దేవుడికి ఒకటే దిగులు. మనుషులు మనసు వెంట పోతున్నారు తప్ప ఉన్న తెలివితేటలను ఇచ్చినా వాటిని పూర్తి స్థాయిలో వినియెగించుకోవడం లేదని బాధపడ్డాడు. వారికి వారి స్థితి తెలియజేయాలనుకున్నాడు. ఆ దిశలో ఏం చేయాలా అని ఆలోచించాడు దేవుడు.
వెంటనే నిద్రపోతున్న ఓ మనిషి కలలోకొచ్చాడు దేవుడు.
"ఓ మనిషీ, నేను నిన్ను నా దూతగా నియమిస్తున్నాను. ఇక మీదట నువ్వే నా గురించి, నా ఆశయాల గురించి ప్రపంచమంతటా తిరిగి అందరికీ తెలియజేయాలి" అన్నాడు దేవుడు.
"అలాగే దేవుడా" అన్నాడు మనిషి.
"అయితే ఒక్కటి. నువ్వు నా దూతగా ఉండాలంటే అంతకన్నా ముందు నువ్వు నీ తెలివితేటలకు సానబెట్టాలి" చెప్పాడు దేవుడు.
అలాగే చేస్తానన్నాడు మనిషి.
నిద్ర లేచిన మనిషి
అద్దం ముందు నిల్చున్నాడు. తనను తాను చూసుకున్నాడు. తన రూపాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాడు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ ప్లాస్టిక్ సర్జరీ చేసే నిపుణుడి వద్దకు వెళ్ళాడు. వంకరగా ఉన్న తన ముక్కుని అతనితో అందంగా తీర్చి దిద్దించుకున్నాడు. అనంతరం పళ్ళ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. వంకర టింకరగా ఉన్న పళ్ళ వరుసను సరి చేయించుకున్నాడు. ఆ తర్వాత ఓ చర్మ వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. అందంగా కనిపించేలా తీర్చి దిద్దమన్నాడు.
తల మీద పల్చగా ఉన్న జుత్తుని ఒత్తుగా ఉండేలా కొత్త జుత్తుని పెట్టించుకున్నాడు.
కొత్త దుస్తులు ధరించాడు. బయలుదేరాడు. వీధిలోకి వెళ్ళి అటూ ఇటూ చూసి అడుగులు వేశాడు. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో వర్షం మొదలయింది. పిడుగు పడి అతను అక్కడికక్కడే మరణించాడు.
దేవుడిని కలిశాడు.
"దేవుడా, నేను కొత్త మనిషిగా మారినప్పుడు అన్యాయంగా నన్ను చంపించేశావు. ఇది సముచితమేనా" అని అడిగాడు మనిషి.
దేవుడు చెప్పాడు ...
"క్షమించాలి. నిన్ను నేను గుర్తు పట్టలేకపోయాను. ఎవరో అనుకున్నాను" అని.
మిత్రులారా, ఇప్పటి పరిస్థితి ఇలాగే ఉంది. బయటి రూపాన్ని మార్చుకోవడం తెలిసిన మనిషి లోపలి రూపాన్ని మార్చుకోవడం తెలీలేదు. దాని ఫలితం...
దేవుడి అవతారంగా చెప్పుకుంటున్న మనుషులు దేవుడికే గుర్తు పట్టని విధంగా మారిపోతున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి