“ఏ దారి నాది?” : -గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
దార్లు పిలుస్తుంటే—
దిక్కులు చూపుతుంటే—
మనసు మెల్లగా అడుగుతుంది,
“ఏ దారి నాది?” అని॥

కొత్తదారి పడతవా—
కలల కొసలు తాకుతావా?
పాతదారి వీడుతావా—
పాఠాల పునాదిని మరిచిపోతావా?॥

మంచిదారి వెదుకుతావా—
మానవత్వం ముద్దాడుతావా?
చెడ్డదారి వదులుతావా—
చీకట్లు చెదరగొడతావా?॥

పూలదారి నడుస్తావా—
సుగంధాలు ఆస్వాదిస్తావా?
ముళ్ళదారి తొక్కుతావా—
సహనం వహిస్తావా?॥

రాజబాట ఎంచుకుంటావా—
నాయకత్వ నీడగా నిలుస్తావా?
బంగారుబాట అనుసరిస్తావా—
భవితను సుఖమయం చేసుకుంటావా?॥

దారులు ఎన్నో—
దిశ ఒకటే కావాలి;
మనసు మంచిదైతే—
ప్రతి దారీ వెలుగే అవుతుంది॥

అడుగు నీవు వేస్తే—
అది దారి అవుతుంది;
నీతితో నడిస్తే—
అది జీవిత గాథ అవుతుంది॥

.

కామెంట్‌లు