సరిలేరు నీకెవ్వరూ కవిరాజా!: - — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
సరిలేరు నీకెవ్వరూ కవిరాజా! —
స్వరాల సిరుల్లో సత్యం ముంచెత్తే సాగరమువి నీవే,
నిత్యమూ నవరసాల్లో నాట్యమాడించే నర్తకుడివి నీవే,
నిశ్శబ్దానికే నాదం నేర్పించే నాదబ్రహ్మవి నీవే।

ఆలోచనల్లో ఆకాశమై విహరిస్తూ —
అనంతాన్ని అక్షరాల్లో ఆవిష్కరించే వింతవాడివి,
గుండె చప్పుడు గీతమై పలికే ప్రతి క్షణం
కాలానికి కవిత్వం నేర్పే కర్తవి నీవే।

అక్షరాల్లో అమృతం చిందిస్తూ —
అంతరంగాలను ఆనందసాగరంలో ముంచెత్తేది నీవే,
పదాల్లో పానకపాయసాల విందు పెడుతూ —
పాఠకుల్లో పూటపూటా పరవశం పొంగించేది నీవే।

పలుకుల్లో తేనెచుక్కలు జారుస్తూ —
పగలు పసిడి వేళలా మురిపించేది నీవే,
మాటల మాధుర్యం అందిస్తూ —
మనసులను మల్లెల మాలల్లా పరిమళింపజేసేది నీవే।

సాహితీవనంలో పువ్వులు పూయిస్తూ —
సృజన సుగంధం గాలిలో నర్తింపజేస్తూ,
కవితల్లో కాంతులు వెదజల్లుతూ —
చీకటిలో కూడా చిరునవ్వులు చిందించేది నీవే।

భావాల్లో రవికాంచని చోటుకూ చేరుతూ —
భువనానికతీతంగా విరజిమ్మే వెలుగువి నీవే,
పరిసరాల్లో సుమసౌరభాలు ప్రసరిస్తూ —
ప్రపంచాన్నే పదప్రయోగాలతో పరవశపరచేది నీవే।

కలం నీ చేతిలో కలగలిసిన మాయదండమై —
కాలాన్ని కట్టిపడేసే కవితలు రాస్తుంటే,
నీ ప్రతి అక్షరం ఆత్మస్పర్శగా మారి —
అనుభూతుల ఆలయంలో నిత్యదీపమై వెలుగునిచ్చేది నీవే।

సరిలేరు నీకెవ్వరూ కవిరాజా! —
నీ కవిత్వం కాలాన్ని దాటే కలువపూల సౌందర్యం,
నీ సాహిత్యం సజీవంగా నిలిచే సత్యస్వరూపం,
నీ అపూర్వ గౌరవగీతం వినగానే పులకరించేది పాఠకప్రపంచం।


కామెంట్‌లు