శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 106
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
85. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా 
(షోడశాక్షరీ)
86. కణ్ఠాధఃకటిపర్యన్తమధ్య కూట స్వరూపిణీ 
(షోడశాక్షరీ)
ఎనభై ఐదవ నామ మంత్రము - 
  ఓం కణ్ఠాధఃకటిపర్యన్తమధ్య కూట స్వరూపిణై నమః
పన్చదశాక్షరీ మహామంత్రం లోని మొదటి ఐదు అక్షరముల, "క, ఏ, ఈ, ల, హ్రీం" కూటమి, "వాగ్భవకూటమి" అని, ఈ కూటమి పరమేశ్వరి యొక్క తల నుండి మెడ భాగము వరకు, అంటే, అమ్మ యొక్క ముఖ పద్మము ను ప్రతిఫలింపచేస్తుంది అని ముందు నామములో తెలుసుకున్నాము. పన్చదశాక్షరీ మహామంత్రం లోని ఆరక్షరముల రెండవ కూటమి, "హ, స, క, హ, ల, హ్రీం" ను "కామరాజకూటమి" అంటారు. ఈ కామరాజకూటమి తో ప్రకాశిస్తున్న జగన్మాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "కణ్ఠాధఃకటిపర్యన్తమధ్య కూట స్వరూపిణీ" అని కీర్తించారు. ఈ విధంగా కామరాజకూటమి లో ప్రకాశిస్తున్న, అమ్మలగన్నయమ్మకు నమస్కారము.
ఈ "కామరాజకూటమి" పరమేశ్వరి యొక్క స్థూల శరీరం లో మెడ భాగం నుండి నడుము భాగము వరకు సూచిస్తుంది. మెడ - నడుము యొక్క మధ్య భాగం లోనే జగన్మాత హృదయ స్థానం ఉంది. ఈ హృదయ స్థానమే అన్ని కోరికలకు మూల స్థానము. కామరాజు అంటే కామేశ్వరుడు అయిన పరమేశ్వరుడే. పరమేశ్వరుని శాశ్వత నివాస స్థలం అమ్మ హృదయ ఫలకమే కదా! అమ్మ, అయ్యలకు సృష్టి కార్య సిద్ధి కోసం కోరిక పుట్టే స్థలం కూడా పరమేశ్వర, పరమేశ్వరి యొక్క హృదయమే కదా! అందుకనే, "కణ్ఠాధఃకటిపర్యన్తమధ్య కూట స్వరూపిణీ" అయ్యింది.
పరమాత్మ యొక్క ఆత్మ రూపాలుగా ఈ జగత్తుకు వచ్చిన మానవులకు గానీ, సూక్ష్మ రూపంలో ఉన్న దేవతామూర్తులకు గానీ, గుండె అనబడే హృదయ స్థానం, మెడ మరియు నడుముల మధ్యనే ఉంటుంది. ఈ గుండె లేదా హృదయమే అన్ని విధాలైన కోరికలు, అనురాగాలు, ఆత్మీయతలు, ప్రేమలు, విరహాలు, మొదలైన లక్షణాలకు ఆయువు పట్టు. అందుకనే, "శ్రీవిద్యలో పన్చదశాక్షరీ మహామంత్రం మధ్యలో వున్న హ, స, క, హ, ల, హ్రీం - షడక్షర కూటమి - కామరాజకూటమి గా పిలువబడింది".
"దహర = సూక్ష్మాతి సూక్ష్మమైనది.  "దహర ఆకాశం = ప్రతీ జీవి మనసులోపల ఉన్న అతి చిన్నదైన, పవిత్రమైన చోటు - పరమాత్మ యొక్క స్థానము" ఈ దహరాకాశం, అమ్మ సూక్ష్మ శరీరం లోని కామరాజకూటమి మధ్యలో ఉంది. ప్రతీ మనిషి యొక్క హృదయం లోకూడా ఉంది. కామేశ్వరీ కామేశ్వరుల యొక్క ఆపేక్ష కు, ఆనురాగాలకు మూల బిందువు ఈ "దహరాకాశ"మే. ఈ "కామరాజకూటమి" ని, అమ్మ యొక్క సూక్ష్మ శరీరం లో "మధ్య కూటమి" అని కూడా అంటారు అని చెప్పింది భాస్కరరాయలవారి "సౌభాగ్య భాస్కరం".
ఈ విధంగా పరమేశ్వరుని జగత్ సృష్టి అనే కోరికలకు ఆధారభూతమై, తన సాధకులకు నిరంతరం చేయూతనిచ్చి, ఆలంబనగా నిలిచి, సకల కల్యాణములనూ ఇచ్చే శ్రీమాతను పూజించేటప్పుడు 
ఓం కణ్ఠాధఃకటిపర్యన్తమధ్య కూట స్వరూపిణీ నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు