సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 భీష్మ పర్వము ప్రథమాశ్వాసము: 235 వ రోజు
కృష్ణుడు అర్జునినికి ఆత్మజ్ఞానం భోధించుట
శ్రీకృష్ణుడు " అర్జునా ! శోకించ తగని వారి కొరకు శోకిస్తున్నావు. కాని పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులు జీవించి ఉన్న వారిని గురించి కాని మరణించిన వారి గురించి చింతించరు. అవివేకంతో నీవు పడుతున్న వేదన వివేకంతో ఆలోచించిన పటాపంచలు కాగలదు. పరమ జ్ఞానవంతమైన వాక్యములు చెప్తాను విను జీవుడు ఈ లోకమున బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఎలాగో మరణానంతరం చిరిగిన వస్త్రం విడిచి కొత్త వస్త్రాన్ని ధరించిన విధంగా జీర్ణ శరీరాన్ని వదిలి వేరొక నూతన శరీరాన్ని ధరిస్తాడు. పుట్టుక మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. ఆత్మను ఖడ్గం ఖండించ లేదు, అగ్ని దహించ లేదు, జలం తడప లేదు, వాయువు ఆర్పివేయనూ లేదు ఆత్మ శాశ్వితుడు, పురాతనుడు మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. ఆత్మ నిర్గుణుడు ఎవరినీ బాధించడు తాను బాధపడడు. సుఖ దుఃఖములకు కారణం అహంకారం కనుక పార్ధా ! నీవు అహంకారమును వదిలి యుద్ధం చేయుము. స్వధర్మం ఆచరణ యోగ్యం పర ధర్మం పాపం. చక్కగా అనుష్టించ బడిన పరధర్మం కంటే లోప భూయిష్టమైన స్వధర్మం మంచిది. అర్జునా ! క్షత్రియులకు యుద్ధం పరమ ధర్మం తెరిచి ఉంచిన స్వర్గదామం. సందేహం వదిలి యుద్ధం చేయ సన్నద్ధిడివి కా . అర్జునా ! మనుష్యుడు కర్మానిని మాత్రమే ఆచరించ వలెను ఫలితాన్ని దైవానికి వదిలి వేయాలి. దీనిని కర్మ సన్యాసం అంటారు. ఇలా కృష్ణుడు అర్జునినికి తత్వజ్ఞానం అందించి అతని సందేహాలను తీర్చాడు.
విశ్వరూప సందర్శనం
అర్జునుడు తేలిక పడిన మనసుతో " కృష్ణా ! గుహ్యమైన ఈ శాస్త్రజ్ఞానమును నాకు దయతో ఉపదేశించి నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసావు. నా లోని భ్రమలు తొలిగించావు. యోగుల హృదయములకు మాత్రం చూడ సాధ్యమైన నీ అతులిత అయిశ్వరై విభూతులతో కూడిన నీ రూపమును చూడవలెనన్న నా కోరికను మన్నించు కృష్ణా ! " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! నానావిధ శోభితము అనేక ఆకృతులు కలిగిన నా స్వరూపం నీవు ఈ మాంస నేత్రములతో దర్శించ జాలవు కనుక నీకు నేను దివ్య దృష్టిని ప్రసాదించగలను నా దివ్య రూపమును వీక్షించు " అని అర్జునినికి తన విశ్వరూపమును చూపించాడు. వేయు సూర్యుల సమాన కాంతితో వెలిగి పోతున్న ఆ విశ్వరూపుని రూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యం ఆనందం ముప్పిరి గొనగా అనేక దండ ప్రమాణాలు ఆచరించి " దేవా ! బ్రహ్మ దేవుడు, దేవతలు, రాక్షసులు , కిన్నెర, కింపురుషాది సమస్త చరాచర జగత్తు నీ అందు నేను చూస్తున్నాను. అనేక ముఖములు, బాహువులు, కరములు, కన్నులు కనపడుచున్నవి. అనేక కిరీటములు, ఆయుధములు, భూషణములు కనపడుచున్నవి. ఆది, మధ్య, అంతం ఏదో తెలియక ఉన్నది. అప్రమేయమైన నీ రూపం దేదీప్యమై వెలుగుచున్నది. భూమి ఆకాశం నీవే అయి ఉన్నావు. సూర్య, చంద్రులు నీ కన్నులుగా పెద్ద కోరలు కలిగిన నీ ముఖం ప్రజ్వలించుచున్నాయి. నీలో రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు లాంటి సకల జగత్తు ప్రవేశిస్తూ ఉన్నది. గుంపులు గుంపులుగా మహామునులు నిన్ను స్తుతిస్తున్నారు. సిద్ధ, సాధ్య, గంధర్వులు నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. దృతరాష్ట్ర సంతతి, భీష్ముడు, ఈ సమస్త రాజలోకము ససైన్య సమేతంగా అగ్ని జ్వాలలు ప్రజ్వలిస్తున్న నీ ముఖం లో ప్రవేసిస్తున్నారు. దుర్నిరీక్షమై ఉగ్రమై ఉన్న నీ విశ్వరూపం చూడ భీతి కలుగుతున్నది. నా ధైర్యం సడలి పోతున్నది అవయవములు పటుత్వం కోల్పోతున్నవి . ఓ మహానుభావా ! నాయందు కరుణ చూపి నీ వెవరో తెలిపి భయంకరమైన నీ విశ్వరూపమును ఉపసంహరింఛుము. " అర్జునా ! నేనే పరమేశ్వరుడను, కాలుడను, ఇక్కడున్న ఈ జనములను నాశనం చేయుటకు ఉపయుక్తుడనై ఉన్నాను. ఇప్పటికే భీష్మ, ద్రోణాది వీరులను సంహరించాను. నాచే సంహరించబడిన వీరిని నీవు చంపుట కేవలం నిమిత్త మాత్రమే. కనుక అర్జునా లెమ్ము యుద్ధము చేసి రాజ్యాన్ని కైవశం చేసుకొనుము " అన్నాడు. 
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు