పుస్తక దినోత్సవం: - డా.. కందేపి రాణీప్రసాద్

 హలో చిన్నారులూ! చిల్డ్రన్స్ డే, మడర్స్ డే ఉన్నట్లు గానే పుస్తకాలకు కూడా ఒక దినోత్సవం ఉంటుందని తెలుసా మీకు. ఏప్రిల్ 3వ తేదీని ‘ప్రపంచ పుస్తక దినోత్సవంగా’ జరుపుకుంటారు. చదవటం, పబ్లిష్ చేయటం, కాపీరైటు హక్కుల్ని కాపాడటం అనే విషయాలను ప్రచారం చేసేందుకు యునెస్కో ఇలా పుస్తక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని మొదటి సారిగా ఏప్రిల్ 23 వ తేదీ 1995 న జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాము. యునెస్కో అంటే తెలుసు కదా పిల్లలూ! యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్(UNESCO).
ఇలా పుస్తకానికి ఒక రోజు పెట్టాలన్న ఆలోచన ఒక వాలెన్షియన్ రచయిత అయినటువంటి ‘విసెంటె క్లావెల్ ఆండ్రిస్’ కు వచ్చింది. ప్రముఖ స్పానిష్ రచయిత అయిన ‘మిగ్వెల్ డి సెర్వెంటస్’ యొక్క గౌరవార్థంగా ఈ దినోత్సవాన్ని జరపాలనుకుంటున్నాడు. సెర్వెంట స్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నవలాకారుల్లో ఒకరు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సెర్వెంటస్ నవల ‘డాన్ క్విక్సోట్’ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 140 బాషలలోకి అనువదించబడినది. ప్రపంచంలో బైబిల్ తరువాత ఇన్ని భాషలలోకి అనువదించబడిన పుస్తకం ఇదొక్కటే. ఈయన మరణించిన తేదీ ఏప్రిల్ 23, 1616 వ సంవత్సరం. విచిత్రమైన విషయం ఏమంటే మరో ప్రపంచ ప్రఖ్యాత కవి షేక్ స్పియర్ మరణించిన తేదీ కూడా ఇదే. వీరిద్దరి మరణాలు 1616 వ సంవత్సరం ఏప్రిల్ 23 వ తేదీ అయినప్పటికీ నిజానికి ఇరువురి మరణ తేదీలు వేరువేరు, ఎలాగంటే స్పెయిన్ దేశం ‘గ్రెగేరియన్ క్యాలెండర్’ ను వాడుతుంది.ఇంగ్లండ్ దేశమేమో ‘జూలియన్ కాలెండర్' ను ఉపయోగిస్తుంది. కాబట్టి సెర్వెంటస్ ఏప్రిల్ 23 వ తేదీ మరణిస్తే గ్రెగేరియన్ కాలెండర్ ప్రకారం షేక్ స్పియర్ ఆ తర్వాత పది రోజులకు మరణించారు. ఈ తేదీ పెరూ దేశపు రచయిత మరియు చరిత్ర కారుడు అయిన “ఇన్  కా గార్సిలాసో డీ లావెగా” యొక్క మరణ తేదీ కూడా. వీరే కాకుండా మరింత మంది రచయితల పుట్టుక మరియు మరణ తేదీ కూడా ఏప్రిల్ 23.
పుస్తక దినోత్సవమని పేరు పెట్టుకుని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నప్పటికీ ఎప్పటి నుంచో అనేక దేశాలలో వివిధ రకాలుగా జరుపుకుంటున్నారు. స్పెయిన్, కాటలోనియా దేశాల్లో 1436 నుంచి ఒక రోజున పుస్తకాలు, గులాబీలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు. మనం జనవరి 1 వ తేదీన గ్రీటింగ్ కార్డులు ఇచ్చి పుచ్చుకున్నట్లుగా. స్వీడన్ దేశంలో ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 13వ తేదీకి 2000 వ సంవత్సరంలో మార్చివేసి జరుపుకున్నారు కానీ ఆ మరుసటి సంవత్సరం ఏప్రిల్ 13 న ఈస్టర్ పండుగ రావడంతో మరల మార్చుకున్నారు. కొన్ని దేశాలలో ఏప్రిల్ 23 వ తేదీకి ముందో, వెనకో వచ్చే ఆది వారాల్లో జరుపుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పుస్తకానికీ ఒక రోజంటూ ఉండాలని అందరూ అంగీకరించిన విషయం.
పుస్తకాలు చదవడం, అచ్చు వేయడం, కాపీరైట్ హక్కుల్ని ప్రజల్లో విరివిగా ప్రచారం చేయటం కొరకు పుస్తక దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో నిర్ణయించిందని తెలుసుకున్నాం కదా! మరి పుస్తకాలు చదవాలంటే పుస్తకాల్ని భద్రపరుచుకోవాలి కదా! అందుకనే ప్రతి ఊర్లోనూ గ్రంథాలయాల్ని పెట్టి పుస్తకాలను భద్రపరిచి, ప్రజలందరూ చదవడానికి వీలుగా అందుబాటులో ఉంచుతున్నారు. తాళపత్ర గ్రంథాల నుంచి కాగితం తయారు చేసేదాకా పారిశ్రామికంగా ముందు కెళ్ళాం. కానీ ఈ కాగితాలు తయారు చేయటానికి చెట్లు అవసరం పెరిగిన, జనాభా దృష్ట్యా మన రోజు వారీ అవసరాలకు ఎన్నో కాగితాలు అవసరమవుతున్నాయి. మానవ అవసరాలకు సరిపడినన్ని కాగితాలు తయారు చేయాలంటే వేల, లక్షల చెట్లను నరక వలసి వస్తుంది. జనావాసాల కొరకు నరుకుతున్నా చెట్లకే అడవులు తగ్గిపోతున్నాయి. మరల కాగితాలకు చెట్లను ఉపయోగించటం వలన అడవులు ఇంకా తగ్గిపోయే ప్రమాదముంది. అందుకే ప్రస్తుతం కాగితపు పుస్తకాలను వదిలి ‘ఈ బుక్'ల వైపు ప్రపంచం పరుగులు తీస్తున్నది. అడవులను రక్షించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పూర్తిగా ఈ బుక్ లనే వినియోగించాలని భావిస్తున్నది. తాళపత్ర గ్రంధాల నుండి కాగితపు పుస్తకాలు, మరల వీటినుండి ‘ఈ పుస్తకాలు’ ఇలా రాసే వస్తువులు మారుతునప్పటికీ, విషయ గ్రహణం చేయటం మాత్రం అవసరం. పిల్లలూ పుస్తక దినోత్సవం సందర్భంగా మీరందరూ క్రమం తప్పక పుస్తకాలను చదివే అలవాటు ఏర్పరచుకోవాలి.
కామెంట్‌లు