సింహావలోకనం...!!: -యెనుముల వేణుగోపాలరావు -అమలాపురం.

 మరువగలమా, మరువ తరమా 
చిన్ననాటి చిరు జ్ఞాపకాలు..!
సుబ్బి గాడితో గూటీ బిళ్ళ ,
సుబ్బలక్ష్మి తో తొక్కుడు బిళ్ళ,
సూరి గాడి జట్టుకు చెప్పిన డిల్ల !
వీధి చాప పై కూర్చున్న వైనం,
తాటి చాపకై కొన్ని క్రోసులు పయనం...  "మరువగలమా"!
వీధి చివర చూసిన _
తోలు బొమ్మలాట,
పక్కింటి పిల్లతో ఆడిన_ భువ్వలాట,
కాళ్ళ గజ్జా కంకాలమ్మ...
అమ్మ స్నేహితురాలు_ ఎంకాయమ్మ,!
హోంవర్క్ ఎగ్గొట్టి బడికి డుమ్మా
అరుగు పై ఆడిన అష్టాచెమ్మా
 "మరువగలమా".  !
కొబ్బరాకు తో చేసిన వాచీ,
కాలువ స్నానానికి పెట్టిన గోచీ,
పుల్ల ఐసు కోసం పెట్టిన పేచీ,
నాన్నమ్మ కొట్టెను చెంప పై చాచి,
పక్కవాడికి పెట్టిన కాకి ఎంగిలి ,
వీధి అరుగు పై క్షవరం చేసిన మంగలి "మరువ గలమా"!
కాగితం తో చేసిన పడవ,
వాన నీటిలో జార విడువ,
బాడి  అంటెను కాళ్ళకు నడవ,
ఇంట్లో వాళ్ళు తిట్టెను ఓరి_ భడవఅని !
భోగి పిడకలకై తెచ్చిన పేడ 
కోమటి కొట్లో ఎగ్గొట్టిన బేడ 
 "మరువగలమా".   !
దొంగిలించిన పక్కవాడి పెన్ను,
ఇంటికొచ్చాక నాన్న బాగా తన్ను,
అదిచూసి నవ్వేను పక్కింటిచిన్ను ...!
ఎండుటాకులతో కాల్చిన బీడి ,
వర్షం కురిస్తే వేడి వేడి పకోడీ,
ఎంత వెదికినా దొరకని కోడి ,
 "మరువగలమా" .....!
ఆది వారం వస్తె వేట మాంసం ,
అల్లరి చేస్తే పిక్కమాసం,
అమ్మ చేసిన తీపి పాయసం
నా ఎదురు చూపులు ఫ్రెండ్ కోసం,
పిల్లవాళ్ళతో కోతి,కొమ్మచ్చి,
మాస్టారు వేయించిన గోడ కుర్చీ ,
పారిపోయేవాళ్ళం_ పక్కవాడినిగిచ్చ!
వాడు చెప్పేవాడు మా_ జట్టుకుపచ్చి ..అవన్నీ
 "మరువగలమా"...!
వీధి చెరువులో కొట్టిన ఈత ,
బామ్మ పెట్టిన వీపు పై వాత,
చూసి జాలి పడిన పక్కింటి గీత,
చెరువు జోలికి పోవద్దని, హెచ్చరించిన తాత,
మరువగలమా,మరువతరమా చిన్ననాటి ఈ చిరు జ్ఞాపకాలు!!
కామెంట్‌లు