శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 101
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
80. కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృత్య 
(షోడశాక్షరీ)
81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా 
(షోడశాక్షరీ)
ఎభైయ్యవ నామ మంత్రము - 
  ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికాయై నమః
తనచేత సృష్టి చేయబడిన జీవుల మనుగడకే ముప్పు కలిగించే విధంగా శక్తి సేనలపైన చెలరేగిపోతున్న భండుడు, మరికొంతమంది అతని సైన్యాన్ని అంతమొందించడానికి, పరమేశ్వరి "మహా పాశుపతము" అనే అస్త్రాన్ని ప్రయోగించింది. భండునితోపాటు, అతని సేన, ఇంకా అతని నగరము కూడా అంతమయ్యాయి. ఇది చూసిన జగన్మాత ఎంతో సంతోషాన్ని అనుభవించింది. అలా సంతోషం తో వెలిగిపోతున్న అమ్మను చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా" అని కీర్తించారు. అటువంటి శ్రీమహారాజ్నికి నమస్కారము.
రుద్రుడు మొదలు పిశాచాల వరకూ ఉన్న జీవులు అందరూ "పశువులు" గా పిలువబడతారు. ఈ పశువులకు అధిపతి అయిన శివుడు "పశుపతి" అయ్యాడు. ఈ పశుపతి యొక్క ఆయుధము, "పాశుపతము".  ఈ పాశుపతము రెండు విధములు. ఒకటి "పాశుపతము" - దీని అభిమంత్రణ లేదా అధిదేవత "షడక్షరీ" గా ఉంటుంది. ఇది శంభుని చేతిలో ఉన్న అస్త్రము. రెండవది, "మహా పాశుపతము". ఇది "చతుర్దశాక్షరీ" అనే పద్నాలుగు అక్షరముల మంత్రాధీనంగా ఉంటుంది. ఈ మహాపాశుపతము, "సదాశివుని" చేతిలో ఉంటుంది.
జయవిఘ్న యంత్ర నాశనం తరువాత, భండాసురుని సేనలను, శక్తి సేనలు వివిధరకాల అస్త్ర, శస్త్ర ప్రయోగం ద్వారా నాశనం చేసాయి. కానీ, భండుడు, మరికొందరు మెరికలవంటి సేన అమ్మ ఓపికను విపరీతంగా పరీక్షిస్తున్నాయి. ఇంక యుద్ధాన్ని త్వరగా ముగించాలని నిర్ణయించుకున్న జగన్మాత, "మహాపాశుపతాన్ని" ప్రయోగించింది. ఈ ‌అస్త్రం యోక్క మంత్ర ప్రభావంతో, భండుడు, అతని మిగిలిన కొద్దిపాటి సైన్యమూ మాత్రమే కాకుండా, భండుని రాజ్యం కూడా నాశనం అయ్యింది. ఈ వినాశన్ని కళ్ళారా చూసిన అమ్మ "మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా" అయ్యింది.
భండాసురుడు, అతని సైన్యం మనలోని అహంకారం, అజ్నానం, మంద, మత్సరాలకు ప్రతీకలు. ఇవి మానవులను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కలి ప్రాభవం చేత, తన సృష్టి లో పేట్రేగిపోతున్న ఈ దుష్ప్రవర్తన లక్ణాలను రూపు మాపడానికి, సమూలంగా పెరికి వేయడానికి, అమ్మ మహాపాశుపతం అనే అస్త్రం ద్వారా మనందరికీ "జ్ఞానాన్ని" పంచి, మనమందరినీ సత్ప్రవర్తన దారిలోకి మళ్ళించి, సన్మార్గులను చేసి, తనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు 
ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు