శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 105
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
84. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషదా 
(షోడశాక్షరీ)
85. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా 
(షోడశాక్షరీ)
ఎనభై ఐదవ నామ మంత్రము - 
  ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః
పరమేశ్వరికి స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూష్మతమము అనే నాలుగు రూపాలు ఉన్నాయి. "పంచదశీ మంత్రము" లోని మొదటి ఐదు అక్షరములను "వాగ్భవ కూటమి" అంటారు. అమ్మ స్థూల రూపములో, ఈ ఐదక్షరముల "వాగ్భవ కూటమి" యే అమ్మ తల నుండి మెడ వరకు ఉన్న ముఖ పద్మము గా కనిపిస్తూ, కాంతులను వెదజల్లుతూ ఉంది. ఆ "వాగ్భవ కూటమి" ప్రతి రూపము అయిన అమ్మ ముఖ పద్మము ను చూచి, వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా" అని కీర్తించారు. ఈ విధమైన ముఖపద్మము కలిగిన అమ్మకు నమస్కారము.
అమ్మ 4 స్వరూపములు అయిన స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూష్మతమము లలో, స్థూల రూపములో అమ్మ యొక్క బాహ్య సౌందర్యంను, స్థూల రూపమును, చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను వివిధ నామాలతో పిలిచి తాము పరవశించి, జగన్మాతకు ఆనందాన్ని కలిగించారు. పన్చదశాక్షరీ మంత్రములో ఉన్న అక్షరములే అమ్మ యొక్క "సూష్మ శరీరము". ఈ సూష్మ శరీరము మంత్ర శరీరము. ఇప్పుడు వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారిక యొక్క సూక్ష్మ శరీరంను వర్ణన చేస్తున్నారు.
జగజ్జనని  సూక్ష్మ రూపము ప‌‌న్చదశ అక్షరముల మంత్రాధీన రూపంలో ఉంటే, మొదటి ఐదు అక్షరముల వాగ్భవ కూటమి అయిన "క, ఏ, ఈ, ల, హ్రీం" అమ్మ ముఖపద్మము అయింది. పన్చదశాక్షరీ మంత్రమునకు "శ్రీ" అనే అక్షరాన్ని జేర్చి, దీనిని శోడషాక్షరీ మంత్రంగా చూసే విధానం కూడా ప్రాచుర్యం లో ఉంది.
"కామకళాత్మకము - సూక్ష్మ సూక్ష్మతర శరీరము; కుండలినీ రూపము - సూక్ష్మతమ శరీరము.
*"క, ఏ, ఈ, ల, హ్రీం" అనే ఐదక్షరముల సమూహము అమ్మ ముఖపద్మము ను తెలిపే "వాగ్భవ కూటమి" అని తెలుసుకున్నాము కదా. ఈ కూటమి యొక్క ధ్యానము వలన అన్ని విద్యలూ, జ్ఞానం కలుగుతాయి. 
ఈ "వాగ్భవ కూటమి"ని ధ్యానం చేసే తన సాధకులకు జ్ఞానాన్ని, సకల విద్యలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు 
ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు