జీవిత చరిత్రల ధ్యేయం: - డా.కందేపి రాణీప్రసాద్

 నేను శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను "సైన్స్ పాయింట్" అనే పుస్తకంగా 2003లో తీసుకువచ్చాను. నేము 2000 సం. నుండి 2003 సం. దాకా రాసినటువంటి శాస్త్రవేత్తల వ్యాసాలు 'బాలతేజం' అదే) పత్రికలో 'సైన్స్ పాయింట్' కాలముగా ప్రింటయ్యాయి.  ఈ పిల్లల పత్రిక కొన్ని రోజులు ఆగుతూ, కొన్ని రోజులు వస్తూ, 2008 దాకా కొనసాగినట్లున్నది. 2008 దాకా నేను వ్యాసాలు రాస్తూనే ఉన్నాను. పిల్లల కవితలు, పొడుపు కథలు చాలా ప్రింటయ్యాయి. బాలతేజం పత్రిక ఎడిటర్ గారు నా కలంకు పెట్టిన పేరునే నేను నా పుస్తకానికి పెట్టుకున్నాను. ఈ పుస్తకానికి భారత మాజీ రాష్ట్రపతి క్షిపణి శాస్త్ర వేత్త డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారి ముఖ చిత్రాన్ని వేసుకున్నాను. నేను గీసిన వారి రేఖాచిత్రాన్ని ఇన్నర్ పేజీగా వాడుకున్నాను. ఇలా తొలి సారిగా జీవిత చరిత్రల ప్రక్రియలో 'సైన్స్ వాయింట్' అనే బాలల సైన్స్ రచనను వెలుగులోకి తెచ్చాను.
2013వ సం.లో అంటే నేను పుస్తకం రాసిన పదేళ్ళ తర్వాత డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాంను చూసే భాగ్యం కలిగింది. అంతర్జాతీయ పిల్లల డాక్టర్ల సమావేశాలకు ముఖ్య అతిథిగా 2013లో కోల్‌కతా వచ్చారు. మా వారు పిల్లల డాక్టరు కావటం వలన మేము సమావేశంలో ఉన్నాము. అబ్దుల్ కలాం గారి ముఖ చిత్రంతో ఉన్న ఈ పుస్తకాన్ని వారికివ్వాలని అనుకున్నాం. అందుకోసం వారి పర్మిషన్ తీసుకున్నాము. తొలిసారిగా నేను రాష్ట్రపతిని చూడబోతున్నానని ఆనందంలో ఉన్నాను. జాతీయ ఐఎపి ప్రెసిడెంట్ గారి ద్వారా మేము అబ్దుల్ కలాం గారి రూమ్‌లోకి అడుగుపెట్టము. కలం గారు లోపలి నుంచి హాల్‌లోకి వచ్చారు. నేను పుస్తకం చేతికిచ్చి "ఇది శాస్త్రవేత్తల జీవిత చరిత్రల పుస్తకం " అని చెప్పాలనుకున్నాను. కానీ నోరు పెగల్లేదు. అంతలో కలాం గారు నా పుస్తకంపై ఆటోగ్రాఫ్ చేసారు." నువ్వు ఏమేమి రాస్తావు " అని అడిగారు. "పిల్లలకు సంబంధించిన సైన్స్ రాస్తాను " అని చెప్పాను. పిల్లలు, సైన్స్ రెండూ అబ్దుల్ కలాం గారికి ఇష్టమైన విషయాలు కదా! అందుకే 'వెరిగుడ్ ఎప్పుడూ సైన్స్, పిల్లలు వదిలి పెట్టకుండా రాయమని ఆశీర్వదించారు. ఆ తర్వాత మా వెనక వాళ్ళు తొందదర పడుతూ మమ్మల్ని పంపేశారు. చాలా ఉద్విగ్ర భరిత ఆనందమయ క్షణాలు. ఒక క్షిపణీ శాస్త్రవేత్తను, ఒక రాష్ట్రపతిని చూండటం, మాట్లాడటం అంటే మాటలు కాదు గదా!.
ఈ సైన్స్ పాయింట్ పుస్తకాన్ని ఎందుకు రాయాలి అనుకున్నానంటే -  1966లో నేను కాకతీయ విశ్వవిద్యాలయం వారి స్టడీ సెంటర్‌లో లెక్చరర్‌గా చేరాను. 1995లో నా తెలుగు ఎం.ఏ కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాను. అప్పటికి సిరిసిల్లలోని గవర్నమెంట్ కాలేజీలో మహిళా లెక్షరర్లు ఎవరూ లేరు. క్లాసుల్లో ఆడపిల్లలు చాలా తక్కువగా ఉన్నారు. అప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు "మీరు లెక్చరర్‌గా ఉంటే పది మంది ఆడపిల్లలు చేరే అవకాశముంది కదా ప్రయత్నించండి. " అని సలహా ఇచ్చారు. అలా నేను లెక్చరర్‌గా జాయినై 2007వ సం. దాకా డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పాను.
కాలేజీలో పిల్లలకు మామూలు పాఠాల కన్నా ఎక్కువగా చైతన్య పరిచేవి, స్ఫూర్తి, కలిగించే విషయాలు చెప్పేదాన్ని. ఎందుకంటే వీరంతా చదువుకునే వయసులో అవకాశం లేక పెద్దయ్యాక చదువుకుందామని వచ్చిన వారు కాబట్టి, బిడియం, సిగ్గు ఉంటాయి. అందుకే వాళ్ళని ప్రోత్సాహ పరచడానికి రకరకాల ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు, వారి జీవితాల్లోని ముఖ్య సంఘటనలు చెప్పే దాన్ని. నేను కాలేజీలో విద్యార్ధిగా ఉన్నప్పుడే సంవత్సరం పాటు వయోజన విద్యా క్లాసులు చెప్పాను. ఆ అనుభవం నాకిక్కడ ఉపయోగపడింది. పెద్ద వాళ్ళకు పాఠాలెలా చెప్పాలో, వారినెలా ఉత్సాహ పరచాలో అర్థమయింది. ఇలా చెబుతున్నప్పుడే ఒక రాజు "అలెగ్జాండర్ ఫ్లెమింగ్" అనే శాస్త్రవేత్త గురించి చెప్పాలనుకున్నాను.
పిల్లలూ: 'మీకు' ఫ్లెమింగ్' తెలుసు కదా! అని అడిగాను. చాలా మంది అబ్బాయిలు ‘మేడం తెలుసు, క్రికెట్ స్టార్’ అని అన్నారు. దానితో నాకర్ధమయిందేమిటంటే ఈ నాటి విద్యార్థులకు మన శాస్త్రవేత్తల గురంచి తక్కవగా తెలుసని. అప్పుడే ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో కష్టాలు పడి, ఎంతో శ్రమకు ఓర్చి మానవాళి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మ హనీయులు, ప్రాతః స్మరణీయులైన శాస్త్రవేత్తల జీవిత చరిత్రల గురించి పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాను. శాస్త్రవేత్తల  జీవిత చరిత్రల పుస్తకం రాయడానికి కలిగిన స్ఫూర్తి ఇది.
సైన్స్ పాయింట్ పుస్తకాలు ప్రింటు చేసి, చాలా మంది పిల్లలకు పంచి పెట్టాను. ఇప్పటికి పుస్తకాలు అన్నీ అయిపోయాయి. మరల పుస్తకం వేయాలనుకున్నాను. ఆ పుస్తకాన్ని పునర్ముద్రించడంతో పాటు, కొత్తగా రాసిన శాస్త్రవేత్తల చరిత్రలు కూడా వెయ్యాలనుకున్నాను. దానితో కొత్తగా రాసిన ఇరవై మంది శాస్త్రవేత్తల చరిత్రలు, పాత పుస్తకంలోని ఇరవై మంది శాస్త్రవేత్తల చరిత్రలు కలిపి మొత్తం నలభై మంది శాస్త్రవేత్తలను పిల్లలకు పరిచయం చేద్దామనుకున్నాను. ఫలితంగా ఈ పుస్తకం మీ ముందుకు రానున్నది. నేను సైన్స్ పాయింట్, సైన్స్ వరల్డ్, సైన్స్ కార్యర్, సైన్సే ప్లానెట్, సైన్స్ కథలు అని పేర్లు పెట్టాను. దీనికి కూడా అదే బాటలో సైంటిస్టులు అందామనుకున్నాను.
సాహిత్య ప్రక్రియల్లో జీవిత చరిత్ర కూడా ఒకటి. ఈ ప్రక్రియ మొదటగా ప్రాచీన గ్రీస్, రోమ్‌లలో ఉద్భవించంది. గ్రీకులు తరచుగా తమ దేవతల గురించి, రాజుల గురించి జీవిత చరిత్రలను రాసేవారు. గ్రీకు జీవిత చరిత్రల్లో ఒక రచన చాలా ప్రసిద్ధమైనది. అదేమంటే  'ప్లూటార్క్' రచించిన 'ప్యారలల్ లైవ్స్' అనే రచన. కార్నేలియస్ నెపోన్ అనే రోమన్ రచయిత "ఎక్సలెన్షియం ఇంపెరేటోరమ్ విటే " అనే జీవిత చరిత్రను రాశారు. ఇది తొలి జీవిత చరిత్ర. ఆ తరువాత జూలియస్ సీజర్, సుటోనియస్ రచించిన ' డివిటా సీజరమ్' అనే రచన అత్యంత ప్రసిద్ధి గాంచినది. ఇందులో పదకొండు మంది రోమన్ చక్రవర్తుల జీవిత చరిత్రలు ఉన్నాయి. రాజల తరువాత సైనికుల జీవిత చరిత్రలు గ్రంధస్థం చేయబడ్డాయి. గ్రీకులు, రోమన్లు మొదలు పెట్టిన జీవిత చరిత్రల సంప్రదాయం శతాబ్దాల పాటు నియమంగా కొనసాగింది.
జీవిత చరిత్ర అంటే వేరోకరు రాసే సాంప్రదాయ చరిత్ర. దీనినే ఎవరికి వారు స్వయంగా రాసుకుంటే ఆత్యకథ అవుతుంది. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అనేక మంది ఆత్మకథలు రాసుకున్నారు. ఇరవయ్యవ శతాబ్దం చివర్లో, ఇరవై ఒకటవ శతాబ్ధం ప్రారంభంలోనూ జీవిత చరిత్ర బాగా ప్రాచుర్యం పొందింది.
జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి జీవిత కథ. ప్రస్తుతం బ్రతికి ఉన్న వ్యక్తి జీవిత కథ కావచ్చు లేదా శతాబ్దాల క్రితం జీవించిన వ్యక్తుల కథలు కావచ్చు లేదా చరిత్ర మరిచిపోయిన అనామక వీరుడి గురించి కావచ్చు. ఏదైనా ఆ వ్యక్తి సాధించిన విజయాలు తరువాతి తరాలకు ఆదర్శప్రాయంగా ఉండవలసిన విషయాలై ఉండాలి. ఆ వ్యక్తి తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడో తెలిపే విధంగా ఉండాలి. -మహా నాయకులు, రాజులు, సైకికులు, శాస్త్రవేత్తలు వంటి మహనీయుల గురించి తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
జీవిత చరిత్రల్లో ముఖ్యంగా కొన్ని అంశాలను తప్పక చేర్చాలి. మహనీయులు పుట్టిన తేదీ, ప్రదేశం, కుటుంబ సభ్యులు, బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం, వృత్తి జీవితం, సాధించిన విజయాలు,  దక్కిన గౌరవాలు వంటివి ప్రధానంగా పొందుపరచాలి. అభిరుచులు, ఆసక్తులు, కీర్తి ప్రతిష్టలకు గల కారణాలు, జీవిత సంఘటనలు, మరణించిన తేదీ, మరణించిన ప్రదేశం,  మరణానంతర బిరుదులు, గౌరవాలు, ఛాయాచిత్రాలు పొందుపరిస్తే సమగ్రంగా ఉంటుంది. ఆ కాలంలో వచ్చిన అడ్డంకులు, సామాజిక పరిస్థితుల్ని కూడా అర్ధం చేసుకోవలసి ఉంటుంది.
ఆత్మకథ అనేది తన గురించి తాను రాసుకునేది. జీవిత చరిత్ర అనేది వేరొకరి గురించి కూలంకషంగా తెలుసుకుని రాసేది.  ఇది పరాశ్రయం. ఒక వ్యక్తి యొక్కే జీవిత విశేషాలను, సంఘటనలను, సాధనలను, వ్యక్తిత్వాన్ని గురించి వేరే వ్యక్తి వాస్తవికతకు లోబడి రాసే రచనా ప్రక్రియే జీవిత చరిత్ర అనబడుతుంది. మిగతా సృజనాత్మక రచనల్లో ఉన్నట్లుగా జీవిత చరిత్రలో కల్పనలకు తావు లేదు. వాస్తవాలను యధాతథంగా ప్రామాణికంగా రాయగలగాలి.
ఒక వ్యక్తికి సంబంధించిన ఉత్తరాలు, డైరీలు ఇంటర్వ్యూలు, పాత ఫోటోలు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా వివరాలు తెలుసుకోవడం వంటి వాటి ద్వారా విషయాలు సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని ఒక పద్ధతిలో క్రములుద్ధికరించుకోవాలి. సమాజంపై ప్రభావం చూపిన మహా పురుషుల జీవితాలను లోకానికి తెలిసేలా రాసే ప్రక్రియే జీవిత చరిత్ర. కాలక్రమానుసారంగా వారి జీవిత విశేషాలను పద్థతిలో అమర్చి రాయాలి. వారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు, పొందిన కీర్తి ప్రతిష్టలు, మరణ విశేషాల వంటి ముఖ్యమైన ఘట్టాలు తప్పక ఉండాలి. తెలుగులో జీవిత చరిత్రల రవనకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం పంతులు. అనేక చరిత్రలు రాసిన రచయితగా పేరు పొందిన వ్యక్తి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య.
నేను సైన్స్ పాయింట్ అనే జీవిత చరిత్రల పుస్తకం తర్వాత 'నా జ్ఞాపకాలలో అమ్మ' అనే స్మృతి వ్యాసాల పుస్తకాన్ని రచించాను.  ఇది కూడా ఒక రకంగా జీవిత చరిత్రయే అనిపిస్తుంది. అమ్మ చేసిన పనులను, కష్టాలను, సాంధించిన విజయాల గురించి రాశాను. ఇదంతా అమ్మతో నేను అనుభవించిన ఆనందమయ క్షణాల గురించి రాసినది.
ప్రస్తుత పుస్తకం' సైంటిస్టులు' లో నలభై మంది శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు ఉన్నాయి. శతాబ్దాల క్రితమే కనుక్కున్న గ్రహాల చలనం, చక్రం, సూక్ష్మదర్శిని, భూమ్యాకర్షణ సిద్ధాంతం, వంటివన్నీ శాస్త్రవేత్తలు ఎలా కనుక్కున్నారో వివరించాను. సకల సౌకర్యాలున్నా చిన్న వాటికే మనస్తాపాలు చెందే పిల్లలకు ఈ శాస్త్రవేత్తత జీవితాలు కనువిప్పు కాగలవు. వందల సార్లు ఓటమిని ఎదుర్కొన్నా గెలుపు కోసం ప్రయత్నించిన మహాపురుషుల జీవిత గాథలు ఈనాటి పిల్లలకు ఎంతో అవసరం అని భావిస్తున్నాను. సైన్స్ పాయి౦ట్‌లోని వ్యాసాలు కాకుండా, రాసిన మిగతా ఇరవై సైంటిస్టుల జీవిత చరిత్రలు సంచిక వెబ్ మ్యాగజైన్‌లో ప్రచురితం అయ్యాయి. విద్యార్థుల చూపు రిసెర్చి వైపు, శాస్త్రీయత వైపు మళ్ళించాలి. అప్పుడే భారతదేశం ప్రగతి బాటలో పయనిస్తుంది. పరిశోధనా రంగంలో ముందుండే పిల్లలు ప్రతి విషయాన్ని తర్కంగా పరీక్షిస్తారు. నాఈ పుస్తకం విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని ఆస్తున్నాను.


కామెంట్‌లు