సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -210:-ఆత్మ లేని చోట ఉండొద్దు - అడివిలో ఏడవొద్దు
****
"అవ్వా! అనుబగిచ్చి శెప్పిన పెద్దోళ్ళ మాటలు ఇనాలా వొద్దా? నువ్వే శెప్పు. ఎన్నెన్ని తాకుడురాళ్ళు తలిగుంటయ్ గా శెప్పేటోళ్ళకి. గా మాత్తరం అర్తం శేస్కోబోతే ఎట్ల?  ఏం గాదు తీ! పోతేమైతది అన్కుంట వాదిచ్చిండు. గిప్పుడు గాని ఆలకం సూత్తుంటే బయమేత్తుందవ్వా.
 "ఏంది శెల్లే ?ఏం జరిగింది? గంత పరేషాన్ అయితున్నవు? మొగం నిండ శెమట్లు బట్టినయి. ఏం గాదుగని జెర నిమ్మళంగ ఉండు."
ఏం నిమ్మళమవ్వా! వొద్దురా అయ్యా! గాళ్ళ సోపతి అని శిలక్కి జెప్పినట్టు జెప్పిన. గాళ్ళేదో కొత్తిల్లు గట్టుకున్నరు.దావతు జేస్కుంటున్నం రమ్మని శెప్పిండ్రంట. గీడు పోకపోతే ఏమన్న అనుకుంటరేమో అని పోయిండు.
పిల్శినప్పుడు పోవాల్నని ఎవలికైన ఉంటదిగా శెల్లే! గందుకే పోయుంటడు.అయినగని గీడు దినే పిడికెడు బువ్వ గాళ్ళకి తక్వయిందా?"
 గాడు ఒక్క తీర్గ గీసులాడ్తుంటే నేను సుత గట్లనే  పోనీలే అన్కున్న.ఎవలన్న తెల్శినోళ్ళు ఉన్నరా అయ్యా అన్న."ఎవలు లేకుంటేందే.గాళ్ళు శెప్పిండ్రు నేను బోతున్న. నీకన్ని అనుమానాలే నీయవ్వ!"అన్కుంట బోయిండు."
"గీ కాలం పిల్లలు గట్లనే శెల్లే! మన మేదన్న శెప్తే గాల్లని తెల్వితక్కువోళ్ళు,ఏందెల్వనోళ్ళని అన్కుంటరని బయ్యం. గందుకే మనమేం జెప్పినా లెక్క జెయ్యరు.ఆటెంక అనుబగిచ్చినంక అయ్యో! గప్పుడే శెప్పిన మాట యినకపోతిమి అన్కుంటరు శెల్లే!"
 "గిప్పుడు నువ్వు జెప్పినట్టే అయ్యిందవ్వా! గాడు ఆడికి పొయ్యిండా! గీడు యాడికి బొయ్యినా ఊకెనే కూసునుడు దెల్వదు.గా దావతుల సచ్చే శాకిరి జేసి శివరాకర్న గాళ్ళు బెట్టింది తిని రాబోతుంటే ఓ నల్గురొచ్చి "ఆగాగు యాడికి బోతవ్! అనే తల్కి యిష్యం తెల్వక బీరువొయ్యిండట. గాళ్ళ సుట్టపోడెవడ్దో బెట్కున్న ఉంగరం యాడ్నో పడ్డదంట.గీని మీన అన్మానమొచ్చి అంగీ లాగు ఎతికిండ్రంట.గీనికి అవమానమన్పిచ్చి మస్తు ఏడుపొచ్చిందంట.గక్కన్నే పానమిడ్వాలన్నంత అన్పిచ్చిందంట.గాడు శెప్తుంటే నాకైతే దుఃఖమాగలేదవ్వా! ఏం దావతో ఏమో మాయదారి దావత్.వొద్దంటే బోయిండు అపనింద మీదేస్కో బోయిండవ్వా! గది గన్క దొరక్కపోతే నా కొడుకు ఆగమాగం అయ్యేటోడవ్వా!"
గందుకే అంటరు శెల్లే ! "ఆత్మ లేని సోట ఉండొద్దు -అడివిలో  ఏడవొద్దు" అని.
అంటేందవ్వా నాకు సమజవ్వలే?"
 ఆత్మ అంటే  గిక్కడ గవురవం,అబిమానం అని అర్తం శెల్లే! గాళ్ళ ముందు ఏడుపు అడివిల ఏడ్శినట్టే. ఎవలు పట్టిచ్చుకుంటరు శెల్లే! గదే గన్క దొరక్కపోతే ఎంత గోరం జర్గేది. ఒక పెద్దాయన ఊకెనే అన్లే"తనోళ్లు లేనికాడికి,జనం లేని సోటుకు ,పంచాతుల కాడ, అనుమానం ఉన్నోళ్ళ కాడ అస్సలు ఉండొద్దు. గట్ల ఏం గాదని ధీమాతో పోతే గిట్లనే అయితది.గిది పతొక్కరికి ఎచ్చరికస్మంటిది శెల్లే!"
అవునవ్వా యతార్తం శెప్పినవ్ "
గదండీ సంగతి"ఆత్మ లేని సోట ఉండొద్దు -అడివిలో ఏడవొద్దు "అంటే గిదే మరి.

కామెంట్‌లు