కవిత అంటే…:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,-\భాగ్యనగరం.
కవితంటే మాటల మురిపెంగా
మనసును మెల్లగా మెప్పించాలి —
మల్లెపూల పరిమళంలా
మాటల మధ్య మాధుర్యం జార్పించాలి।

కవితంటే మెరుపుల జిలుగుగా
అక్షరాల్లో ఆలోచనలు మెరిపించాలి —
ఒక్క పదమే పిడుగైపోయి
నిద్రలోనూ చైతన్యం నింపేలాగుండాలి।

కవితంటే మత్తును దూరం చేసే
మధురమైన జ్ఞాపకాల మందు కావాలి —
చీకటిలో చతికిలపడక
దారిచూపే దీపమై నిలవాలి।

కవితంటే మాధుర్య గానం
మనసు గూటిలో గూడు కట్టాలి —
చల్లని గాలిలా చేరి
చింతలను మెల్లగా దూరం చేయాలి।

కవితంటే హృదయాన్ని తట్టాలి
మనిషి మనసును మెలిపెట్టాలి —
నిశ్శబ్దంలో మాటలై
నిజాలను నిద్రలేపాలి।

కవితంటే మానవత్వ దర్పణం
మనుగడకు మార్గం చూపాలి —
కన్నీటి బొట్టులోనూ
కరుణ వెలుగులు నింపాలి।

కవితంటే కేవలం పదాలు కాదు —
ప్రాణం పొసిన భావాల ప్రపంచం
మనసు నుంచి మనసుకు చేరే
మానవత్వపు మధుర సందేశం।


కామెంట్‌లు