ప్రేమ@pending.com (Just for joke): - మిత్రాజి -( గుండవరం ప్రభాకర్ రావు పంతులు )-అత్వెల్లి గ్రామం, మేడ్చల్ జిల్లా

 మధ్యాహ్నం కాలేజీ క్యాంటీన్. వేడి వేడి సమోసాలు టేబుల్ మీద. కృష్ణ మాత్రం సుజాత వైపే చూస్తున్నాడు. 
కృష్ణ:  "సుజా, నీకు ప్రేమ అంటే ఏమిటో తెలుసా?"
సుజాత ఒక్కసారిగా సమోసా ముక్క గొంతులో ఇరుక్కున్నట్టు కళ్ళు పెద్దవి చేసింది. గబగబా వాటర్ తాగి, బుంగమూతి పెట్టింది.
సుజాత:  నాకు తెల్వదు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగితే మాట్లాడను జాగ్రత్త.
కృష్ణ  నవ్వుతూ: కోపం తెచ్చుకోకు. మరి, మొన్న నేను మన ఫ్రెండ్స్తో మీ ఇంటికి వచ్చినప్పుడు గుర్తుందా? మీ మమ్మీ అందరికీ చిన్న గిన్నెల్లో లడ్డు పొడి చేసి పెట్టింది. కానీ నువ్వు మాత్రం కిచెన్‌లోకి వెళ్లి, నాకు ఒక్కడికే గుండ్రంగా ఉన్న లడ్డు మొత్తం తెచ్చి నా చేతిలో పెట్టావు. ఎందుకూ?
సుజాత కొంచెం సిగ్గుపడుతూ, తల దించుకుంది: ఎందుకూ అంటే... ఆ టైంలో నీకు మాత్రమే ఇవ్వాలనిపించింది. అందరికీ పొడి ఇస్తే, నీకు మాత్రం లడ్డు ఇవ్వాలనిపించింది. అంతే. 
కృష్ణ ఒక్కసారిగా టేబుల్ మీద ఉన్న చట్నీ గిన్నెని పక్కకు జరిపి, హీరోలా ఫోజు పెట్టాడు: అదే సుజా, ప్రేమంటే! 
సుజాత: ఏంటి? లడ్డు ఇవ్వడమా ప్రేమంటే?
కృష్ణ: కాదు కాదు. అందరికీ ఒకలా ఉంటే, ఒకరికి మాత్రం స్పెషల్‌గా ఏదో చేయాలనిపించడం. లడ్డు పొడి అందరికీ, లడ్డు మాత్రం  నాకు ఇచ్చావు అంటే అది నామీద నీకున్న తీయని ప్రేమ. 
సుజాత కిసుక్కున నవ్వింది: ఓహో, అయితే మా అమ్మకి మీ మీద ప్రేమ పుట్టిందన్నమాట. ఆ లడ్డు అమ్మే చేసింది. నేను జస్ట్ తెచ్చిచ్చాను.
కృష్ణ షాక్ అయ్యి: ఏంటీ?! 
సుజాత: హా. అమ్మ అంది, "ఆ అబ్బాయి బక్కగా ఉన్నాడు, వాడికి లడ్డు మొత్తం ఇవ్వమ్మా" అని. నేను ఆ మాట విన్నానంతే.
కృష్ణ మొహం మాడిపోయింది. పక్కనే ఉన్న రవి, శీను ఒక్కసారిగా పగలబడి నవ్వారు.
రవి: ఒరేయ్ కృష్ణా, లడ్డు ప్రేమ కాదురా... లడ్డూ అయిపోయావ్ నువ్వు!
కృష్ణ బాధగా సమోసా కొరుకుతూ: నా ప్రేమకథలో కూడా మీ అమ్మే విలన్ అయ్యిందా సుజా?
సుజాత నవ్వు ఆపుకుంటూ, తన ప్లేట్‌లోని చివరి సమోసా ముక్క తీసి కృష్ణ ప్లేట్‌లో పెట్టింది: సర్లే బుజ్జి, అమ్మ లడ్డు ఇచ్చింది. నేను సమోసా ఇస్తున్నా. ఇది ప్రేమ కాకపోతే మరేంటి?
కృష్ణ కళ్ళు మెరిశాయి: నిజమే! ప్రేమకి రూపం మారింది. లడ్డు కాస్తా సమోసా అయ్యింది. 
శీను: ఒరేయ్ ఆపండ్రా మీ ప్రేమ పురాణం. బిల్లు ఎవరు కడతారు? అది ముందు తేల్చండి.
కృష్ణ, సుజాత ఒక్కసారిగా ఒకరి మొహం ఒకరు చూసుకుని: మీరే! 
