ఎనిమిది పాదాలపై నడిచే ధర్మం..? : - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి
సత్యం... 
సూర్యకిరణమై చీకట్లను చీల్చి
మనిషి మార్గాన్ని వెలిగించే దివ్య దీపం... 

నిజాయితీ... 
నీలాకాశమై హృదయాన్ని 
విశాలం చేసి అసత్యపు 
మేఘాలను తొలగించే ఆత్మశక్తి...

శాంతి... 
చల్లని చంద్రికై మనసును 
మృదువుగా తా కిఅశాంతి 
అగ్నిని ఆర్పే అమృతధార...

ఉపకారం... 
ఉయ్యాలలా ఊగుతూ
మనసుల మధ్య ప్రేమసేతువై 
నిలిచే పవిత్ర స్పర్శ...

ప్రేమ... 
పరిమళించే పుష్పంలా 
వికసించి ప్రపంచాన్ని ఒకే 
కుటుంబంగా కట్టిపడేసే మంత్రశక్తి...

కృతజ్ఞత... 
కురిసే వానగా హృదయాన్ని 
తడిపి అహంకారపు దుమ్ము ధూళిని 
కల్మషాలను కడిగేసే పవిత్ర ప్రవాహం...

నీతి... 
నడిచే నదిలా 
ఎడతెగని ప్రవాహమై
మనిషి జీవితాన్ని ధర్మపథంలో 
నడిపించే దారిదీపం మార్గదర్శి

న్యాయం... 
నిలువెత్తు కొండలా 
నిలబడి అన్యాయాన్ని 
అధిగమించే ధైర్యానికి ప్రతిరూపం...

ఆపై ధర్మం నాలుగు కాదు 
ఎనిమిది పాదాలపై నడుస్తుంది
కాదు కాదు శివతాండవం చేస్తుంది

నేటి నుంచి ఈ మానవాళికి... 
ప్రేమ పాదం… ఒక మంత్రశక్తి…
సత్యపాదం… ఒక దివ్య దీపం…
నిజాయితీపాదం… ఒక ఆత్మశక్తి…

శాంతి పాదం… ఒక అమృతధార…
ఉపకారపాదం… ఒక పవిత్ర స్పర్శ…
న్యాయపాదం… నడిపించే ఒక నావ…
కృతజ్ఞతాపాదం… ఒక పవిత్ర ప్రవాహం…

నీతి పాదం…ఒక రక్షణ కవచం…
ఒక వజ్రాయుధం…ఒక పరమ ఔషధం…!


కామెంట్‌లు