అంటరానితనం...: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్
రాక్షస మూకలైన 
రోమా సైనికుల చెరలో 
చిక్కి కల్వరి గిరిపై ఏసు క్రీస్తు 
ఆనాడు అనుభవించె సిలువ శిక్ష...
అంతకన్నా ఘోరం ఈ కులవివక్ష...!

అంటరానితనంతో అడుగడుగునా 
అవమానాల అగాధాల్లో మునిగి 
అసమానతల అగ్నిజ్వాలల్లో కాలుతూ..!

సముద్రంత బాధను గుండెల్లో మోస్తూ...
పిడుగులవంటి కష్టాలను తట్టుకొని...
ఒకవైపు మాటిమాటికి చాటుమాటుగా 
కులసర్పం కాటు వేస్తున్నా...!

మరోవైపు కసితో...కక్షలతో
కాలసర్పాల్లా విషం చిమ్మే అగ్రకుల 
రాజకీయనాయకుల కుట్రలతో 
కుతంత్రాలతో కుయుక్తులతో...
అమృతం పంచే పోరాటంలో
స్వజాతి వంచనలకు గురైనా...!

సమస్యల సుడిగుండాల్లో చిక్కి 
దుఃఖాన్ని దిగమింగుతూ...
దిక్కుతోచని స్థితిలో 
ఉక్కిరిబిక్కిరౌతూ...! 

ఒక్కడే ఒక సైన్యంలా
ఒంటరిగా పోరాడి పోరాడి...
ఓటమిని ఒడిసిపట్టినవాడు...
గెలుపు గుర్రాలను 
అధిరోహించినవాడు...!

అస్పృశ్యతనే శాపంతో
గుడికి... బడికి...నీటి చుక్కకు 
తన జాతినిదూరం చేసినా...
ఆస్తి...ఆయుధం... 
అన్నిటినుంచి వెలివేసినా...!

కులరక్కసి ఉక్కు పిడికిలిలో
చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యే 
తన దళిత జాతిని
రక్షించాలనే సంకల్పంతో
విహంగంలా విదేశాలకు ఎగిరి...!

విజ్ఞానాన్ని సేకరించి...
రాజ్యాంగాన్ని రచించి...
పోయిన బహుజనుల హక్కుల్ని 
తిరిగి సాధించిన మహామేధావి...!

తన జ్ఞాన ఖడ్గంతో
ముళ్ళ కంచెలను చెరిపి...
అదృశ్యపు సంకెళ్ళను తెంచి...
చివరిశ్వాస వరకు అన్యాయంపై 
ఆరని అగ్నిజ్వాలై...విరుచుకుపడి...!
 
అణగారిన వ్యక్తిలోని
అనంతశక్తిని వెలికితీసి...
నల్లత్రాచులా బుసలుకొట్టే ధైర్యంతో
గాలికొట్టిన బంతిలా మళ్లీ పైకెగసిన
అంబేద్కర్ ఆత్మవిశ్వాసం...అనంతం..!

అట్టడుగున నెట్టినా...
పాతాళంలో పడదోచినా...
నిప్పురవ్వలా...తారాజువ్వలా...
రామబాణంలా...దూసుకొచ్చిన
విప్లవ కెరటం...అగ్ని శిఖరం...
అమరజీవి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్..!

ఎన్ని అక్రమాలు...
ఎన్ని అన్యాయాలు...
ఎన్ని అవమానాలు...
ఎన్ని అవహేళనలు...
ఎన్ని అడ్డంకులు...
ఎన్ని అవరోధాలు... అన్నీ 
చిత్రహింసల తుపాన్లైచుట్టుముట్టినా..!

బండరాళ్లతో కొట్టినా...
మళ్లీ మళ్లీ పైకెగసిన ఫీనిక్స్ పక్షి...
ముళ్ళబాటలను పూలతోటలుగా...
విసిరిన రాళ్లను విజయానికి మెట్లుగా
మార్చుకున్న మహా‌ విప్లవ వీరుడు...!

పోరాట యోధుడు... 
ధీరుడు...మగధీరుడు...
ఘనుడు...త్యాగధనుడు
జ్ఞాన సూర్యుడు...ప్రజ్ఞా శిఖరం... 
అణగారిన వర్గాల...ఆశాకిరణం... 
అమరజీవి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్..!

జయహో...జయహో...ఓ అంబేద్కర్ 
మహాత్మా...జయహో జై భీమ్...జై భీమ్.

(అంబేద్కర్ జయంతి సందర్భంగా
(అంబేద్కర్‌కిదే నా అక్షర హారతి...)


కామెంట్‌లు