సుప్రభాత కవిత : - బృంద
విరిసే పూల తోరణాలు కట్టి 
పచ్చిక తోటి తివాచీలు పరచి 
ఊగే కొమ్మల వింజామరలతో 
సాగే గాలుల గంధాలతో...

తుమ్మెద పాడే రాగాలతో 
రమ్మని పిలిచే స్వాగతాలతో 
కమ్మని క్షణాల  తాయిలాలు 
తెమ్మని తరణికి స్వాగతాలు!

వెండి మబ్బుల వేదికపైన 
వెలుగులు నిండిన నింగిలోన 
తరలి వచ్చే అంశుమాలికి 
ధరణి పట్టే హారతులు

కొండలమధ్య కోనలలోన 
విందుగా తోచే సౌందర్యము 
బండల మధ్యన దూకే నీటి 
సవ్వడి కాదా సంగీతము!

ప్రణతులు  పలుకుతూ 
పదములు కడగాలని 
వినతులు తెలుపుతూ 
ఒదిగి నిలవాలని...

నేలను పాకిన తీగలలో 
వేలుగా విరిసి వేచిన 
గరిక పువ్వుల కోరిక తీర్చగా 
పరుగున వచ్చే ప్రభువుకు

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు