సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -200: ఆదర్శాలు శిఖరమెక్కి కూసుంటే-అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి"
****
"నేను మొదటి కానించి శెవినిల్లు గట్టుకొని శెప్తెనే ఉన్నవ్వా!యాడ... గాని శెవున పేనుబారినట్టన్న ఉంటెనా? ఏందో అవ్వా కొందరంతే శెప్తే ఇనుకోరు వాళ్ళ వొంట్లె బుట్టదు. సూత్తుంటెనో నోర్మూసుకుని కూసోబుద్ది గాదు. జినుక పిల్లొతికె ఉషార్గ తిర్గేటోడు మన్నుగున్న లెక్కుంటే సూశేటోళ్ళకి ఎట్లుంటది నువ్వే శెప్పవ్వా!"
 "అవును శెల్లే! గట్లుంటే సూశేటోళ్ళకి,అందునా అయినోళ్ళకి మన్సు పరేషాన్ గనే ఉంటది. ఇంతకీ ఎవలి ముచ్చెటి శెల్లే? మన యిజ్జిబాబు ముచ్చెటేనా? గాని పని ఎంతొరకు వొచ్చింది.గా ముచ్చెటి కాయా? పండా? శెల్లే!"
 "అవునవ్వా! యిజ్జిబాబు ముచ్చెటినే. గాడు శేత్తున్న ఉజ్జోగంల నిప్పస్మంటోడనీ పేరుంది.గాడు సంపాయిచ్చ తల్సుకుంటే పుల్లు పైసలు సంపాయిచ్చొచ్చు గని అన్నేలపు సొమ్ము నాకెందుకని నీతిగ బత్కుతున్నడు.
గస్మంటోడికి గాని బిడ్డ లగ్గానికి పైసలు అవుసరమైనయి. గదేదో లోను బెట్టుకుండంట గని గీడు పంపుకున్న అర్జీ ఇంతవర్కి ముందుకు కదల్లేదట. ఏం జెయ్యాల్నో తెల్వక తల్కాయ పట్టుకుండు."
 గానికి మేవిద్దరం కూసబెట్టి శెప్పినం'ఎవల్నన్న తెల్శినోన్ని పట్కపోదామని,కావలిత్తె పదో పరకో ముట్టజెబుదాం అని" గట్లయితేనే గదేదో కదులుద్ది. పైసలు తొరగ వొత్తయి "అన్నం.గా మాటలకు ఇల్లెత్తున ఎగిరిండు. "మీరు,బల్లె సార్లు శిన్నప్పటి సంది ఎట్లుండమని శెప్పిండ్రు.గస్మంటి మీరే నన్ను శెడగొట్టాలని సూత్తరా? అంటడు.మా  పరిత్తితి 'కుడ్తిలబడ్డ ఎలకలెక్క ఉందవ్వా'.
అయ్యో! గట్లనా శెల్లె! యిజ్జిబాబుని మొదటిసంది సూత్తున్నగా శెల్లే! పద్ధతి గల్లోడు. శిన్నప్పటి సంది  మీ వోన్ని సూపిచ్చి గట్లుండాలని నల్గురికి శెప్పెటోళ్ళం. గస్మంటోళ్ళకి గిప్పుడు రోజుల్లేవు శెల్లే" "ఆదర్శాలు శిఖరమెక్కి కూసుంటే-అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి." అన్నట్లుంది
గందుకే కొంతమందిరి ఆదర్శాలు కూడువెడ్తయా? కుమ్ము వెడ్తయా? లోకమెట్ల బోతే మనవట్ల బోవుడే అంటరు. గదేమో గాని అత్తెవుసరమాయె. వొసుదేవుడంతోడు గాడ్ది కాళ్ళు పట్టుకున్నట్లు. అవసరం కోసరం పెద్దోళ్ళతో శెప్పిచ్చుడో,బల్లకింద బెట్టిన శేతుల్ని తడ్పుడో శెయ్యాలె మరి తప్పదు. "అవసరం అగాధంలోకి ఈడ్వాలని సూత్తుంటే గాడు మాత్తరం ఏం జేత్తడు."
 ఆన్ని పిలిపిత్త గని గట్ల యిడమర్శి శెప్పవ్వా! తొరతొరగ పనులు కావాలంటే తప్పదవ్వా! గింతెందుకు మొన్నీనడ్మల మాకు బాగ తెల్సిన సుట్టపామె మనోని లెక్కనే గట్ల డబ్బుల కోస్రం ఎలితే గందుల పన్జేసేటాయనే నా డబ్బులు నేను తీస్కోటాన్కి నేను సుత శేతులు తడ్పాల్సి వొచ్చిందని అన్నాడంట .గా యిష్యం శెప్తుంటే తెల్లమొగమేశినవ్వా!"
అవును శెల్లే! గీ పెపంచకం శానా మట్టుకు గట్లనే ఉంది శెల్లే! నీతి,నిజాతి అని మడిగట్టుకు కూసుంటే అయ్యే దినాలు కావివి. మన యిష్యంలో ఆదర్శం తప్పకున్నా ,గిస్మంటి తప్పని అవసరాలు యిస్మసంది బెట్టి అగాధంలకి ఈడుత్తనే ఉంటయి. గాన్ని నా తానకి పంపు యిడమర్శి శెప్త. అత్తెవుసరమంటే గట్ల జేద్దాం.తొందరేం లేదంటే గట్ల యియ్యకుండ కొర్రీలు బెట్టేటోల్ల సంగతేందో సూడ్డమే.. 
గదండీ సంగతి"ఆదర్శాలు శిఖరమెక్కి కూసుంటే-అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి" అంటే గిదే మరి"

కామెంట్‌లు