తెల్లవారటానికి నాందీగా,వేగుచుక్క మొలిచింది అప్పుడే భూమి మీద పడ్డ పసికూన కెవ్వుమని కేక వేసింది... అందరి ముఖాలలో ఆనందం ఇల్లంతా ఒకటే సందడి.
అదే మానుకోట సమీపంలో ఉన్న రాజోలు గ్రామంలో సరికొండ చలపతిరావు గారి ఇంట్లో ...
ఆ రోజుల్లో అన్నదమ్ములు అక్కచెల్లెళ్లకు
పురుడు పోయటం వారి బాధ్యతగా భావించేవారు.
అలా రత్నమ్మ గారు తన అన్నగారింట్లో పురుడు పోసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
సరిగ్గా శుక్ల నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పాడ్యమినాడు. తేదీ...10.05. 1929.
ఘనంగా బారసాల నిర్వహించి, వరవరరావు అని నామకరణం చేసినారు.మూడవ నెలలో కచ్చడం బండి మీద చెల్లెలి స్వగ్రామమైన పాతర్లపాడుకు పెట్టుపోతలతో ఘనంగా పంపించినారు.
కేశరాజు వెంకటకిషన్ రావు రత్నమ్మ గార్ల తృతీయ సంతానమైన వరవరరావు పాతర్లపాడు గ్రామంలో దినదిన ప్రవర్తమానమై వరంగల్ లో ఉర్దూ బడిలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు.
ఉపాధ్యాయ వృత్తి మీద మక్కువతో ఆనాటి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొంతకాలం నరసింహులపేటలో కొనసాగారు. స్వాతంత్ర్య సంగ్రామం పట్ల ఆకర్షితులై ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో దళనాయకుడిగా పాల్గొన్నారు వరవరరావు ఉరఫ్ వరహాల రావుగా. కానీ అందులో జరుగుతున్న హింస అరాచకం దౌర్జన్యం పట్ల అసంతృప్తి... తనను శాంతిగా పనిచేయనీయలేదు.
అందుకే,పురుషోత్తమాయగూడెం గడీపై చేసిన దాడితో వికలమనస్కుడై అది సరియైన పంథా కాదని నిర్ణయించుకొని తన మార్గాన్ని మార్చుకొని ఆనాటి జాతీయ కాంగ్రెసులో చేరినారు.
ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో, హయగ్రీవా చారి, బొమ్మ కంటి సత్యనారాయణ గారు, జూపల్లి రంగారావు గార్ల సారధ్యంలో నడుస్తున్న మంగోల్ కాంగ్రెస్ క్యాంపులో చేరి రజాకార్లతో ఎన్కౌంటర్లలో పాల్గొని మృత్యువును ఎదిరించి నిలిచిన మృత్యుంజయుడు.
ఆయనను జీవన పర్యంతం కలవర పెట్టిన ఒక సంఘటనను ఇక్కడ చెప్పుకోకపోతే తప్పు చేసినట్టు అవుతుంది. సమయం మధ్యాహ్నం పన్నెండు దాటింది,
క్యాంపు లో ఉన్న సభ్యులందరూ భోజనం చేస్తున్నారు,
అందరికీ అన్నం వండి పెట్టి ఆకలి తీరుస్తున్న రంగాచారి గారు వంగి అన్నం వడ్డిస్తున్నారు...
అప్పుడే గుర్రాలపై వచ్చిన ముష్కర మూకలు రజాకార్లు ఆ క్యాంపుపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించారు, ఒక తుపాకీ తూటా గుండు ఆచారిగారి చెవిని చెక్కుతూ దూసుకుపోయింది...
తెల్లని అన్నం రక్తసిక్తమై బలి కోరింది ... ఎవరికివారు పొలాల గట్ల చాటున,భూమి మీద పడుకొని పొజిషన్ తీసుకొని ఎన్కౌంటర్ చేస్తుంటే, రజాకార్ల తుపాకీ గుళ్ళు పైనుంచి భయంకరంగా దూసుకుపోతుంటే, క్షణక్షణం ఎంతో భీతి గొలిపింది. ప్రాణాలకు తెగించి పోరాడిన ఆ పోరాటంలో ఒక రజాకారు మృతి చెందడంతో ఆ రజాకార్లు ఆ శవాన్ని తీసుకొని పారిపోయారు.
1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు లొంగిపోయే వరకు ఆ క్యాంపుల్లో ఉండి తెలంగాణ విముక్తి కోసం అవిశ్రాంత పోరాటం చేసిన స్వతంత్ర సేనాని శ్రీ కేశరాజు వరవరరావు ఉరఫ్ వరహాలరావు.
