భూమి తిరిగీ
కొండల్నీ నిర్మిస్తుంది
గుహల్ని నిర్మిస్తుంది
ఎడారుల్ని నిర్మిస్తుంది
అడవుల్ని ఆవిష్కరిస్తుంది
నదుల్ని సృష్టిస్తుంది
సముద్రాల్నీ వదిలేసింది.
మనిషి ఎక్కడ దాక్కున్నాడో
కనిపెట్టడం కష్టంగా ఉంది
చిరునామాలు లేని గ్రామాలు లేవు
దారి తప్పిన రహదారులు లేవు
గుహలోకి వెళ్లాలంటే సింహాలవ్వాలి
గుహల్లోంచి బయటికి రావాలంటే
నరసింహాలవ్వాలి.
గాలి కష్టంగా ఊపిరి పిలుస్తుంది
వెలుగు నలిగిపోతుంది
ఆకలిగొన్న చెట్టు అడవిని గుర్తు చేసుకుంటుంది.
లేళ్ళు కుందేళ్ళు పచ్చని ప్రపంచం కోసం
స్వప్నిస్తున్నాయి.
విరిగిపడ్డ ఆకాశం మేఘాల్ని పిలుస్తుంది.
అంగవైకల్యంతో నది నడవడం మానేసింది
నాలుగు కాళ్ల జంతువులు మౌనంగా ప్రార్థిస్తున్నాయి.
మనిషి కలల్లో తప్పిపోయి నిజంగానే సమాధుల్ని తవ్వుతున్నాడు.
ఎప్పటికైనా చిరునామాతో చరిత్రను లిఖిస్తాడు.
గదుల్లోనే గాలి స్నేహం చేస్తుంది
తన ఉనికి ఎంత ఎత్తులో ఉందో అంచనా వేస్తుంది.
రెక్కలు కట్టుకొని వాలిన నక్షత్రం
సరిగ్గా కొత్తగా మెరుస్తుంది.
రేపటి తరం కోసం ఎలా నటించాలో ఎలా కాళ్లు చేతులు ఆడించాలో నేర్చుకుంటుంది.
తప్పిపోయిన భూమి ఇదంతా గమనిస్తుంది
మనిషి చిరునామా ఎలా కనిపెట్టాలని
లేదా మనిషిని ఎలా పుట్టించాలని ఎదురుచూస్తుంది.
పాత చిరునామా ప్రతిపదార్థానికి ఉంది ఉనికికి ఉంది.
లేనిదల్లా మనిషి ఒక్కడే
మనిషి ఎక్కడున్నాడో చిరునామా కోసం చింతిస్తున్నాడు.
పూణే లత ఇంట్లో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి