సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -186:-ఆలి ఏడ్చిన ఇల్లు - ఎద్దు ఏడ్చిన ఎవుసం
***
"ఏమో అవ్వా! గా శెల్లెను సూత్తుంటే గదెట్ల బత్కుతుందో ఏమో అనిపిస్తది. దాని నెత్తిన యిత్తులు పడ్డ కానించి సూత్తున్న. ఎన్నెలస్మంటి గా మొగంల  ఎన్నడూ శీకటే. ఏంది శెల్లె అంటే నోరిడిచి శెప్పదు. గట్టిగా అడిగితే పిల్లలున్నారు సూడు గాళ్ళు ముందడి కాళ్ళకి బందాలక్కా. ఏం జేద్దామన్నా గాళ్ళు అన్నేలమైతరని నేనే అన్నేలమై పోతున్నక్కా! అనే దాని మాటలు యాదికొచ్చినప్పుడల్ల  మన్సు కలికలి అయితదవ్వా!"
 "శెల్లే! దుఃఖపడకు.దాన్ని నిత్తెం ఏడిపిచ్చి గాడేం బావుకుంటుండు శెప్పు. గుర్కాయించుడు,గుడ్లురుముడు తప్ప ఇంగేం శాతయిద్ది.  సంటి పొల్లలిద్దరు గాన్ని సూశి రాచ్చసుని సూశినట్టె బయపడ్తరు. గాడసలు మురిపెం ,ముద్దే జెయ్యడు. ఎప్పుడన్న తప్పనిడిశి చేత్తే  గా సంటోళ్ళు గజ్జున వొణుక్కుంట, ఏడ్సుకుంట, అందకుండ వోతరు. ఎట్ల పెళ్ళాన్నే గాదు పొల్లగాండ్లని సుత దూరం జేసుకుండు.
 గట్ల పెళ్ళాం పిల్లల్ని ఏడిపిచ్చేటోడు,రాశి రంపాన పెట్టెటోడు ఏం బాగు పడ్డడు శెప్పు. గానిల్లు ఎప్పుడూ నిద్దర బోయినట్టే ఉంటది. ఓ మాటల సరదా, మమతల సంబురం,అచ్చటా ముచ్చటా ఏనాడూ గాన్రావు."
 ఓ మగానుబావుడు అన్నట్టు ఇంట్లె ఆడోళ్లను ఏడిపిచ్చేటోనింట్ల  డబ్బు,గిబ్బూ ఏమి నిల్వవంట.
 పెళ్ళాన్ని! పనిమనిషి లెక్క సూశేటోడు .బయట ఎవల మీద నన్న పతాపం సూపిత్తె ఊకుంటరా ఏంది?"
గాన్ని అందరు తిట్టుడే. "ఆలి ఏడ్శిన ఇల్లు, గాడు  ఏడ్పిచ్చిన ఆని ఇల్లు వుద్దిలోకి వొత్తదా? ఎన్నటికీ రాదు శెల్లే! గిది శాపమన్కో. ఇంకేదన్న అన్కో"
అవునవ్వా! గట్లనే మా ఇంటెనెకాల బజార్న ఒకకుండు.గాడు ఇంకో రకం. పసులతో బండశాకిరి చేయిత్తడు. పైగా ఎగసాయం జేస్తున్నడు గని అవ్వా! అరక నాగలి దున్నే పశులకీ ఎద్దులకీ ఏనాడూ కడ్పు నింపడు. గాని ఎద్దుల్ని సూత్తుంటే కటికోడు సుత కొనడవ్వా! గంత బక్కగుంటయి."
గిస్మంటి పాపిట్టోల్ల ముచ్చట ఇంటే సుత పాపమే అవ్వా!
 అందుకే శెల్లే మన పెద్దోళ్ళు ఆలి ఏడ్శిన ఇల్లు - ఎద్దు ఏడ్చేసిన ఎగసాయం ఎన్నటికీ బాగు పడవు అంటరు. గా పెద్దోళ్ళు జెప్పినట్టు. రాశికి రావు రంగానికి రావు శెల్లే. ఒకేల వొచ్చిన అవెట్లొత్తయో గట్లనే వోతయి.
"అవును శెల్లె! ముమ్మాటికీ నిజం. పశలను సక్కంగ సూసుకోవాలె. గప్పుడే ఎగసాయం మంచిగుంటది. ఇంట్లె ఆలిని పేమ జెయ్యాలె.గప్పుడే ఇల్లు కళకళ్ళాడుద్ది."
 గదండీ సంగతి! "ఆలి ఏడ్చిన ఇల్లు - ఎద్దు ఏడ్చిన ఎవుసం"  గివి కుటుంబానికి దెబ్బనే.గట్లనే పంటకూ దెబ్బనే. ఆ రెండూ మంచి గున్న సోట సంబురాలు, సిరులుంటయన్నది మరవొద్దు.

కామెంట్‌లు