సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 భీష్మ పర్వము ప్రథమాశ్వాసము-228 వ రోజు
యుద్ధ సమాచారములు సంజయుడు దృతరాష్ట్రునికి చెప్పుట
దృతరాష్ట్రుడు " సంజయా ! ఇక నీవు యుద్ధభూమికి వెళ్ళి ఏమి జరుగుతుందో చూసి రా " అని పంపాడు. యుద్ధభూమికి వెళ్ళిన సంజయుడు కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చి దృతరాష్ట్రుని వద్ద ఏడుస్తూ పాదముల పై పడ్డాడు. అయ్యో రాజా ! పరాక్రమ వంతులలో పరాక్రమవంతుడైన భీష్ముడు అంపశయ్యపై పడి ఉన్నాడు. పరశురాముని జయించిన వీరుడు శిఖండి చేత భంగపడ్డాడు. ఏ భీష్ముని అండ చూసుకుని నీకొడుకు జూదంలో పాండవులను గెలిచాడో ఆ భీష్ముడు యుద్ధమనే జూదంలో ఓడి పోయాడు. పది వేల సైన్యం ఎదురు వచ్చినా ఒక్కడుగా ఎదుర్కొనగల వీరుడు పది రోజుల వీరోచిత పోరు సలిపిన పిదప నేలకొరిగాడు " అని విలపించసాగాడు. భీష్ముడు నేలకొరిగిన వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్చిల్లాడు. కొంతసేపటికి తేరుకుని " సంజయా ! దేవాసురులు ఒకటై వచ్చినా చలించని భీష్ముడు నేలకొరిగాడా ! శస్త్రాస్త్ర ప్రకరణములతో విరోధుల మద మణచుచున్న భీష్ముని శిఖండి ఒంటరిగా ఎదిరించడం కంటే ఆశ్చర్యం ఏమి ! ప్రఛండ ఛండమారుతం లాంటి భీష్ముని శిఖండి అనే చిరుగాలి ఎదిరించిందా ! అంబ కొరకు పోరిన పరశురాముని ఎదిరించి నిలిచిన భీష్ముడు పాండవుల కొరకు శిఖండి చేతిలో నేల కొరిగాడా ! అతని సత్వము, శౌర్యము, శీలము, పరాక్రమము, అతని శుద్ధ వ్రతము నాశం లేనివని నమ్మాను కదా ! ఇప్పుడు ఏమి చేయాలి " అని రోదించి తిరిగి " సంజయా ! భీష్ముని పై అస్త్ర వర్షం కురిపిస్తు న్నప్పుడు మన వాళ్ళు అడ్డుకొనలేదా ఇన్ని అక్షౌహినుల సైన్యం ఒక్క భీష్ముని రక్షించలేక పోయిందా ! ద్రోణుడు, అశ్వథామ, కృపుడు, శల్యుడు పారి పోయారా ! లేకున్న భీష్మునికి ఈ విధమైన స్థితి ఏమిటి . కుల వృద్ధుడైన గాంగేయుని వధించి రాజ్యా ధికారాన్ని చేపట్టడానికి ధర్మరాజు సాహసించడం అధర్మం కాదా ! అధర్మానికి ఒడికట్టిన పాండవులకు దైవం తోడైంది కదా ! కౌరవ సేన అనాధ అయింది కదా ! నా కుమారులు ఎంత కలత పడుతున్నారో కదా ! ఈ పది రోజులు యుద్ధం ఎలా సాగింది ? భీష్ముడు పోరు ఎలా సాగించాడు. నాకు సవివరంగా వివరించు " అన్నాడు. సంజయుడు " మహారాజా ! నీ అవినీతి వలనే కదా పాండవులు ఇన్ని కష్టాల పాలు అయింది. ధర్మపరులైన పాండవులకు అపకారం చేసినందుకు ఫలితం అనుభవించక తప్పదు " అని చెప్పి సంజయుడు యుద్ధం గురించి వివరించ సాగాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు