భీష్మ పర్వము ప్రథమాశ్వాసము- 227 వ రోజు
జంబూద్వీప విశేషాలు
జంబూద్వీపంలో ఉన్న జనపదాలు తొమ్మిది భాగాలుగా విభజించబడ్డాయి. వాటిని వర్షములు అంటారు. వాటిలో మొదటిది ఉత్తర సముద్రం శృంగవంతం మధ్య భాగాన్ని ఐరావత వర్షం అంటారు. రెండవది శ్వేతపర్వము శృంగవంతం మధ్య ఉన్న భూభాగం దీనిని హిరణ్మయము అంటారు. మూడవది నీల శైలముకు ఉత్తర మున ఉన్న ప్రదేశము దీనిని రమణక వర్షం అంటారు. నాలుగవది నీల శైలముకు దక్షిణమున ఉన్న ప్రదేశం దానిని నీలాకృత వర్షం అంటారు. ఐదవది మేరు పర్వతానికి తూర్పున ఉన్న ప్రదేశం దీనిని భద్రాశ్వ వర్షం అంటారు. ఆరవది మేరుపర్వతానికి పశ్చిమమున ఉన్న ప్రదేశం. దీనిని కేతు మాలా వర్షం అంటారు. ఏడవది మేరు పర్వతానికి ఉత్తరమున ఉన్న ప్రదేశం దీనిని హరి వర్షం అంటారు. హిమవత్పర్వతానికి అటు ఉన్న ప్రదేశం వీటిని కింపురుష వర్షం ఇటు వైపు ఉన్న ప్రదేశం దీనిని భారత వర్షం అంటారు. ఈ జంబూ ద్వీపము విస్తీర్ణం 80,600 యోజనములు. దీనికి రెండింతల విస్త్రీర్ణం కలిగి లవణ, ఇక్షురస, ఘృత, దధి, క్షీర, శుద్ధ జల సముద్రములు క్రమముగా ఒకదాని కంటే ఒకటి రెండింతల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఇందు లక్షద్వీపము, శాల్మల ద్వీపము, కౌంచద్వీపము, కుశద్వీపము, శాకద్వీపము, పుష్కరద్వీపము అను ఆరు ద్వీపములు ఉన్నాయి. ఈ ద్వీపములో అనేక పర్వతములు, నదులు, జనపదములు ఉన్నాయి.
దృతరాష్ట్ర సంజయుల వాదం
ఈ జంబూద్వీపానికి కర్త భర్త అయిన శ్రీమన్నారాయణుడు పాలసముద్రానికి ఆవల కనక మయమైన ఎనిమిది చక్రములు కలిగిన దివ్య రథం మనోజ్ఞ దివ్య రథము పైన వైకుంఠములో విహరించు చున్నాడు " అన్నాడు సంజయుడు. దృతరాష్ట్రుడు " సంజయా ! ఈ భరత వర్షం పైన దురాశతో పాండవులు కౌరౌవులు యుద్ధం చేస్తున్నారు కదా ! ఇంతకంటే దురాశపరులు ఈ లోకంలో ఉంటారా " అన్నాడు. సంజయుడు " రాజా ! నీవు అనవసరంగా పదే పదే పాండవులను నిందిస్తున్నావు నీ కుమారులే శకుని మాటలు విని వారి రాజ్యభాగాన్ని అన్యాయంగా అపహరించారు. పాండవులకు నీ రాజ్యంపై ఎలాంటి ఆశ లేదు. ఎందరో రాజులు పాండవులను గెలవాలనే తలపుతో సుయోధనుని పక్షాన యుద్ధం చేస్తున్నారు. వారిని నిందించి ప్రయోజనమేమి. పూర్వం యయాతి, భగీరధుడు, రఘువు, నహుషువు లాంటి మహానుభావులు రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు చేసారు. యజ్ఞ యాగాదులు చేసి యశస్సు గడించారు. రత్నగర్భ అయిన ఈ భారత దేశ సంపదల మీద ఆశతోను ఈ ర్ష్యతోను యుద్ధములు చేయుట అనివార్యం.
భరత వర్షంలోని సంపదలు
ఈ భరతవర్షమున మలయము, శక్తిమంతము, వింధ్య, పారియాత్ర, మహేంద్రము, ఋక్షవంతము, సహ్యాద్రి, పారియాత్ర, మహేంద్రం, ఋక్షవంతం, అను పది పర్వతములు ఉన్నాయి. ఈ భూమిలో రత్నములు, మణులు, ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి మొదలైన ఖనిజాలు ఉన్నాయి. ఇందు గంగ, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, శారావతి, కావేరి, గోదావరి, నర్మద, బహుద, సరయు, శతధ్రువు, వితస్త, విపాత, తామ్రపర్ణి అను మహా నదులు ప్రవహించి భరతవర్షాన్ని సశ్యశ్యామలం చేస్తున్నాయి. ఈ భూమి పాండిపంటలకు ధనధాన్యములకు పుట్టినిల్లు. భరతవర్షమున పాంచాల, పాండ్య, బర్బర, వత్స, మత్స్య, మగధ, మలయాళ, కళింగ, కుళింగ, కురు, కొంకణ, టెంకణ, త్రిగర్త, సాముద్ర, సాళ్వ, శూరసేన, సుధేష్ణ, సుహ్మ, కరూశ, కాశ, కోసల, యవన యుగంధర, ఆంధ్ర, సింధు, ధేది, చోళ, పుళింద, పుండ్రక, పాండ్య, అభీర, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రవిడ, దశార్ణ, కర్ణాట, గౌళ, అంగ, వంగ, మరాఠ, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, అశ్మంతక, కాశ్మీర, గాంధార, కాంబోజ, కేరళ, మాళవ, నేపాళ, గూర్జర, కుంతల, అవంతి మొదలైన జనపదములలోని జనులు సమస్త వస్తు సంపదలతొ సుఖజీవనం చేస్తున్నారు. సమస్త జనులకు రాజులకు ఈ భూమి కామధేనువు వంటిది. ఈ భూమి మీద మమకారంతో రాజులు ఒకరిని ఒకరు అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు అని కూడా చూడక చంపు కుంటున్నారు. ఈ భూమి మీద రాజులకు పోగాలం దాపురించి ఈ యుద్ధభూమిన చేరారు. ఏమి జరుగనున్నదో " అని చింతించాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి