వ్యాపారి నిజాయితీ: - - యామిజాల జగదీశ్
 ఒక వ్యాపారి తన ప్రయాణం కోసం ఒంటెను కొనడానికి సంతకు వెళ్ళాడు.
అతను బేరమాడి తాననుకున్న ధరకు ఒంటెను కొని, దానిని తోలుకుంటూ వెళ్ళాడు.
ఒంటెను కొన్న వ్యాపారి ఆనందంగా ఇంటికి చేరాడు. తనకు సరసమైన ధరకు మంచి నాణ్యత గల ఒంటె దొరికిందని మనసులో అనుకున్నాడు.
అతను ఇంటికి చేరుకున్నాక, తన సేవకుడిని పిలిచి, ఒంటెను పెరట్లో కట్టి ఉంచమని చెప్పాడు.
అంతకు ముందు, అతను ఒంటెపై ఉన్న జీనును విప్పడానికి ప్రయత్నించాడు. కానీ విప్పలేక పోయాడు.
అతను తన సేవకుడిని పిలిచి, ఒంటెపై ఉన్న జీనును విప్పమని చెప్పాడు.
"జీను" (Saddle) అంటే గుర్రం, ఒంటె లేదా ఎద్దు వంటి జంతువులపై కూర్చునే వ్యక్తి సౌకర్యం కోసం, దాని వీపుకు బిగించే ఒక రకమైన ఆసనం.  ఇది స్వారీ చేసేవారికి అనువుగా ఉండి భద్రతను ఇస్తుంది. దీనిని 'జీనము' అని కూడా అంటారు. 
బండ్లు లాగే జంతువులకు బిగించే పట్టీల సముదాయం అని కూడా అనవచ్చు.
ఒంటెపై ఉన్న జీనుని సేవకుడు విప్పుతుండగా ఒక సంచి కింద పడింది. దానికున్న మూత తెరచి చూడగా వెలకట్టలేని రత్నాలు కనిపించాయి. వాటిని చూసి 
ఆశ్చర్యపోయిన సేవకుడి కళ్ళు పెద్దవయ్యాయి. అవి మెరుస్తున్నాయి.
అతను వాటినలానే తీసుకుని తన యజమానికి చూపించడానికి పరుగెత్తాడు.
వెంటనే వ్యాపారి ఆ సంచిని తీసుకుని ఎవరి దగ్గరైతే‌ ఒంటెను కొన్నాడో అతని దగ్గరకు బయలుదేరుతుండగా సేవకుడు, "అయ్యా, ఓ చిన్న మాట. దీని గురించి ఎవరికీ తెలియదు. ఇది దేవుడిచ్చిన బహుమతి. మీరే ఎందుకు ఉంచుకోకూడదు?" అని అడిగాడు.
కానీ వ్యాపారి అందుకు ఒప్పుకోకుండా వెళ్ళిపోయాడు.
వ్యాపారి జరిగినదంతా చెప్పి దొరికిన నిధి సంచిని తనకు ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చేశాడు.
అయితే ఆ వ్యక్తి కృతజ్ఞతతో దాన్ని స్వీకరిస్తూ "మీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను. నేను మీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఇందులో నుంచి మీకు నచ్చిన కొన్ని రత్నాలు తీసుకోండి" అని అతని  ముందు చాచాడు.
అయితే వ్యాపారి చిరునవ్వుతో, "ఈ నిధిని మీకు ఇచ్చే ముందే నేను రెండు విలువైన రత్నాలను ఉంచుకున్నాను" అన్నాడు.
వెంటనే, ఒంటెనమ్మిన వ్యక్తి ఆ రాళ్లను లెక్కించగా ఏ ఒక్కటీ తక్కువ కాలేదని కనుగొన్నాడు. అవన్నీ సరిగ్గా ఉండటం చూసి అతను అయోమయానికి గురయ్యాడు.
వెంటనే, వ్యాపారి, "నేను మీకు చెప్పిన ఆ రెండు రత్నాలు... నా నిజాయితీ. నా ఆత్మగౌరవం," అని గంభీరంగా అన్నాడు.
నిజాయితీగా జీవించడం పెద్ద విషయమేమీ కాదు. తప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ, నిజాయితీగా జీవించటమే ముఖ్యం.
జీవితంలో ఒక్క రోజైనా నిజాయితీగా జీవించి, దాని వాస్తవాన్ని తెలుసుకుంటే, మనం ఎట్టి పరిస్థితిలోనూ నిజాయితీని కోల్పోము.

కామెంట్‌లు