శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ : - భాగం - 110
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
89. మూలకూటత్రయ కళేబరా (దశాక్షరీ)
90. కులామృతైక రసికా (అష్టాక్షరీ)
తొంభైయవ నామ మంత్రము - 
  ఓం కులామృతైక రసికాయై నమః
మూలాధార చక్రము నుండి జాగృతము కాబడిన కుండలినీ శక్తి, సుషుమ్న మార్గములో ప్రయాణం చేసి, షట్చక్రాలనూ, బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులనూ భేదించి, బ్రహ్మ రంధ్రానికి చేరి, అక్కడ సహస్రారం లో స్రవించిన "కులామృతము" అనబడే అమృతధారలో మునిగి, ఆ అమృత వర్షం పై ప్రీతితో ఉన్న పరమేశ్వరి ని చూసి వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "కులామృతైక రసికా" అని కీర్తించారు. ఆ అమృత ధారలమీది ప్రీతితో ఉన్న ఆదిపరాశక్తి కి నమస్కారము.
"కులము = సహస్రారము".  85వ నామం నుండి 89వ నామం వరకూ అమ్మ యొక్క "పన్చదశాక్షరీ మహామంత్రం" అర్ధం చేసుకునే ప్రయత్నం చేసాము, పరమేశ్వరి కృపతో. ఇప్పుడు, ఈ 90వ నామం నుండి "కుండలినీ శక్తి" గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ని అనుగ్రహించమని వేడుకుంటూ. సూక్ష్మంగా, క్లుప్తంగా చెప్పాలంటే, తామరతూడులోపల ఒక సన్నని దారం ఆకారంలో "కుండలినీ శక్తి" గుండ్రంగా మూడున్నర చుట్టలుగా చుట్టుకుని పడుకుని ఉంటుంది. యోగులైన సాధకులు, తమ సాధన చేత, యొగాభ్యాసము చేత, కుండలినీ శక్తిని నిద్రలేపి, మూలాధార మొదలైన 6 చక్రములను, బ్రహ్మ, విష్ణు, రుద్ర అనబడే మూడు గ్రంధులనూ ఛేదించి, సహస్రార చక్రము వరకూ తీసుకుని వెళతారు. అక్కడ, సహస్రార పద్మము లోని చంద్రమండలములో పొంగుతున్న అమృతధారలను, కుండలినీ శక్తి రూపంలో ఉన్న అమ్మ, ఆ అమృత ధారలలో ఓలలాడుతూ ఉంటుంది. అలా అమృత ధారలతో ఎంతో తృప్తి చెందిన పరమేశ్వరి, "కులామృతైక రసికా" అయ్యింది.
ఒకే జాతిలో ఉండే సముదాయానికి "కులము" అని పేరు. ఈ ఒకే జాతిలో ఉండే వారికి, జ్ఞానము, జ్ఞాతము , విజ్ఞేయమ ఈ మూడూ ఒకే స్థాయిలో ఉంటాయి. అందుకనే "కులము" అనే పేరు వచ్చింది. ఇక్కడ "కులము", మనం వాడుక భాషలో వాడబడే "కుల" శబ్దం కాదు, అని గ్రహించాలి. "చాతుర్వర్ణాం మయాస్రష్టం" అని కదా, పరమేశ్వరుడు గీతలో చెప్పారు. ఆ చాతుర్వర్ణాలుగా చెప్పబడిన "బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులకు "కులము" అనె పదం వర్తిస్తుంది. ఈ కులముల వారు అమ్మకు సమర్పించే హోమ ద్రవ్యాలు, వరుసగా ఆవుపాలు, నెయ్యి, తేనె, చెరకు రసము, అమ్మకు "అమృతతుల్యములు.
పైన చెప్పుకున్నట్టు, ప్రతీ జ్ఞానాములోనూ విజ్ఞాత, విజ్ఞానము, విజ్ఞేయము అనే మూడూ ఉంటాయి. వీటిని "త్రిపుటి" అంటారు. జ్ఞాత = తెలాయువాడు; వజ్ఞానము = మోక్ష సంబద్ధమైన బుద్ది; జ్ఞేయము = తెలుసుకో దగినది. కులము = సమూహము. మూలాధారమూ, సుషుమ్నా మార్గాలూ, సహస్రార పద్మమూ, ఈ మూడింటినీ, కులము లేదా సమూహము అని చెప్తాము. ఈ కులము నుండీ వచ్చే అమృత ధారలు పరమేశ్వరికి అత్యంత ప్రీతి అయిన విషయం. ఈ అమృత వర్షం లో తడిసి ముద్దిఅవుతు, తన సాధకులకు ఎప్పుడు అనుగ్రహం ఇద్దామా అని సంసిద్ధయై ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు 
ఓం కులామృతైక రసికాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు