సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా రావు ఖమ్మం

 సామెత-191: ఆశకు మించిన దూరం -మిత్తికి మించిన వేగం లేవు
*****
అబ్బబ్బా ఎక్కడాశె ఎక్కడాశె అవ్వా!  కాళ్ళ జేత పోగేసుకోవాలనే? గిదంత కట్క పోతరా ఏంది? ఇంగ ఇక్కడే ఉట్టిగట్టుకొని ఊరేగేదే ఉంటె గా ఆశపోతు జాతే దప్ప ఇంగేం మిలిగేది గాదేమో?"
 "ఏంది శెల్లే! ఏమైంది?గంత ఇదిగ ఉన్నవ్? నీ మాటల్ల ఇశారం,కోపం,బుగులు ముప్పేట్ల అగుపిత్తున్నయి."
 "అవునవ్వా! బత్కడానికి ఎంత గావాలె జెప్పు ఆశుండాలె గని మరీ గంత గనమా? మందిని ముంచి కూడేస్కునేటంతనా?"
"మరీ లేదన్నట్లు గాదవ్వా! గాళ్ళకి ఒక్కొక్కల్ని డబ్బుల కట్టలతో తగలేశేటంత ఉంది.ఉంటే వాయితీ! ఎవడి కుంటే గాడికే ఉంటది.ఉండనీ అనుకునేటట్టు లేదు.మరీ గంతాశన? మా తాతోళ్ళ గుడిశె మీద గా మాయదారోల్ల కన్నుబడ్డదవ్వా !గా తలం సెంటర్ల ఉందని అమ్ముతవా ? నిన్నే లేపెయ్యమంటవా అని బెదిరుత్తుండ్రంట. తాత గా తలం గొన్నప్పుడు సుట్టూ జంగలేనటవ్వా. అయిన దైర్నంగ గుడిశేసుకోని సుట్టూ శెట్లు పెంచుకొని మారాజ బవనంల ఊయించుకుని అందుట్ల కాపురం జేసిండు. మా అమ్మ, మావయ్యల్ని సక్కంగ పెంచి పెండ్లి పేరంటాలు జేసిండు. గస్మంటి అడివి కాత్త సుట్టూ ఇండ్లతో  పెద్ద రోడ్ బడి పట్నం లెక్క అయ్యింది. కొడుకులు పెద్దిల్లు కట్టిత్తమన్నా గా గుడిశెనే బాగుందని ఏటేట కప్పిచ్చుకోవడం.శిన్న శిన్న రిపేర్లు సేయిచ్చుకొని అమ్మమ్మతో  కలిశి బతుక్కుంట ఆనందంగా ఉంటుండు."
 "మరేమైంది శెల్లే! ఎవలాడు బెదిచ్చేది? వాని ఆశ పాడు గాను.వాడి నోరు వడ.
"గాడే అవ్వా!  భద్రిగాడు.గీ నడ్మల డప్పాలు గొట్కుంట సోటామోటా నాయకుడై తిర్గుతుండు. గానికి గా తలం మీద కన్నువడ్డది పక్కన పేద్ద దుకాణం గట్టుకుండు.బేరం గీరం బాగనే నడుత్తుంది.గిప్పుడు గిది గావాల్నని తాతని రకరకాల్గ శికాకు జేత్తుండు. గంతాశనా అవ్వా నువ్వే జెప్పు.
 మా మావఁలు సుత గా గుడిశె దీసి తలాయింత ఏస్కొని దుకాణం ఇల్లు కడ్దామని అనుకుంటుర్రు.గాల్లని పడనీయట్లే ఆడే కొని ఆడే కట్టాల్నట.గిదెక్కడి పాపం అవ్వా!
 ఇంగ ఇటు పక్కన ఉన్నోడు పైసలు మిత్తికిత్తడు. గట్ల ఇచ్చి ఇచ్చి ఎంత మందిరి పేదోళ్ళ ఆత్తులు అమురుకుండో.. గాడేమో మీకు ఎన్ని పైసలు గావాల్నో శెప్పుండ్రి.మిత్తికిత్త మీరే దుకాణం ఇల్లు గట్టుకోండ్రి అంటుండంట."ముందు నుయ్యి ఎనుక గొయ్యి లెక్కనుందవ్వా! తాత పరిత్తితి.
 గందుకే అంటరు శెల్లే! "ఆశకి మించిన దూరం - మిత్తికి మించిన వేగం" లెవ్వని "
గదండీ సంగతి! ఆశకి మించిన దూరం-మిత్తికి మించిన ఏగం  లెవంటే గిదే మరి.ఒకని ఆశ గుడిశె తలం కొట్టేదైదామని.మరొకని ఆశ మిత్తి మీద బాగా ఎనకేద్దామని.
కామెంట్‌లు