స్వతంత్ర సంగ్రామం నుంచి తిరిగి వచ్చి పాతర్లపాడులో
మొట్టమొదటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా కొంతకాలం విధులు నిర్వహించారు , అదీ నచ్చక వదిలేసి తమ కుటుంబానికి ఉన్న వ్యవసాయ భూములలో వ్యవసాయం చేయాలని మొట్టమొదట ఆయిల్ ఇంజన్ ను తీసుకువచ్చి పొగాకు తోట వేసిన వ్యవసాయదారుడు.
చెట్లు పెంచడం పంటలు పండించడం నూతన పద్ధతులలో సాగు చేయటం ఎంతో ఇష్టం. అందుకే ఇంకా ఏదో చేయాలనే తపన ఆరాటం.
1951 చివరిలో గార్ల వాస్తవ్యులు మాటేటి జనార్దన్ రావు జేష్ఠ పుత్రిక నీలాదేవిని వివాహం చేసుకున్నారు.
ఒకే ఇంట్లో నలుగురి అన్నదమ్ముల కుటుంబాలు తల్లి తండ్రి అందరూ కలిసిన ఉమ్మడి కుటుంబం .
ఎంత పంట పండించినా, అన్నలు అమ్మేసుకోవటం వలన ఇబ్బందులు తప్పలేదు.
అందుకే ఇరువురు కుమారులు కలిగిన తర్వాత
నామాలపాడుకు కుటుంబాన్ని మార్చినారు.
అక్కడ తనకున్న భూములలో కొంత భాగం, రాజోలు లోని నలభై అయిదు పేద కుటుంబాల వారినితీసుకుని వచ్చి, ఇండ్లు కట్టించి ఒక కొత్త ఊరును తయారు చేశారు.
నిత్యం ఎంతో మంది వచ్చి భోజనం చేయకుండా వెళ్లేవారు కాదు. దానధర్మాలతో ఎప్పుడు ఇల్లంతా ఒకటే సందడి. అదే కాకుండా సంతానం కూడా ఆరుగురికి పెరిగిపోయింది. ముగ్గురు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు. ఏ పండుగ వచ్చినా ఊరందరికీ పంచవలసిందే.
అప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉండేది... అది తట్టుకోలేక చాలామంది బట్టలు అడిగేవారు లేదనకుండా ఒంటిమీద ఉన్నదైనా విడిచి ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు.
నక్సలైట్ ఉద్యమం జోరు జోరుగా సాగుతున్న సమయం
ఒకరోజు గడ్డం వెంకట్రామయ్య బృందం నాన్నగారి వద్దకు వచ్చి ఆయన దగ్గర ఉన్న లైసెన్సుడ్ గన్ తో సహా ఆయనను అడవిలోనికి తీసుకొని పోయారు.
అప్పటికే ఆ ప్రాంతంలో తుపాకులు ఉన్నవారిని బెదిరించి తుపాకులు లాక్కొని పోయారు. గంధంపల్లిలో ఒకరిద్దరిని చంపడం వలన ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయిన సందర్భం కూడా ఉంది. అందుకే మా అమ్మగారు మేము చాలా భయపడిపోయి ఏడ్చాము.
నేను కూడా నాన్న గారితో వెళ్ళాను. బయ్యారం పెద్ద చెరువు కింద ఉన్న కీకారణ్యం బుడుగు లో ఓ చెట్టు క్రింద నాన్న గారిని కూర్చోబెట్టారు... నన్ను కొంచెం దూరంలో కూర్చోబెట్టారు. నాన్నగారిని చాలా గౌరవంగా చూశారు సాయంత్రం వరకు కూర్చోబెట్టి తుపాకీతో సహా ఇంట్లో దిగబెట్టి పోయారు, అంటే ఇక్కడ నాన్నగారు పేదల పాలిటి ప్రత్యక్ష దైవం, అందుకే నాన్నగారికి ఎటువంటి హాని తలపెట్టకుండా గౌరవంగా ఇంట్లో దించిపోయారు.
అనతి కాలంలోనే ఆస్తి మొత్తం హరించుకుపోయింది. ఎవరు వచ్చి అడిగినా లేదు అనే పదం ఆయన నోటి వెంట బతికున్నంత వరకు రాలేదు అంటే అతిశయోక్తి కాదు.
రాణీ రుద్రమదేవి కాలంలో పోయించిన రాయికుంట చెరువు ఎప్పుడు తెగిపోయిందో ఎవరికి తెలియదు, దానిని పునరుద్ధరించారు.అది తలకు మించిన ఆర్ధిక భారం కావటంతో, ఆర్థిక పతనానికి దారి తీసింది.
అటవీ సిబ్బంది, కలెక్టర్లు ,ఎస్పీలు, ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు సిద్ధారెడ్డి గారితో సహా అందరూ తరచుగా మా ఇంటిని సందర్శించేవారు వీళ్ళందరికీ మా నాన్నగారే భోజన సదుపాయాలు కల్పించేవారు.
అంతే కాదు అక్కడ ఆ రోజుల్లో, వర్షాభావం వలన పంటలు పండక పోవడం, వేసిన పంటలు అడవి జంతువుల పాలు కావటం వలన, కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చింది.అందుకే
ఖర్చుల నిమిత్తం విడతల వారీగా భూమిని అమ్మటం జరిగేది.
అలా 1970 వచ్చేసరికి ఆస్తి చేజారిపోయింది. ఆరుగురు పిల్లలు అన్నమో రామచంద్ర అంటూ, ఉపవాసాలతో సోయితప్పి పడి పోయిన పసికూనలు...
అది తెలిసిన "వరసా కన్నయ్య"అనే ఒక కోయ అతను ఒక తవ్వెడు బియ్యం పట్టుకొచ్చి, ఏంది దొరా ఇంత కష్టం వచ్చింది నీకు అంటూ ఆ బియ్యం ఇస్తుంటే , వద్దని వారించినా, నువు చేసిన సాయం లో ఇదెంత దొరా, అని కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే, అంతటి ఆకలి బాధ లో కూడా మా నాన్న దేవుడిలా కనిపించారు నాకు.
ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వండింది అమ్మ, తినటానికి సమాయత్తమవుతున్న సమయంలో, ఇల్లెందు నుంచి అనంతారం నడిచి వెళుతున్న నలుగురు గుర్రపోళ్ళు ఇంటికి వచ్చారు.
వీరు తుపాకులు బాగు చేసేవారు, మంచి నిష్ణాతులు, ఇంటి ముందు నిలబడి దొరగారు అని పిలవగానే నాన్న వెళ్లారు, వాళ్లను చూసి, ఏంటి ఇటు వచ్చారు అని అడిగారు నాన్న, ఏం లేదయ్యా, ఇల్లెందు నుంచి ఇంటికి వెళుతున్నాం, మధ్యాహ్నం అయింది కదా దొరా, ఇంత అన్నం పెట్టించండి అని అడిగారు...
అంతే, వండిన అన్నం దానిలోకి చారు మొత్తం వాళ్ళకు వంపి, కడుపు నిండా తినండి అని చెప్పిన మహానుభావుడు అభినవ శిబి చక్రవర్తి మా నాన్న. ఇంట్లో స్పృహ తప్పి పడిపోయిన పసికూనలున్నప్పటికీ.
ఇక అక్కడ ఏ మాత్రం ఉండలేని పరిస్థితి చివరికి మిగిలిన పెద్ద బండి, కచ్చడం బండి గంధంపల్లిలోని ఆసామి విష్ణురావుకు అమ్ముకుని మళ్ళీ పాతర్లపాడు
కుటుంబంతో చేరుకున్నారు.
ఆదాయం లేదు ఆస్తి లేదు ఆకలి మంటలతో అల్లాడే బండెడు సంతానం తప్ప ఇంకేమీ మిగలలేదు. ఆయన చేసుకున్న పుణ్యమేమో! పెద్ద కుమారుడు ప్రతాప సింహా రావు ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో చేరాడు. నాన్నగారికి ఒకింత ఉపశమనం కలిగింది.
ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులకు పెన్షన్ మంజూరు చేయుటకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
ఆ సమయానికి నాన్న గారితో కలిసి పని చేసిన ఉద్దండ ఉద్యమకారులు అనేక మంది ఉన్నత పదవుల్లో విరాజిల్లుతున్నారు... అందుకే నాన్నగారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వ పెన్షన్ మంజూరు చేయించి తామ్ర పత్రంతో సత్కరించారు.
వతన్ దారు అయినా ఆ వృత్తిని చేయటం ఇష్టం లేక చేయలేదు, రుసుం దొరల కుటుంబం అయినా దర్పం చూపలేదు, జమిందార్ అయినా జనం కోసం బ్రతికిన
మనసున్న మారాజు.
అలా మా నాన్న గారి జీవితం నాకు ఎంతో ఆదర్శం... అణగారిన వర్గాలతో, తాడిత పీడిత జన హితం కోసం ఆయన నడిచిన బాటలోనే నేను నడిచాను, నడుస్తున్నాను.
ఆవిధంగా,ఆదర్శ ప్రాయుడైన స్వతంత్ర సేనాని మా నాన్నగారు...11. 09 .2006 న యశోదా హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్ లో తుది శ్వాస విడిచినా ,
వారి ఆదర్శాలు మాత్రం నా చేయి విడువక, అడుగడుగునా ఈ నాటికీ నాకు ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి