సామెత -201ఆర్చేవాళ్ళే గని తీర్చే వాళ్ళు లేరు
***
"అవ్వా!మన రంగాయమ్మొదిన కొచ్చిన కట్టం నర మానవులకెవ్వలికీ రావొద్దవ్వా! పుట్టెడు దుఃఖంల ఉంది."
"అవును శెల్లే! గా వొదిన్ని మతికి తెచ్చుకోంగనే మన్సంత కలికలి అయితది. పగోడికి సుత గస్మంటి కట్టం రావొద్దు. ఎన్ని డబ్బులు బెట్టిండ్రు శెల్లె ఒకటా రొండా లచ్చలు లచ్చలు బెట్టిండ్రు."
అవునవ్వా! గింతకి గా అన్నకి ఏం సుస్తో నాకు తెల్వదు గని నూటిక్కోటికొక్కలికి వొత్తదని యిన్నవ్వా!"
గదేంటో శెల్లే గా అన్నకి కార్జం శెడిపోయిందంట.అయినోళ్ళలో రకతం కల్సినోళ్ళు వాళ్ళకున్న కార్జంల ముక్కని తీసి ఇత్తే గా కార్జం అన్నకి పెడ్తమన్నరంట.గట్ల గా అన్న కొడుకే"మా నాయినకి నేనే యిచ్చి బత్కిచ్చుకుంట" అని ముందు కొచ్చిండు శెల్లే. గానికి సుత పెద్దాప్రిషను చేసిండ్రు.."
అవునటవ్వా! గది మంచిగ పన్జేత్తదన్కుంటే గది సుత పన్జేయలేదట. పాపం అన్న సచ్చిపోయిండు.
"అవును శెల్లె! ఓ ఎయిపున కొడుకునింక దవాఖాన్ల నుండి ఇంటికి పంపనే లేదు. గింతట్లనే గట్ల అన్న మాయమై పోతడనుకోలె. గిప్పుడు గా వొదినె తితి సుత అస్సలు బాలే.
నలబై యాబై లచ్చలు కర్సయినయట.తల్కాయ తాకట్టు బెట్టి తెచ్చి కట్టిండ్రు. ఏం ఫాయిదా! మడిషి బతకడాయె! కొడుకు సూత్తె దవాఖాన్ల ఉండె.అడ్విల గింత శెల్కుండె.గది "అవుసరానికి అడ్డికి పావుసేరు అమ్మిండ్రు. గా వొచ్చిన పైసలు కర్సులకు పోను శేతిల శిల్లి గవ్వ లేదట శెల్లె.
"అవునట అవ్వా! పతొక్కలొచ్చి 'అయ్యో! గిట్ల జరిగెనేంది?గట్ల జరిగెనేందని ఓదార్శి పోతుండ్రు గని ఎవ్వలేం సాయపడ్త లేరని బాద పడ్తున్నది".
"గదేలే శెల్లే! "ఆర్శేవాళ్ళే గని తీర్శేవాళ్ళు" లేరని బాదవడ్తోంది. సుట్ట పక్కాలందరూ అంతంత మాత్తరపోళ్ళే. గాళ్ళిచ్చేది ఏమిట్లకేమైతది.ఎవలు మాత్తరం ఏమిచ్చినా గంత లోటు ఎట్ల పూడ్తది శెల్లే!"
"కొందర్కి కట్టాలు ఒక్కపాలె ముస్రుకుంటయి. గస్మంటప్పుడు ఎవలన్న ఆర్శేటోళ్ళు,తీర్శేటోళ్ళు ఉంటే గందుల్నించి బయట వడ్తరు గని గస్మంటోళ్ళు ఉండొద్దు మరి.ఎవలికుండే సమస్సలు ఆళ్ళకి ఉండనే ఉంటయి. ముందైతే గుండె దైర్నం శెప్దాం పా శెల్లే!"
"అవును అవ్వా! పా పోదాం."
గదండీ సంగతి" "ఆర్చేవాళ్ళే గని తీర్చే వాళ్ళు లేరు" అంటే గిదే మరి.ఆర్చేవాళ్ళు అంటే ఓదార్చే వాళ్ళు. బాధను తగ్గించే వాళ్ళు..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి