మునికన్య వేదవతి శాప ఫలమే సీతామాత జననం, రావణాసురుని సంహారం...
మహర్షి కుశధ్వజుడు, మాలావతి పుణ్యదంపతుల అభిలాషా ఫలితమే మానవ రూపంలో మహాలక్ష్మీ అవతారంగా సీతావతరణ...
మిథులాపురి మహారాజు జనక మహారాజు, సునయన దంపతులకు యజ్ఞభూమిలో లభించిన సీత -
స్వయంవరంలో శ్రీరామునితో కళ్యాణం...
మహా విష్ణువు, లక్ష్మీ దేవి భారతావని పుణ్యభూమిలో సీతారాములుగా మానవ రూపంలో అవతరించడం వెనుక ఓ పౌరాణిక గాధ ప్రచారంలో ఉంది. బృహస్పతి కుమారుడు కుశధ్వజుడు, మాలావతి పుణ్య దంపతులకు పుట్టిన బాలిక, జన్మించిన వెనువెంటనే వేదోఛ్ఛరణ గావించడంతో ఆమెకు వేదవతిగా నామకరణం చేసారు. బాల్యంలోనే అసాధారణ భక్తి శ్రద్ధలతో, సర్వ శాస్త్ర పారంగతురాలైన, త్రిలోక సౌందర్యవతియైన తమ కుమార్తెకు శ్రీ మహావిష్ణువే తగిన వరుడని భావించి, ఈమెను కళ్యాణమాడుటకు వచ్చిన రాజులు, రాక్షసులు, పండితులను తిరస్కరించారు.
వేదవతిని మోహించిన దుంభుడనే దానవుడు ఓరోజు రాత్రి నిద్రిస్తున్న కుశధ్వజున్ని సంహరించడంతో భార్య మాలావతి అతని చితిలో పడి మరణించింది.
తల్లిదండ్రులను కోల్పోయిన వేదవతి హిమాలయాలకు పోయి విష్ణుమూర్తికై ఘోర తపమాచరించింది. ఆ మార్గంలో విహారానికి వెళ్లిన లంకాధీశుడు రావణాసురుడు ఈమెను చూసి, మోహించి తన కోర్కెను తెలిపాడు. వేదవతి తిరస్కరించడంతో ఆమె తల వెంట్రుకలను పట్టి లాగడంతో , ఆమె చేతులనే కత్తులుగా మలచి జుత్తు కత్తిరించి, మరుజన్మలో తాను పవిత్ర, అయోనిజగా జన్మించి రావణుని చావుకు కారణమౌతానని శపించింది. ఏ స్త్రీకైనా తన అభిష్టానికి వ్యతిరేకంగా తాకితే తల వేయి ముక్కలవుతాయని రావణుని శపించిన వేదవతి అగ్నిలో భస్మమై తనువు చాలించింది.
వర్షాలు కురవక బాధ పడుతున్న ప్రజల ఇబ్బందులు తీర్చడానికి మిధులా నగర రాజు జనక మహారాజు, సునయన దంపతులు ఇంద్రుని కరుణ కోసం యజ్ఞాన్ని నిర్వహించి, ఆ యజ్ఞభూమిలో దున్నుతుండగా ఓ బంగారు పెట్టెలో ముగ్ద మనోహర సుందర బాలిక సాక్షాత్కరించడంతో ఆమెను తమ పుత్రికగా స్వీకరించి, సీతగా (దున్నుటను సంస్కృతంలో సీత అంటారు ) నామకరణం చేసి, పెంచి పెద్ద చేసారు. ప్రస్తుతం ఈ ప్రాంతం నేపాల్ దేశంలో ఉంది.
రావణుని సంహారానికి గాను, విష్ణుమూర్తిని భర్తగానెంచిన వేదవతి కోర్కె ప్రకారం మహాలక్ష్మి సీతాదేవి రూపంలో, విష్ణుమూర్తి శ్రీరామునిగా మానవులుగా
ఆవతారమెత్తారనేది పురాణ గాధ.
రాక్షస సంహారానికై రామ, లక్ష్మణులను అరణ్యాలకు తెచ్చిన విశ్వామిత్రుడు వారిని మిధులా నగరానికి తేవడం, సీతా స్వయంవరంలో శివ ధనుస్సునెక్కుపెట్టిన శ్రీరాముడు సీతను పరిణయమాడటం, అనంతరం వనవాసం, సీతాపహరణం, రామ రావణ యుద్దం, రావణ వధ వరుసగా కాలక్రమంలో జరిగాయి. ఈ విధంగా వేదవతి సీతాదేవిగా జన్మించి రావణాసురుని మరణానికి కారణమైంది.
==============================================
చౌధరి రాధాకృష్ణ,
ఆధ్యాత్మిక విశ్లేషకులు,
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత,
శ్రీకాకుళం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి