నా కవనజీవితంలో…;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
నాకు ప్రేమ కావాలి —
అంతరంగాన్ని అలరించటమే కాదు
అనురాగాలు ఆప్యాయతలు అందించే
ఆత్మబంధువుల అమృతబంధం కావాలి।

నాకు ఖుషీ కావాలి —
గాలిలో చిందే చిరునవ్వులే కాదు
గుండెల్లో నర్తించే సంతోషంలా
కాలాన్ని పండుగగా మార్చే మాధుర్యం కావాలి।

నాకు కూడు కావాలి —
కడుపుని నింపే అన్నం మాత్రమే కాదు
అమ్మ చేతి వంటలోని ఆప్యాయత
తండ్రి చెమటలోని పరిమళ ముద్దలు కావాలి।

నాకు గూడు కావాలి —
గోడల మధ్య కట్టిన ఇల్లు కాదు
మనసులు ముడిపడిన ఆశ్రయం
భయాన్ని తుడిచే స్నేహపు నీడ కావాలి।

నాకు అందం కావాలి — 
కన్నులకే కనిపించే రూపం కాదు
మనుషుల్లో మెరుస్తున్న మంచితనం పూయాలి 
స్వార్థం కరగాలి సౌందర్యం వికసించాలి।

నాకు కవిత్వం కావాలి — 
అక్షరాల ఆట కాదు ఆత్మలో పుట్టే స్పందన 
అనుభూతుల గర్భంలో వికసించే భావం
కాలాన్ని దాటే సత్యాల స్వరం కావాలి
నిశ్శబ్దానికీ నాదం ఇచ్చే నిత్యజ్యోతి కావాలి.

ఇవన్నీ కలిసినపుడే — 
జీవితం పరిపూర్ణమవుతుంది…ప్రేమలో పుష్పిస్తుంది…
ఖుషీలో నవ్వుతుంది…కూడు-గూడు మధ్య నిలబడుతుంది…
అందంలో మెరిసిపోతుంది…
కవిత్వంగా కాలానికీ చిరునవ్వై నిలిచిపోతుంది…

.

కామెంట్‌లు