సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత-192: ఆశపడి పాశినన్నం తింటే - పాడుబడి పది లంఖనాలు సేశినట్లు
*****
"అయినా అవ్వా! గంత కక్కుర్తినా? పైసకి పది ముల్లేశి ఏంజేత్తది? ఆయిమన్న బట్ట గట్టదాయె.ఆయిమన్న కూడు దినదాయె.ఎందుకా పిశినాశి తనం? ఎంగిలి శేత్త కాకిని కొట్టకుంటె వాయెగని,గా తినే కూడన్న సక్కరంగ తింటేమాయె?"
 "ఏందో మస్తు గరమైతున్నవు? ఎవలమీద శెల్లె? ఎవలా పీసు మొగం?  అయిన గని గా పీసు మొగం ముచ్చెటి నీకూ నాకూ ఎందుకు శెల్లే? నువ్వెందుకు గింతగనం యిదైతున్నవు?"
 "పరాయిదైతే నాకేం బట్టింది ఎట్టన్న సావనీ అనుకునేదాన్ని.గని సొయాం  మా మేనత్త అవ్వా! మా నాయిన  ఎప్పుడు శెవునిల్లు గట్టుకొని శెప్తనే వుంటడు. "శెల్లే! కట్టపడ్డన్నాళ్ళు కట్టపడ్డవు. కడుపు గట్కొని పిల్లగాండ్లని ఓ దారికి దెచ్చినవ్. గిప్పుడు ఎవలి సంసారాలు ఆళ్ళయి. ఒకలికి ఎదురుసూడకుండ బత్కుతున్నరు. ఇంగనన్న కడ్పు నిండ తిను.ఆయిమన్న బట్ట కట్టు.రాన్రానూ వొయిసు మీద బడ్డంక తిన్లేం.బట్టల మీద సుత అంత గ్యావుండదు శెల్లె అని" అబ్బే ఇంటె మా మేనత్తెట్లయిది."
 అవునవును శెల్లే! "పుట్టిన్నాటి బుద్ధి పుడ్కలతో గాని బోదంట" గట్లనే ఉంది మీ మేనత్త ముచ్చెటి. ఇంతకీ ఏం జేసింది శెల్లే?"
 "గీ నడ్మల పతింట్లె సలువ డబ్బలు గదే అవ్వా! పిజ్జులు వొచ్చినయి గద గండ్ల ఒక్కసారి వొండుకొని దినాలకొద్ది దాసుకొని తినుడు మొదలైంది గద. గట్ల మా అత్త  వొండుకున్న అన్నం సుత తిన్నంత తిని గందుల దాసుడు మొదల్వెట్టింది. ఆకాడికి నేన్జెప్పిన అత్తా కూరలంటే ఏమోగని అన్నం గందుల బెట్టొద్దని."
 "కూరలు సుత ఒకటి రొండు దినాలకంటే ఎక్వ గందుల పెట్టగూడదట శెల్లె. మల్ల కొందరైతే గందులోంచి తియ్యంగనే పొయ్యి మీద బెట్టి ఏడి శేత్తరు.గట్ల సల్లదనం ఈడక మునుపే ఏడి శేత్తె సుత గవి యిషమైతయని శెప్పంగ యిన్న"
"అవునవ్వా! గా అన్నం ఎప్పుడు మిలిగిందో ఎప్పుడు దాశిందో ..గది మెత్తబడిందంట. ఖరాబైందని పారెయ్యొచ్చు గద.మల్ల దాన్ని ఏడి జేసుకొని తిన్నదట. గది కాత్త యిషమై దవాఖానాలో శెరీక జేసే దన్క వొచ్చింది. పక్కనే గద అత్తోల్ల ఊరు. తెల్వంగనే ఎకాఎకి ఎల్లిన. ఒకటే డోకులు యిరేశ్నాలట. సయిమానికి సుట్టుపక్కనోళ్ళు సూడబట్టి సరిపోయింది. లేకుంటెనా... అటు మా నాయినోళ్ళు అత్తోళ్ళ పిల్లలు అందరొచ్చిండ్రు.రెండు దినాలు దవాఖాన్ల ఉంచి వైజ్జం జేసిండ్రు. యాబై ఏలు వొదిల్నయట అవ్వా!"
 "అయితే శెల్లే " ఆశపడి పాశినన్నం తింటే పాడుబడి పది లంఖనాలు సేశినట్లు అయ్యందన్న మాట." 
 " అవునవ్వా! పది లంఖనాలేంది వొంద లంఖనాలు సేశినట్లయ్యింది. ఏనుగంత మనిషి పీనిగె లెక్క అయ్యింది."
"మొత్తానికి బలే శాత్రం జెప్పినవవ్వా! నీతానకొత్తే  కొత్తిషయాలతో పాటు కొత్త కొత్త శాత్రాలు సుత తెలుత్తయి. మా అత్తని తలొక్క మాటన్నోల్లే గని అననోళ్ళు లేరవ్వా? ఇంగనన్న మంచి కూడు తినకపోతే గిట్ల పానం మీదికొచ్చుడే గాదు. పైసలు పైసలు కర్సయితయి.సచ్చూరుకుంటవని" బాగనే దొబ్బులు బెట్టిండ్రు. ఇంగనన్న మా అత్త బుద్ధి మారుతుందో లేదో సూడాలె మరి" అంటుంటే...
 "గింత పెద్ద గండం నుంచి బయట పడింది గద శెల్లే! ఇంగనుంచి మార్తది తీ" అంది అవ్వ.
 గదండీ సంగతి " ఆశపడి పాశినన్నం తింటే పాడుబడి పది లంఖనాలు సేశినట్లు" అంటే గిదే మరి "

కామెంట్‌లు