క్యాంటీన్ మొత్తం నవ్వులతో మారుమోగిపోయింది. ప్రేమ లడ్డులా తియ్యగా మొదలై, సమోసాలా కారంగా, బిల్లు లాగా చేదుగా ముగిసింది.
రవి బిల్లు చేతిలో పట్టుకుని లెక్కపెడుతున్నాడు: మొత్తం 240 రూపాయలు. మిల్ట్రీ సిస్టం కిందా తలా 60. తియ్యండి బాబూ. 
కృష్ణ వెంటనే సీరియస్ అయిపోయాడు: ఆగు ఆగు. ప్రేమకు లెక్కలు ఉండవురా. సుజా నాకు సమోసా ఇచ్చింది. అంటే నా మీద ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమికుల బిల్లు ఫ్రెండ్స్ కట్టడం ధర్మం.
శీను: ఒరేయ్ వేదాంతం, ధర్మం పక్కన ఆపి డబ్బులు తియ్. ప్రేమ ఉందని మేము తిండి మానేస్తామా ఏంటి?
సుజాత కళ్ళు ఎగరేస్తూ: ఎవరు ప్రేమికులు? నేను జస్ట్ పాపం అని సమోసా ఇచ్చాను. వాడి మొహం లడ్డు పోయిన దానిలా ఉంది కదా అని.
కృష్ణ గుండెలు బాదుకుంటూ: అమ్మో! లడ్డు పోయింది, సమోసా పోయింది, ఇప్పుడు పరువు కూడా పోయేలా ఉంది. సుజా, నీకు నిజంగా నా మీద జాలేనా, ప్రేమ లేదా?
సుజాత చిలిపిగా: ఉంది... కానీ అది 60 రూపాయల కంటే తక్కువ. 
క్యాంటీన్ అంకుల్ అటుగా వచ్చి: బాబూ, మీ సోది ఆపి బిల్లు కట్టి లేవండయ్యా. మీ వెనక జనాలు వెయిటింగ్.
రవి: అంకుల్, వీళ్ళ ప్రేమకథ వింటే మీరు ఫ్రీగా టీ ఇస్తారా?
అంకుల్: ప్రేమకథ చెబితే టీ ఫ్రీ కాదు. బిల్లు కట్టకపోతే మాత్రం గిన్నెలు కడగడం ఫ్రీ. 
కృష్ణ వెంటనే జేబులో నుంచి 100 నోటు తీసి అంకుల్ చేతిలో పెట్టాడు: హీరోలు ఎప్పుడూ వెనక్కి తగ్గరు సుజా. ఇదిగో బిల్లు నేనే కడతా. ఇదే ప్రేమంటే!
సుజాత షాక్ అయ్యి: 240 బిల్లుకు 100 ఇస్తే ప్రేమా? అది మోసం రా.
కృష్ణ కాన్ఫిడెంట్‌గా: కాదు, ఇది EMI ప్రేమ. మిగతాది నెక్స్ట్ బర్త్‌డేకి కడతా. వడ్డీతో సహా.
శీను పక్కనుంచి: ఒరేయ్ ఆపురా. నువ్వు ప్రేమ పేరుతో క్యాంటీన్‌లో లోన్ తీసుకుంటున్నావ్. 
సుజాత నవ్వు ఆపుకోలేక: సరే కృష్ణా, నీ ప్రేమ లడ్డులా తియ్యగా లేదు, సమోసాలా కారంగా లేదు. UPI లాగా ‘Pending’ లో ఉంది. Success అయ్యాక మాట్లాడుదాం.
అందరూ మళ్ళీ గట్టిగా నవ్వారు. కృష్ణ ఫోన్ తీసి గబగబా PhonePe ఓపెన్ చేశాడు.
కృష్ణ: సుజా, ప్రేమ Pending లో ఉండకూడదు. ఇప్పుడే Success చేస్తా. PIN చెప్పు... అదే నీ హృదయం PIN. 
సుజాత: నా హృదయం PIN? ‘1234’. అందరూ గెస్ చేసేస్తారు జాగ్రత్త. 
కృష్ణ: అయ్యో! నా ప్రేమకథలో Password కూడా Weak ఉందా?!
సుజాత కాఫీ సిప్ చేస్తూ: పాస్‌వర్డ్ వీక్ అయినా పర్లేదు కృష్ణా, నీ ప్రేమకి Two-Step Verification పెట్టా. మొదట నా అమ్మ OK చెప్పాలి, తర్వాత నేను OTP ఇస్తా!
క్యాంటీన్ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయింది. కృష్ణ మాత్రం "అత్తగారి అనుమతి లేని ప్రేమ, OTP లేని Transaction లాంటిది" అని మూలుగుతూ బిల్లు మొత్తం కట్టేశాడు.

కామెంట్‌లు