని
తన గుప్పిట్లో బంధించాలని
తన సరిహద్దుల్లో కలపాలని
అనుకోవడం సహజమే...
కానీ.....
యుద్ధానికి కాలు దువ్వే ముందు
అన్ని కోణాల్లో చూడాలి
తర్వాతి పరిణామం
తన పరిస్థితి ఏమవుతుందో
లోలోపల ఆలోచించాలి...
ఎందుకంటే.....
"బలవంతుడనాకేమని....
చలి చీమల చేత
చిక్కి చావదే సుమతి"
అనే మాటలోనే
ఒక గాఢమైన నిజం దాగి ఉంది...
యుద్ధం అంత ఆషామాషి కాదు—
అది అగ్నిపర్వతం లాంటిది.
విస్ఫోటనం అయ్యాక
లక్షల ప్రాణాలు బూడిదవుతాయి,
కోట్ల ఆస్తులు క్షణాల్లో కనుమరుగవుతాయి...
ప్రకృతి దెబ్బతిని,
విషపూరితం అవుతుంది.
గాలి, నీరు, నేల—
ఏళ్ల తరబడి
జీవరాశులపై ముద్ర వేసి
బాధగా మిగుల్చుతుంది.
ఊబిలో చిక్కుకున్నట్లు
వెనక్కి రావాలనుకున్నా
వీలు కాని స్థితి—
పులి పంజా విసిరిన దేశం
కూడా తానే తన గాయాల్లో మునిగి
ఉక్కరిబిక్కిరి అవుతుంది.
అందుకే.....
బలం కంటే బుద్ధి గొప్పది,
అహంకారం కంటే ఆలోచన మిన్నది...
శాంతి కోసం నడిచే అడుగు
యుద్ధం కంటే మహత్తరం—
ప్రపంచం నిలవాలి అంటే
మనసులు గెలవాలి, దేశాలు కాదు ...
మీ
✍️మిత్రాజి
( గుండవరం ప్రభాకర్ రావు పంతులు )
ఫోన్ నం. 9949267638
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి