నాదే ఈ ప్రపంచమని
నా భావం ఎగిరి పడుతుంటే
నిజం నేలపై నిశ్శబ్దంగా నవ్వుతుంది.
ఈ గాలి నాదే అంటావు
ఊపిరి ఆగితే.....అది ఎవరితో ఉంటుంది?
ఈ నేల నాదే అంటావు
పాదం జారితే..... అది నిన్ను అడుగుతుందా?
ఊరు మనదిరా… వాడ మనదిరా…
అంటూ గొంతు పెంచితే
గోడలు కూడా గుసగుసలాడుతాయి
“కాగితంపై పేరు ఎక్కడ?” అని.
గజం నేల కోసం
గుండె గీతలు గీసిన కాలం ఇది;
ధైర్యం కత్తిలా పదును పెట్టి
పైసా బాణంలా దూసుకెళ్లే
లోకం ఇది.
ఇది నా దేశం అంటావు
దేశం నీ పేరుతో రిజిస్టర్ అయిందా?
ఇది నా రాజ్యం అంటావు—
రాజ్యం నీ ముద్రను మోస్తుందా?
బతికితే గోడలు కట్టుకో,
సస్తే రాళ్లు పేర్చుకో—
మధ్యలో ఉన్న శ్వాసంతా
బ్యాంకు లోన్లకే బానిస.
అయినా…
ఒక చినుకులాంటి నిజం ఉంది...
మనసు పంచుకుంటే
ఆకాశం కూడా మనదే అవుతుంది.
కానీ.....
కాగితాల లోకం లో
ముద్ర పడకపోతే
మనదనుకునే హక్కు
గాలిలో కలిసిపోతుంది.
-----------------------------
( గుండవరం ప్రభాకర్ రావు పంతులు )
ఫోన్ నం. 9949267638
గ్రామం :అత్వెల్లి, మేడ్చల్ జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి